డీఎండీకే దారి ఎటో?
– తేల్చని ప్రేమలత విజయకాంత్
సాక్షి,చైన్నె: డీఎండీకే రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే వైపా లేదా డీఎంకే వైపా లేదా టీవీకే వైపా అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఆ దిశగా శుక్రవారం కడలూరు వేదికగా తొమ్మిదేళ్ల అనంతరం జరిగిన పార్టీ మహానాడులో ప్రేమలత విజయకాంత్ పొత్తు వ్యవహారాన్ని సస్పెన్షన్‌లో పెట్టారు. విజయకాంత్ మృతి తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు డీఎండీకే సిద్ధమైంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ సారథ్యంలో ఎన్నికలను ఎదుర్కొనే దిశగా తొమ్మిదేళ్ల అనంతరం మహానాడుకు ఏర్పాట్లు చేశారు. కడలూరు వేదికగా శుక్రవారం జరిగిన మహానాడులో డీఎండీకే తరఫున చేసిన తీర్మానాలు పొత్తు వ్యవహారాన్ని సందిగ్ధంలో పెట్టాయి. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిరక్షక్షణ, మాదకద్రవ్యాల నియంత్రణ అంటూనే రైతుల సమస్యలు, అన్ని వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ఓ వైపు డీఎంకే అనుకూలంగా, ప్రతి కూలంగా తీర్మానాలు చేశారు. ఇక, అన్నాడీఎంకేతో జతకట్టేనా అన్నట్టుగా ప్రస్తావిస్తూనే, బీజేపీ మతతత్వ అంశాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం గమనార్హం. చివరగా కూటమి నిర్ణయ అధికారాన్ని ప్రేమలత విజయకాంత్‌కు అప్పగించారు. అలాగే, డీఎండీకే దివంగత వ్యవస్థాపకుడు, పురట్చి కలైంజ్ఞర్ విజయకాంత్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని, స్మారకంగా మణిమండపం నిర్మించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఈ మహానాడు ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మహానాడు సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రేమలత విజయకాంత్ ఓవైపు, విజయకాంత్ వారసుడు విజయ ప్రభాకరన్ మరో వైపు దివంగత నేత శైలిని అనుకరించే విధంగా అభివాదాలతో కేడర్‌ను ఆకర్షించే ప్రయత్నం చేశారు.


