
అంతరిక్షాన్ని దాటి గ్రహాలను పలకరించి, సూర్యుడిపై సైతం నిశితంగా చూపు సారించేందుకు తహతహలాడుతున్న మనిషి తన కాళ్లకిందనున్న నేలలో జరిగే కల్లోలం ఏమిటో, అది ఎప్పుడు ఎందుకు కంపించి పెను విపత్తుల్ని తెచ్చిపెడుతున్నదో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాడు. అంతా అయినాక భూకంప కేంద్రం ఎక్కడో, దాని తీవ్రత ఏపాటో చెప్పగలుగుతున్నా ముందుగా పసిగట్టడం అసాధ్యంగానే ఉంది.
సోమవారం అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో ఇంతవరకూ 1,400 మందికి పైగా మరణించగా వేలాది మంది గాయపడ్డారు. ఆకలి, అనారోగ్యం, పేదరికం వంటి అనేకానేక క్లేశాలతో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్రజలకు అక్కడి తాలిబన్ పాలకులు అదనపు సమస్య. వారి విధానాలను సాకుగా చూపి పలు దేశాలు ఇప్పటికీ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. భారత్ గుర్తించకపోయినా వివిధ రూపాల్లో దౌత్యం నెరపుతున్నది.
ఇప్పుడు తక్షణ సాయం అందించింది. 2021 ఆగస్టులో తాలిబన్‌లు కూలదోసిన అష్రాఫ్ ఘనీ సర్కారే చాలా దేశాల దృష్టిలో ‘నిజమైన’ ప్రభుత్వం. చాలా దేశాల్లో ఘనీ ప్రభుత్వ రాయబార కార్యాలయాలే ఉన్నాయి. అఫ్గాన్‌కు ఆ దేశాలు అందించాల్సిన సాయమంతా ఐక్యరాజ్యసమితి సంస్థలకే వెళ్తుంది. వాటిని స్వచ్ఛంద సంస్థలు స్వీకరిస్తాయి.
అఫ్గాన్‌ను 2001–21 మధ్య తన ఉక్కు పిడికిట్లో బంధించి, ఆ దేశాన్ని అనేక విధాల ధ్వంసం చేసి నిష్క్రమించిన అమెరికా... యూఎస్‌ఎయిడ్ కింద ఏటా అఫ్గాన్‌కిచ్చే 380 కోట్ల డాలర్ల మానవీయ సాయానికి ఈ ఏడాది జనవరి నుంచి కోత విధించింది. పర్యవసానంగా ఆ సాయం 76 కోట్ల డాలర్లకు పడిపోయింది. అందుకే ఇప్పుడు తక్షణమే అందాల్సిన వైద్యసాయం మొదలుకొని పునరావాసం వరకూ అన్నిటికన్నీ పడకేశాయి.
ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రీతిలో క్రియాశీలంగా ఉన్న భూకంప ప్రాంతాల్లో అఫ్గాన్ ఉన్న హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతం ఒకటి. ఇక్కడ భారత పలక, యూరేసియా పలకలు పరస్పరం ఢీకొంటున్నాయి. పర్యవసానంగా ఏర్పడే రాపిడి వల్ల శక్తి విడుదలై అది తరంగాల రూపంలో భూ ఉపరితలానికి చేరటంతో ప్రకంపనలు జనం అనుభవంలోకొస్తాయి.
భూకంప కేంద్రం భూ ఉపరితలానికి దగ్గర లో ఉంటే ఆ ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 8 కిలోమీటర్ల లోతులో ఉందంటున్నారు.
అందువల్లే తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6గా నమోదైనా, ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎక్కువున్నాయి. లోలోతు పొరల్లో సంభవించే భూకంపాల వల్ల విడుదలయ్యే తరంగాలు ఉపరితలానికి చేరేలోపే తమ శక్తిని చాలాభాగం కోల్పోతాయి. కనుకనే నష్టం తక్కువుంటుంది.
ఉత్తర అఫ్గాన్‌లోని పామీర్–హిందుకుష్ ప్రాంతంలో భూకంపాల తీవ్రత ఎక్కువ. కానీ అవి దాదాపు 200 కిలోమీటర్ల లోతులో సంభవిస్తుంటాయి. ఇందుకు భిన్నంగా పశ్చిమ పాకిస్తాన్, ఆగ్నేయ అఫ్గాన్ ప్రాంతంలోని సులేమాన్ పర్వత శ్రేణి వద్ద భూ ఉపరితలానికి సమీపంగా భూకంప కేంద్రాలుంటాయి.
భూకంపాలు వాటంతటవే ప్రమాదకరమైనవి కాదు. అవి సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే కట్టడాలు, ఆ విపత్తు విషయంలో అక్కడి పౌరుల్లో ఉండే అవగాహన నష్టం తీవ్రతను తగ్గిస్తాయి. భూకంపాల విషయంలో ఎంతో అనుభవాన్ని గడించి, ప్రాథమిక విద్యాస్థాయి నుంచీ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న జపాన్ ఇందుకు ఉదాహరణ. అక్కడ భూకంపాన్ని తట్టుకునే విధంగా భవంతులు నిర్మించటం తప్పని సరి.
అందువల్లే భూకంప తీవ్రత ఎక్కువున్న సందర్భాల్లో సైతం జపాన్‌లో ప్రాణనష్టం కనిష్ఠంగా ఉంటున్నది. మెరుగైన, శాస్త్రీయమైన ఆవాసాల నిర్మాణానికయ్యే అధిక వ్యయాన్ని భరించే స్తోమత దారిద్య్రంలో కొట్టుమిట్టాడే అఫ్గాన్ ప్రజలకు లేదు. అందుకే స్థానికంగా లభించే మట్టి, రాళ్లు, ఇటుకలతో ఇళ్లు నిర్మించుకుంటారు.
పైగా అవి పర్వత సానువుల్లో ఉంటాయి. విపత్తుల సమయాల్లో ఒక్కసారిగా కుప్పకూలి పౌరులకు బయట పడే వ్యవధినీయవు. ఈ ఆపత్సమయంలో అఫ్గాన్‌ను ఆదుకోవటం ప్రపంచ దేశాల బాధ్యత. సాధారణ సమయాల్లో ఏం చేసినా చెల్లుతుందిగానీ, విపత్తులు విరుచుకు పడినప్పుడు అందరూ ఏకం కావాలి. మానవీయతను చాటుకోవాలి.