
రాజకీయాల్లో ఏ నిర్ణయం ఎటువైపు లాక్కెళుతుందో చెప్పటం కష్టం. మహారాష్ట్రలో నిరుడు నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు 235 గెల్చుకుని అధికారంలోకొచ్చిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి... అంతా సవ్యంగా ఉందనుకున్న వేళ హిందీని ప్రాథమిక విద్య స్థాయిలో ఒకటో తరగతి నుంచి తృతీయ భాషగా నేర్చుకు తీరాలని జీవో తీసుకొచ్చి కష్టాల్లో పడింది.
అటు తర్వాత రాష్ట్రంలో క్రమేపీ హిందీ వ్యతిరేక, మరాఠీ ఆత్మగౌరవ ఉద్యమం బలపడు తుండటాన్ని గమనించి గత్యంతరం లేక దాన్ని వెనక్కు తీసుకుంది. కానీ ఇలా వచ్చి, అలా పోయిన ఆ జీవో చేసిన చేటు అంతా ఇంతా కాదు. రక్త సంబంధాన్ని కూడా బేఖాతరు చేసి గత రెండు దశాబ్దాలుగా పరస్పరం కత్తులు నూరుకుంటున్న రెండు దాయాది వర్గాలను అది ఏకం చేసింది.
మహాయుతికి రాజకీయంగా తగని తలనొప్పి తెచ్చిపెట్టింది. బాల్ ఠాక్రే వున్న రోజుల్లోనే అన్న దమ్ముల పిల్లలైన రాజ్ ఠాక్రే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కయ్యానికి దిగారు. వీరిలో ఉద్ధవ్, బాల్ ఠాక్రే కుమారుడు. శివసేనపై ఎవరి ఆధిపత్యం ఉండాలన్న అంశంలో అన్నదమ్ములు తగువు పడ్డారు. అవసాన దశలో బాల్ ఠాక్రే రాజీకి ఎంతగానో ప్రయత్నించినా ఇద్దరికిద్దరూ పట్టుదలకు పోయారు.
చివరకు 2005లో ఉద్ధవ్‌ను బాల్ ఠాక్రే తన వారసుడిగా ప్రకటించటంతో శివసేన నుంచి రాజ్ నిష్క్రమించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) పేరిట పార్టీ స్థాపించారు. మధ్యలో ఒకటి రెండుసార్లు కుటుంబీకంగా కలిసిన సందర్భాలుండొచ్చుగానీ ఒకే వేదికను పంచు కున్నది లేదు. రాజకీయాల్లో కలిసి పనిచేస్తామని చెప్పింది లేదు. కానీ ఆ పని మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేయగలిగారు. తప్పనిసరి హిందీ జీవోతో వారిని సన్నిహితం చేశారు.
బీజేపీకి అధికారమే పరమావధి కాదు. దాని ఎజెండా దానికుంది. దేశవ్యాప్తంగా ఎప్పటికైనా హిందీని జాతీయ స్థాయిలో అధికార భాష చేసి తీరాలన్న సంకల్పం అందులో ఒకటి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్ని వాగ్దానాలైనా ఇవ్వొచ్చుగానీ హిందీకి ప్రాముఖ్యమీయటం దాని ప్రచ్ఛన్న సంకల్పం. ఈమధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంగ్లిష్ మాట్లాడేవారంతా సిగ్గుపడే రోజొకటి వస్తుందని ప్రకటించటం యాదృచ్ఛికం కాదు.
ఆ మాటెలావున్నా బీజేపీకీ, ఠాక్రే సోదరులకూ రెండు అంశాల్లో ఏకీభావం వుంది. అవి ఒకటి – హిందూ, రెండు – హిందూస్తాన్. కానీ హిందీ విషయంలోనే ఆ సోదరులకు బీజేపీతో పేచీ. అధికార పంపకం సమస్య సరేసరి. ఏదేమైనా అసాధ్య మనుకున్నది జరిగిపోయింది. సోదరులిద్దరూ ఏకమయ్యారు. హిందీ జీవోను వెనక్కి తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ముంబైలో శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
రాజ్ ఠాక్రే భవిష్యత్తు కార్యాచరణ గురించి చెప్పటానికి కొంత మొహమాట పడ్డారుగానీ ఉద్ధవ్ ఠాక్రే నేరుగా చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందని ప్రకటించారు. బాల్ ఠాక్రే కాలంలో ముంబైలో శివసేన తిరుగులేని పక్షంగా ఉండేది. తిరిగి ఆ వైభవాన్ని తీసుకురావాలన్నది ఉద్ధవ్ ఉద్దేశం.
కానీ అదంత సులభమేమీ కాదు. నాయకులిద్దరూ కలిసినంత మాత్రాన శ్రేణులు అంత తేలిగ్గా ఏకమవుతాయా అన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే గత ఇరవైయ్యేళ్లుగా ఆ పార్టీల మధ్య దాయాది పోరు నడుస్తోంది. అదీగాక ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన (యూబీటీ) ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో ఇప్ప టికే మహావికాస్ అఘాదీ(ఎంవీఏ)లో భాగస్వామిగా ఉంది.
సోదరులిద్దరూ ఏకమైతే ఎంవీఏ కూటమి అయోమయంలో పడుతుంది. ఉద్ధవ్ ఆ రెండు పార్టీలతో కలిసి ప్రయాణించగలుగు తున్నారు. కానీ రాజ్ అందుకు సిద్ధపడతారా లేక వారిద్దరూ కలిసి ఇక ఎంవీఏ కథ ముగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. కానీ ఈ కలయిక రాజకీయాల్లో ఒక కొత్త దూకుడును ప్రవేశపెట్టింది. ముంబైలో బతకడానికొచ్చినవారు మరాఠీ నేర్చుకు తీరాలని విజయోత్సవ ర్యాలీలో రాజ్ ప్రకటించారు.
ఇక శ్రేణులు రెచ్చిపోవటంలో వింతేముంది? నిజానికి ఆ ప్రకటనకు ముందే ముంబైలో ప్రముఖ ఇన్వెస్టర్ సుశీల్ కేడియా ‘మరాఠీ నేర్చుకొనేది లేదం’టూ ట్విటర్‌లో ప్రకటించాక ఈ నెల 3న ఎంఎన్‌ఎస్ శ్రేణులు ఆయన కార్యాలయంపైబడి విధ్వంసానికి పూనుకున్నాయి. దీన్ని రాజ్ ఖండించకపోగా ‘మరాఠీ మాట్లాడనంత మాత్రాన ఎవరినీ కొట్టనవసరం లేదు. కానీ అనవసర డ్రామాకు దిగేవారి కర్ణభేరికి కింద తగిలేలా కొట్టండ’ని పిలుపునిచ్చారు.
భాషాధిపత్యం తగువు ఈనాటిది కాదు. దేశానికి జాతీయ భాష అవసరమనీ, అది హిందీ అయితీరాలనీ జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ నేతలు వాదించారు. వారిపై వినాయక్ దామోదర్ సావర్కర్, ఆరెస్సెస్‌ల ప్రభావం ఉంది. కానీ తమిళనాడు ద్రవిడ ఉద్యమ నాయకులతోపాటు ప్రఖ్యాత తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి వారు హిందీ వ్యతిరేకతను చాటారు.
స్వాతంత్య్రం వచ్చాక హిందీని జాతీయ భాషగా చేయబోమని హామీ ఇస్తేనే కాంగ్రెస్‌తో కలిసి నడ వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎన్డీయే పాలకులు మాత్రమే కాదు... యూపీఏ ఏలు బడిలో సైతం హిందీ ఆధిపత్యాన్ని నిలపాలని శతధా ప్రయత్నించారు. దక్షిణాదిన అందుకు ప్రతిఘటన వస్తూనే ఉంది. భాషా సంస్కృతులు సున్నితమైనవి.
ప్రజామోదం లేకుండా వాటి జోలికి పోకపోవటం ఉత్తమం. ప్రస్తుతానికి రాజకీయంగా అయోమయంలో ఉన్న ఠాక్రే సోదరులకు మరో ఆర్నెల్లలో జరగబోయే స్థానిక ఎన్నికలకు హిందీ జీవో అందివచ్చిందన్నది వాస్తవం. ప్రజల మనోభావాల్ని బేఖాతరు చేస్తే అధికార కూటమికి చేటు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.