సీట్ల పందేరం కొలిక్కివచ్చినట్టేనా?
ఢిల్లీలో పంచాయితీ అమిత్ షాతో పళణి భేటీ ఆ ఇద్దరికీ చోటు లేదని స్పష్టం టీటీవీకి అవకాశం ఇచ్చేనా? అని చర్చ
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే – బీజేపీతో సీట్ల పందేరం కొలిక్కివచ్చినట్టేనా? అన్న చర్చ ఊపందుకుంది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటూ తమిళనాడు బీజేపీ ఎన్నికల వ్యవహారాల కమిటీతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చర్చలు ఏ మేరకు ఫలితాన్ని ఇచ్చాయో అన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే ఈ భేటీ తదుపరి పన్నీరు, శశికళకు అన్నాడీఎంకేలో చోటు లేదని పళని స్వామి స్పష్టం చేశారు. అలాగే టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం గురించి ప్రశ్నించగా, మరిన్ని పార్టీలు కూటమిలోకి వస్తాయంటూ దాట వేయడం గమనార్హం. వివరాలు.. అన్నాడీఎంకే– బీజేపీ మధ్య సీట్ల పందేరం చర్చ ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పుదుకోట్టై, తిరుచ్చి పర్యటనకు వచ్చిన సమయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆయన్ని కలవ లేదు. అయితే అన్నాడీఎంకే సీనియర్ నేత ఎస్పీ వేలుమణి మాత్రమే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీట్ల విషయంగా అమిత్ షా హుకుం జారీ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో పళని స్వామి ఢిల్లీ వెళ్లకు తప్పలేదు. బుధవారం రాత్రి అమిత్ షా నివాసానికి పళణిస్వామి వెళ్లారు. సుమారు గంటకు పైగా జరిగిన భేటీలో సీట్ల సర్దుబాటు, సంకీర్ణ ప్రభుత్వం విషయంగా అమిత్ షా పలు సూచనలు చేసినట్టు సమాచారం. అలాగే, 56 స్థానాలను బీజేపీకిఅ ప్పగించాలని, అధికారంలోకి వస్తే 3 మంత్రి పదవులు కేటాయించాలని ఆదేశించినట్టు చర్చ ఊపందుకుంది. అయితే 30లోపు సీట్లతో సర్దుకోవాలని పళణి సూచించినా, బీజేపీ కమిటీ మెట్టు దిగనట్టు సమాచారం. చివరకు అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగా బీజేపీ ఆశిస్తున్న సీట్లను అటో ఇటు సర్దేదిశగా చర్చ సాగినా, సంకీర్ణ ప్రభుత్వం అన్న ప్రకటన తమిళనాట కూటమికి చిక్కులను సృష్టిస్తుందని పళణి స్వామి సూచించినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, గురువారం తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్, కో– ఇన్‌చార్జ్‌లుగా ఉన్న కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇన్‌చార్జ్‌గా న్యాయశాఖ కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రాం మెహ్వాల్, సివిల్ ఏవియేషన్ కేంద్ర సహాయమంత్రి మురళీధర్ మోహుల్‌లతో పళని స్వామి భేటీ అయ్యారు. ఈకమిటీ ఈనెల 20,21 తేదీలలో చైన్నెకు రానున్నట్టు, ఆ సమయంలో సీట్ల పందేరం, కూటమి వ్యవహారం విషయంగా సమగ్ర నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అధికారం మాదే..
ఢిల్లీలో పళణిస్వామి మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడు ఎన్నికలలో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ని తాను కలవకలేక పోయానని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ముందుగా నిర్ణయించిన మేరకు జిల్లాల పర్యటనలో ఉన్నట్టు పేర్కొన్నారు. తమ లక్ష్యం డీఎంకేను గద్దె దించడమేనని స్పష్టం చేశారు. అందుకే అన్బుమణి తమతో చేతులు కలిపినట్టు వ్యాఖ్యానించారు. తమిళనాడు రాజకీయాల గురించి అమిత్ షాతో చర్చించామని, పొత్తు విషయంగా మాత్రం కాదని వ్యాఖ్యానించారు. తమ కూటమిలోకి మరిన్ని పార్టీలు వస్తాయని పేర్కొన్నారు. బీజేపీ వంటి మరిన్ని పార్టీలు తమ కూటమిలోకి వస్తాయని, అవి ఏమిటో ఇప్పుడే చెప్పలేమన్నారు. రాజకీయ పరిస్థితులను బట్టి ఇప్పుడే కొన్ని విషయాలు చెప్పలేమంటూ పలు ప్రశ్నలకు దాట వేశారు. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను ఎన్‌డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించగా మరిన్ని పార్టీలు వస్తాయని దాట వేశారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ గురించి ప్రశ్నించగా వారికి చోటు లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా పళణి వ్యాఖ్యల గురించి పన్నీరు సెల్వం మీడియాతో సంక్రాంతి తదుపరి అన్నీ మంచి రోజులే అని స్పందించారు.


