
‘అమెరికా సొమ్ముతో, బ్రిటన్ ఆయుధాలతో ఉగ్రవాదాన్ని ఆసరా చేసుకుని యూదులు పాలస్తీనా దేశంలోకి చొరబడి అక్కడ దేశాన్ని నిర్మించుకుంటామనటం ఏం న్యాయం? నాజీల చేతుల్లో అనుభవించిన దుర్దశ వారికి శాంతి పాఠాలు నేర్పితే సర్వులూ సంతోషించేవారు’ –ఇజ్రాయెల్ ఆవిర్భావానికి అగ్రరాజ్యాలు బాటలుపరుస్తున్నప్పుడూ, యూదు ఉగ్రవాదులు మానవబాంబులుగా మారి విధ్వంసం సృష్టిస్తున్నప్పుడూ మహాత్ముడు తన ‘హరిజన్’ పత్రికలో రాసిన వ్యాసంలోని వాక్యాలివి. ఏడున్నర దశాబ్దాలుగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న విధ్వంసం, జనహననం మరిన్ని దేశాల కళ్లు తెరిపించాయి.
పాలస్తీనాను ప్రపంచపటం నుంచి తుడిచిపెట్టడానికి ఉవ్విళ్లూరుతూ గాజా స్ట్రిప్‌లో అమా నుష హత్యాకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు చెంపపెట్టులా పాలస్తీనాను లాంఛనంగా గుర్తిస్తున్నట్టు పది దేశాలు ప్రకటించాయి. బ్రిటన్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియాలు ఆదివారం... ఫ్రాన్స్, మరో అయిదు దేశాలు ఆ మరునాడూ ఈ గుర్తింపు ప్రకటన చేశాయి. ఇప్పటికే భారత్ సహా 147 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. దీంతో ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాల్లో 80 శాతం పాలస్తీనాను గుర్తించినట్టయింది.
రెండు దేశాల ఉనికిని గుర్తిస్తూ, పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటూ సమితి నిర్వహించిన ఉన్నత స్థాయి అంతర్జాతీయ సదస్సులో 33 దేశాల ప్రతినిధులు ప్రసంగించారు. ఇప్పటికే 65,300 మంది పౌరులను హతమార్చి, గాజాను మరు భూమిగా మారుస్తున్న ఇజ్రాయెల్ ఆగడాలను ఖండించిన ఈ నిండు సభకు గైర్హాజరు కావటంద్వారా అమెరికా తన నైజాన్ని చాటుకోగా, ఇజ్రాయెల్‌కు మొహం చెల్లలేదు.
పాలస్తీనాను గుర్తించటమంటే ఉగ్రవాద సంస్థ హమాస్‌కు బహుమతి ఇచ్చినట్టేనన్న ఇజ్రాయెల్, అమెరికాల తర్కం అర్థరహితమైనది. శాంతియుతంగా పాలస్తీనా కోసం పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఓ)ను బలహీనపరచటానికి 1987లో హమాస్ ఆవిర్భావానికి లోపాయకారీగా మద్దతునిచ్చింది ఇజ్రాయెలే! దాని కనుసన్న ల్లోనే జనంలో పలుకుబడి పెంచుకుని, మరో సంస్థ ఫతాపై పైచేయి సాధించి, చివరకు 2007లో గాజాలో పాలనా బాధ్యతలు చేపట్టిన హమాస్ ఉగ్రవాద విధానాలను మెజారిటీ ప్రజలు మొదటి నుంచీ వ్యతిరేకించారు.
ఎంతో పకడ్బందీగా ఉండే ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థ కన్నుగప్పి 2023 అక్టోబర్ 7న 1,200 మంది పౌరులను కాల్చిచంపి, 240 మందిని అపహరించటం వెనక కూడా ‘ఏదో జరిగిందన్న’ అనుమానాలు అనేక మందిలో ఉన్నాయి. ఆ సంగతలా ఉంచి హమాస్ దాడిని ఆసరా చేసుకుని సాధారణ ప్రజానీకంపై బాంబుల వర్షం కురిపించి వేలాదిమందిని హతమార్చటం, ఆహార పదార్థాలూ, నీళ్లు అందకుండా చేసి ఆకలిమంటల్లో ఆహుతి చేయటం ఏ విధంగా సమర్థనీయం?
ఇజ్రాయెల్ ఆగడాలను ప్రశ్నించినప్పుడల్లా అక్టోబర్ 7 ఘటన మాటేమిటని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమాయకంగా అడుగుతున్నారు. ఆయనకు ముందున్న జో బైడెన్ ఇదే తర్కంతో ఇజ్రాయెల్ దుర్మార్గాలకు మద్దతునిచ్చారు. అమెరికాలో ఉన్న యూదు ఓటుబ్యాంకుకు ఆశపడి అక్కడి పాలకులు ఇజ్రాయెల్ సాగిస్తున్న ఆగడాలకు డబ్బూ, ఆయుధాలూ సమకూరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో అమెరికా ఏకాకి అవుతున్నదని మరుస్తున్నారు.
అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పని చేసి మానవ హక్కుల కోసం, ముఖ్యంగా మహిళల, పిల్లల హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న నవీ పిళ్లై ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ అధ్యక్షురాలిగా ఇటీవల సమర్పించిన నివేదికలోని వివరాలు దిగ్భ్రాంతి గొలుపుతాయి. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, ప్రధాని నెతన్యాహూ, మాజీ రక్షణమంత్రి యోవ్ గాలెంట్, ఇజ్రాయెల్ సైన్యం నరమేధం అనదగ్గ చర్యలకు పాల్పడ్డారని ఈ కమిషన్ నిర్ధారించింది.
దీని ఆధారంగా అంతర్జాతీయ న్యాయస్థానం నరమేధం జరిగిందని ప్రకటించాల్సి ఉంది. వచ్చే నెలలో 80వ వార్షికోత్సవం జరుపుకోబోతున్న ఐక్యరాజ్యసమితి నిస్సహాయంగా మిగిలిపోవటం ప్రపంచానికి పొంచివున్న పెనుముప్పును తెలియజెబుతోంది. దౌత్యపరంగా ప్రపంచ దేశాలన్నీ తీసుకొస్తున్న ఒత్తిళ్లు ఫలించి కనీసం ఈ దశలోనైనా ఇజ్రాయెల్ దుర్మార్గాలు నివారించలేకపోతే భవిష్యత్తరాలు క్షమించవు.