జననాయకుడికి మైలేజీ
తమిళనాట జననాయకన్ చిత్రం విడుదల వివాదం దళపతి విజయ్‌కు మైలేజీగా
మారింది. ఆయనకు మద్దతు ప్రకటించే
వారి సంఖ్య పెరిగింది. తమిళనాడు కాంగ్రెస్ వర్గాలు సైతం గళం విప్పాయి. విజయ్‌ను రాజకీయంగా తమ వైపునకు
తిప్పుకునేందుకు ఈ చిత్రాన్ని కేంద్రం అస్త్రంగా చేసుకుందన్న విమర్శలు గుప్పించారు.
సాక్షి, చైన్నె: తమిళనాడులో సినిమా, రాజకీయం రెండు మిళితమే. సినీ రంగం నుంచి వచ్చిన వారే తమిళనాడు రాజకీయాలలో చక్రం తిప్పి ఉన్నారు. ప్రస్తుతం దివంగతులైన మాజీ సీఎం అన్నాదురై, కర్మయోగి కామరాజర్, కలైంజ్ఞర్ కరుణానిధి, దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలితలు సినీ రంగం నుంచి రాష్ట్రంలోనే కాదు, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ఉన్నారు. దివంగత నటుడు విజయ్‌కాంత్ తమిళనాడు అసెంబ్లీ ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. ఇక, సినీ నటులు శరత్ కుమార్, కమలహాసన్ వంటి స్టార్ హీరోలు పార్టీలను నెలకొల్పి, మరెందరో నటులు వివిధ పార్టీల ద్వారా రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో తాను రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించి దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ చివరకు యూటర్న్ తీసుకున్నారు. ఈ పరిస్థితులలో తాజాగా తమిళనాడు రాజకీయ తెర మీదకు వచ్చిన సినీ నటుడు విజయ్ అశేషాభిమాన మద్దతుతో తమిళగ వెట్రికళగంను ప్రకటించారు.
సెన్సార్ బోర్డుపై విమర్శలు
ఇక జననాయకన్ చిత్రం వ్యవహారంలో రాజకీయ ప్రమేయం ఉందనే ఆరోపణలు గుప్పు మంటున్న నేపథ్యంలో మరో వైపు సెన్సార్ బోర్డ్ పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జననాయకన్ చిత్రానికి సెన్సార్ ధృవ పత్రం ఇవ్వక పోవడాన్ని తమిళనాడులోని కాంగ్రెస్ నాయకులు పలువురు గళం విప్పుతూ కేంద్రాన్ని టార్గెట్ చేయడం గమనార్హం. అదే సమయంలో నటుడు సత్యరాజ్, రవి మోహన్, శిలంబరసన్(శింబు), దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు వంటి వారు నటుడు విజయ్ కి మద్దతుగా నిలిచారు. సినిమా పెద్ద ఆపదలో పడిందని, జననాయకన్ చిత్ర విడుదలను ఆపడం హత్య చేయడంతో సమానం అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ధ్వజమెత్తారు. అంతా మంచే జరుగుతుంది అని విజయ్ ఉద్దేశించి నటుడు సత్యరాజ్ పేర్కొన్నప్పటికీ, జననాయకన్ చిత్రం విడుదల వాయిదా బాధాకరమని, తమిళ సినిమాకు అత్యంత గడ్డు పరిస్థితి అని నిర్మాత ధనుంజయన్ వ్యాఖ్యానించారు. కాగా సెన్సార్ బోర్డుకు కొన్ని నిబంధనలు ఉంటాయని వాటిని ఎవరికోసమో అతిక్రమించడం సాధ్యం కాదని సీనియర్ నటుడు, మాజీ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఎస్ వీ.శేఖర్ పేర్కొనడం గమనార్హం. కనీసం నెలన్నర ముందుగా సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాల్సిందని సూచించారు. ఇక, తమిళనాడు కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ జ్యోతిమణి స్పందిస్తూ, ఇది తమిళ చిత్ర పరిశ్రమపై దాడి అని ధ్వజమెత్తారు. తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరిశ్ చోదన్కర్ స్పందిస్తూ, సెన్సార్ బోర్డును రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోవడం అంగీకరించ లేమని, రాజకీయంగా విజయ్‌ను ఎదుర్కొన లేక ఈ కుట్రలు సాగుతున్నట్టు ఆరోపించారు. ఇక తమిళనాడు కాంగ్రెస్ పార్టీ తన వెబ్‌సైట్‌లో విజయ్‌కు మద్దతుగా ట్వీట్ చేసింది. ఇందులో విజయ్‌ను ఇక ఒక రాజకీయ నాయకుడిగా మోదీ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాజకీయంగా అభిప్రాయ బేదాలు ఉన్నా, కళను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
సర్వత్రా మద్దతు
విజయ్ ఆది నుంచి కేంద్రంలోని బీజేపీ పాలకులను, తమిళనాడులోని డీఎంకే పాలకులను ఎదురిస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరే తమ ప్రత్యర్థులు అని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ విజయ్ పర్యటనలకు ఆంక్షల అడ్డంకులను డీఎంకే సృష్టిస్తున్నట్టుగా విమర్శలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంకు పడ్డ తాత్కాలిక బ్రేక్‌తో కేంద్రం సైతం విమర్శల పాలు కాక తప్పడం లేదు. ఇదంతా విజయ్‌ను తమిళనాట 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తమ దారికి తెచ్చుకోవాలని కేంద్రంలోని బీజేపీ రచిస్తున్న వ్యూహంగా ఆరోపణలు చేసే వాళ్లు పెరిగాయి. సెన్సార్ బోర్డును అడ్డం పెట్టుకుని కేంద్రం ఆడుతున్న నాటకం అని విమర్శించే వారు తమిళనాట పెరిగారు. వీటికి అద్దం పట్టేవిధంగా కరూర్ ఘటన కేసులో ఢిల్లీకి 12వ తేదీన విచారణకు రావాలని సీబీఐ విజయ్‌కు సమన్లు జారీ చేసి ఉండడం గమనార్హం.
ఆది నుంచి వివాదాలే..
విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తోంది. ఆయన పార్టీ జెండా వ్యవహారం వివాదం కోర్టుకు సైతం చేరింది. మీట్ ది పీపుల్ అంటూ ప్రజల్లోకి వచ్చిన సమయంలో కరూర్ ఘటన పెను విషాదానికి దారి తీసింది. ఈ పరిణామాలతో విజయ్ నిర్వహించే సభలు, సమావేశాలకు పోలీసులు అనేక ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ఆయన చిట్ట చివరి చిత్రంగా భావిస్తున్న జననాయకన్ సైతం వివాదాలకు సుడిగుండంలో చిక్కింది. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా వేసుకోక తప్పలేదు. రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదల కోసం నిర్మాత కోసం న్యాయ పోరాటం సాగిస్తున్నారు. ఈ చిత్రం విడుదల జాప్యంతో అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల మొత్తాన్ని మళ్లీ ప్రేక్షకులకు అందించే విధంగా నిర్మాత గురువారం చర్యలు తీసుకున్నారు.


