ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టిందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. అప్పు చేసి పప్పు కూడు పెడుతున్నారని, గత ప్రభుత్వం చేసిన తప్పులే రేవంత్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు,. బావితరాలకు భవిష్యత్ లేకుండా భూములు బడా బాబులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ గతంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మాలనుకున్నారు. కోర్టు ప్రమేయంతో అడ్డుకట్ట పడింది. హైదరాబాద్ ఇంద్రస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ వెనుక పెద్ద కుంభకోణం ఉంది.
క్యాబినేట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లోని స్థలాల కోసం ఎన్టీఆర్ స్టేడియం స్పూర్తితో ఉద్యమిస్తాం. మల్టిపుల్ జోన్‌లుగా మార్చేందుకు, ఎవరు అనుమతి ఇచ్చారు. భూములు లాక్కునే హక్కు ఎవరు ఇచ్చారు?, దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందనిపిస్తోంది. ఈ నిర్ణయం వెనుక వేలకోట్లు చేతులు మారే ప్రమాదం ఉంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు కప్పం కడుతున్నారు. ప్రభుత్వానికి ముందు చూపు ఉందా, ఉన్నపుడే సర్దుకుందామని చూస్తున్నారు.
ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి. ఎన్టీఆర్ స్టేడియంలో ఆనాడు కేసీఆర్ నిర్మాణం చేపట్టాలని ప్రయత్నం చేశారు. నేను అడ్డుకుని పోరాటం చేశాను ఇందిరాపార్క్ విషయంలోనూ ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రజల అవసరాల గురించి కాకుండా స్వప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. Hmda మాస్టర్ ప్లాన్ పై పునఃసమీక్షించు జరగాలి. రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు జరగాలి. రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించు కోవాలి. హైదరాబాద్‌ను కాంక్రీట్ జంగల్‌గా మారుస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలపై సమీక్ష జరుగుతోంది. తెలంగాణలో మరిన్ని ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయం. గెలుపుకోసం మేం ప్రయత్నం చేస్తాం. తెలంగాణలోనూ పార్టీకి మంచి రోజులు వస్తాయి. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కాంగ్రెస్ సహా, ప్రతిపక్ష పార్టీలు సహకరించాలి. కొన్ని ప్రాజెక్టుల్లో రాష్ట్రం సహకరించడం లేదు. ఎంపీకి నోటీసు ఇచ్చిన విషయం నా దృష్టిలో లేదు’ అని తెలిపారు.


