
విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి పోలీసుల హడావుడి
- పాత్రికేయులు, సిబ్బందిపై ప్రశ్నల వర్షం
- జనం పక్షాన గళమెత్తుతుండడంతో గొంతు నులిమే కుట్ర
- పత్రిక స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలు
- ప్రజావ్యతిరేక విధానాలపై అక్షర సమరం సాగిస్తున్న ‘సాక్షి’పై తొలి నుంచి చంద్రబాబు సర్కారు కక్షసాధింపు
సాక్షి, అమరావతి: ప్రజావ్యతిరేక విధానాలపై అక్షర సమరం సాగిస్తున్న సాక్షి మీడియాపై తొలి నుంచి చంద్రబాబు కూటమి సర్కారు కక్షసాధింపునకు తెగబడు తోంది. దీనిలోభాగంగా తాజాగా ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు పెట్టిన పోలీసులు అర్ధరాత్రి విజయవాడ ఆటో నగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలోకి దూసుకొచ్చారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు హల్‌చల్ చేశారు. సిబ్బంది, పాత్రికేయులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తున్న ‘‘సాక్షి’’ పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కక్షసాధింపు చర్యలకు తెగబడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తూ, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ... ‘‘సాక్షి’’ ఎడిటర్‌పై అక్రమ కేసు బనాయించింది. పోలీసు అధికారులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులను కల్పించలేదనే విషయాన్ని వెలుగులోకి తెచ్చి ఏ పోలీసు అధికారుల హక్కుల కోసమైతే గళమెత్తిందో, వారితోనే అక్రమ కేసు నమోదు చేయించడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం. అది కూడా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్‌తో ఫిర్యాదు చేయించి మరీ అక్రమ కేసు పెట్టడం గమనార్హం.
⇒ రాష్ట్రంలో డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్యానల్ కాలపరిమితి ఆగస్టు 31తో ముగిసింది. అయినా, పదోన్నతులు ఇవ్వకపోవడంతో డీఎస్పీలు తీవ్రంగా నష్టపోయారు. కొందరు గత నెల 31న రిటైరయ్యారు. ప్యానల్ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించేసరికి మరికొందరు రిటైరవుతారు. భారీగా ముడుపులు ఇవ్వలేదనే తమకు పదోన్నతులు ఇవ్వలేదని పలువురు డీఎస్పీలు వాపోయారు.
‘‘పోలీసు శాఖ క్రమశిక్షణను గౌరవిస్తూ బహిరంగంగా మాట్లాడలేకపోతున్నాం. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రకటనలు జారీ చేయలేకపోతున్నాం. నిరసన వ్యక్తం చేయలేకపోతున్నాం. అదే ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతుల కోసం కొంతకాలంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబునూ కలిశారు. పోలీసులం అయినందున మేం అడగలేకపోతున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయాన్ని ‘‘సాక్షి’’ వెలుగులోకి తెచ్చింది. వారి ఆవేదనను గుర్తించి, పదోన్నతులకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఉన్నతాధికారులు అందుకు విరుద్ధంగా ‘‘సాక్షి’’పై అక్రమ కేసులతో కక్షసాధింపునకు దిగడం విస్మయపరుస్తోంది.
⇒ జనుకుల శ్రీనివాస్‌తో ఇప్పించిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి స్టేషన్‌లో.. సాక్షి పత్రికపై అక్రమ కేసు బనాయించారు. బీఎన్‌ఎస్ సెక్షన్లు 61(2), 196(1), 353(2) కింద సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై క్రైమ్ నంబరు 543/ 2025 కింద సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అక్కసుతోనే వరుసగా అక్రమ కేసులు
గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం.. ‘‘సాక్షి’’ మీడియాపై అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట యథేచ్ఛగా సాగిస్తున్న అరాచకాన్ని ప్రశ్నిస్తుండడంతో గొంతు నొక్కే కుట్ర పన్నుతోంది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ అక్రమ కేసులు బనాయించడంపై కోర్టులు తప్పుపడుతున్నా ప్రభుత్వం తీరు మారడం లేదు. పత్రికలు, మీడియా, సోషల్ మీడియా, కళారూపాలతో భావ ప్రకటన విషయంలో వచ్చే ఫిర్యాదుపై కేసుల నమోదు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలను హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది.
పోలీసు శాఖతో పాటు జిల్లా మేజి్రస్టేట్లకు స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయినా, రాష్ట్ర పోలీసు శాఖ వైఖరిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎత్తిచూపుతున్న ‘‘సాక్షి’’ని అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా... ‘‘సాక్షి’’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో తనిఖీల పేరుతో హల్‌చల్ చేశారు. ఓ ఎడిటర్ నివాసంలో సోదాల పేరిట వేధింపులకు దిగడం తెలుగు రాష్ట్రాల్లో అదే తొలిసారి కావడం గమనార్హం.

⇒ గత ఏడాది విజయవాడను వరదలు ముంచెత్తిన సమయంలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసినందుకు కూడా ‘‘సాక్షి’పై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తను తెలంగాణలో దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ప్రచురించినందుకు, కర్నూలు జిల్లాలో ప్రభుత్వ టీచర్ కుటుంబం కిడ్నాప్ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చినందుకు, అదే జిల్లాలో ఓ ఐపీఎస్ అరాచకాలను ఎండగట్టినందుకు అక్రమ కేసులు నమోదు చేసి ‘‘సాక్షి’’ పత్రిక గొంతు నొక్కేందుకు యత్నించారు.
⇒ బాలికపై అత్యాచారం చేసిన దారుణాన్ని ప్రశ్నించినందుకు సాక్షి టీవీపై అక్రమ కేసు నమోదు చేయడం విభ్రాంతి కలిగించింది. ఇటీవలి భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని వీడియో ఆధారాలతో సహా ప్రసారం చేసిన సాక్షి టీవీపై కూడా అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం. తాజాగా డీఎస్పీలకు పదోన్నతులు కల్పించకుండా అన్యాయం చేస్తుండడంపై సాక్షి కథనం ప్రచురించడంపైనా ప్రభుత్వం కక్ష సాధింపునకు తెగబడింది.
పత్రికా స్వేచ్ఛకు విఘాతం పాత్రికేయ సంఘాలు
పత్రికలపై ప్రభుత్వ వేధింపులు, అక్రమ కేసులు నమోదు చేయడాన్ని పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం యత్నింస్తోందని విమర్శించాయి. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై సమష్టిగా పోరాడతామని ప్రకటించాయి.