చెన్నై: కరూర్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన తర్వాత కొన్ని నెలలు సుదీర్ఘ విరామం తీసుకున్న టీవీకే పార్టీ అధినేత, సినీనటుడు విజయ్.. తన రాజకీయ ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. నేడు(ఆదివారం, నవంబర్ 23 వ తేదీ) కాంచీపురం జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దానికోసం కాంచీపురంలోని ఓ ప్రైవేటు కాలేజీ ప్రాంగణంలో సదస్సు ఏర్పాటు చేశారు.
కేవలం 2000 మందికి మాత్రమే QR కోడ్ పాస్‌లతో కూడిన అనుమతి ఇచ్చారు. అనుమతి లేని వారికి ప్రవేశం లేకుండా పకడ్బందీ ప్లానింగ్ చేశారు. ప్రచార పునఃప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార డీఎంకే, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సమావేశంలో మాట్లాడిన విజయ్.. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. డీఎంకే ర్యాడికల్స్‌కు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రజలను విడదీసే రాజకీయాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలతో పాటు దోపిడీ భావజాలం డీఎంకే స్వభావమని ఆయన మండిపడ్డారు. టీవీకే పార్టీ సమానత్వం కోసం స్పష్టమైన విధానాలను ముందుకు తీసుకొస్తోందని విజయ్ స్పష్టం చేశారు.
ఇటీవల ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పారదర్శకంగా లేదని, ఆ ప్రక్రియ ప్రజలకు నష్టం కలిగించే అవకాశం ఉందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలిపారు.
తమిళనాడులో అధికార డీఎంకేతో పాటు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని విజయ్ విమర్శించారు. రెండు పార్టీల విధానాలు ప్రజలకు అనుకూలంగా లేవని అన్నారు.
విజయ్ ఒకేసారి డీఎంకే, బీజేపీలపై దాడి చేయడంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. టీవీకే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో అన్న విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.


