సంక్రాంతికి..సంసిద్ధం
● జోరుగా మట్టికుండల తయారీ ● పళ్లిపట్టులో పొంగల్ సందడి
పళ్ళిపట్టు: సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో మట్టి కుండలో పొంగల్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. ఈనేపథ్యంలో మట్టి కుండల తయారీలో కుమ్మరిలు ఆసక్తి చూపుతున్నారు. సహజసిద్ధమైన మట్టి కుండల ద్వారా పొంగల్ ఉంచి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించి వేడుకలు జరుపుకోవడం తమిళుల సంప్రదాయం. కాలక్రమంలో మట్టి కుండల స్థానంలో స్టీల్, రాగి, అల్యూమినియం పాత్రుల ఆధిపత్యం ప్రదర్శించడంతో కుమ్మరులకు ఉపాధి కొరవడింది. అయితే కాలం ఎంతమా మలుపులు తిరిగినా, పూరాతనం వైపు మళ్లక తప్పదనే రీతిలో సంప్రదాయం వైపు, పాత రోజుల అలవాట్లతో ఆరోగ్యం, సంక్షేమాన్ని గుర్తించిన యువతరం పాత పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మట్టి కుండలు, మట్టి పాత్రల్లో భోజనాలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో తిరుత్తణి, పళ్లిపట్టు, పొదటూరుపేట, తెక్కళూరు, బుచ్చిరెడ్డిపల్లె సహా 10 గ్రామాల్లో 20 కుటుంబాలకు చెందిన కుమ్మరులు మట్టి కుండలు, ప్రమిదలు, పెళ్లిళకు రంగుల మట్టి కుండలు, మట్టి విగ్రహాలు, బొమ్మలు చేసి ఉపాధి పొందుతున్నారు. మట్టి కుండలతో పాటు మట్టి పొయ్యలకు సంక్రాంతి సందర్భంగా డిమాండ్ విపరీతంగా వున్న క్రమంలో నెల రోజుల నుంచి మట్టి కుండలు చక్రం ద్వారా తయారు చేసి ఎండబెట్టి సూలలో కాల్చి విక్రయిస్తున్నారు.
రూ. 50 నుంచి రూ. 200కు విక్రయం
మట్టికుండ ఆకారం, సైజును బట్టి విక్రయిస్తున్నట్లు చవటూరుకు చెందిన కుమార్ అనే యువ కుమ్మరి తెలిపారు. గతంతో పోల్చితే సంక్రాంతి సందర్భంగా మట్టి కుండల వ్యాపారం పెరిగింది. ప్రజల్లో మట్టి కుండల పట్ల ఏర్పడ్డ అవగాహనతో చాలా మంది పండుగ సందర్భంగా మట్టి కుండల్లో పొంగళి పెట్టి సంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరుపుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో చాలా మంది తమ ఇళ్ల వద్దకే వచ్చి కుండలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటూ సంతలు, మార్కెట్లకు తీసుకెళ్లి వ్యాపారం చేస్తున్నాం. తమ వృత్తిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థిక సాయంతో పాటూ ప్రోత్సాహక నిధులు అందజేయాలని, బంకమట్టి తీసేందుకు ఎలాంటి ఆంక్షలు విధించరాదని కోరారు.
సంక్రాంతికి..సంసిద్ధం


