మీ కలలను పంచుకోండి!
వీడియో కాల్ ద్వారా అభిప్రాయ సేకరణ
సీఎంకు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్న మహిళ
‘మీ కలలను పంచుకోండి’ వాటిని సాకారం చేస్తాం.’ అంటూ కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరిలో ఈ పథకాన్ని శుక్రవారం సీఎం స్టాలిన్ ప్రకటించారు.
సాక్షి, చైన్నె : 2026లో ద్రావిడ మోడల్ 2.ఓ అధికారం లక్ష్యంగా వ్యూహాలకు సీఎం స్టాలిన్ పదునుపెట్టిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా రోజుకో కొత్త పథకాన్ని ప్రకటించి అమలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు అవగాహన, ప్రజల భావన, భవిష్యత్తు కలల గురించి అధ్యయానికి సీఎం సిద్ధమయ్యారు. ఇందు కోసం టెల్ అస్ యువర్ డ్రీమ్స్( మీకలలను పంచుకోండి) పేరిట పథకాన్ని అమల్లోకి శుక్రవారం తీసుకొచ్చారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరిలోని పాడియానల్లూరులో ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారు. గత ఐదేళ్లలో అమలు చేసిన వివిధ పథకాలు, ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందిన లబ్ధిదారుల డేటా, ప్రాజెక్టుల వివరాలు, ప్రస్తుత కార్యాచరణ స్థితిని నిర్ధారించడంతో పాటు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి, ప్రజల భవిష్యత్తును అంచనా వేయడానికి, వారి కలలు, అవసరాలను గుర్తించేందుకు ఈ పథకం మేరకు నేరుగా ఇళ్ల వద్దకే ప్రత్యేక బృందాలు వెళ్లి అధ్యయనం చేయనున్నాయి.
ఇళ్లకు వెళ్లి సేకరణ
ప్రజల అభిప్రాయాలతో భవిష్యత్తు విజన్ రూపకల్పన జరగనుంది. ఇందుకోసం స్వచ్ఛంద సేవకులు, స్వయం సహాయక బృందాలను రంగంలోకి దించారు. ప్రజల అభిప్రాయాలను నమోదు చేయడానికి ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. దీనిపై అవగాహన కల్పించనున్నారు. స్వచ్ఛంద సేవకులు ఒక్కో ఇంటికి రెండు సార్లు వెళ్లి సమగ్ర పరిశీలన, అధ్యయనం చేసి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. కొంతమంది లబ్ధిదారులు తమ అభిప్రాయాలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లి , తమ కలలను పంచుకున్నారు. అనంతరం తిరుచ్చి, తిరుపూర్, తిరునల్వేలీల నుంచి ప్రజలు వీడియో కాల్స్ ద్వారా తమ అభిప్రాయాలు, కలలను పంచుకున్నారు. మంత్రి ఎస్‌ఎం నాజర్, ఎంపీలు శశికాంత్ సెంథిల్, కళానిధి వీరాస్వామి, గిరిరాజన్, ఎమ్మెల్యేలు ఎస్. సుదర్శనం, ఎస్. చంద్రన్, టి.జె. గోవిందరాజన్, వి.జి. రాజేంద్రన్, ఎ.కృష్ణస్వామి, దురై చంద్రశేఖర్, కేపీబీ శంకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, అదనపు కార్యదర్శి అముద, తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థ ఎండీ ఆర్.వి.సంజీవన, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎం ప్రతాప్ పాల్గొన్నారు.
కలలను పంచుకోండి
సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ఎవరి కలలను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సాకారం చేసుకోవచ్చన్నారు. ఈ స్టాలిన్ తలచుకుంటే అసాధ్యం అనేది ఉండదని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఖజానాను నింపే విధంగా తమిళనాడు ఆర్థిక వృద్ది తాజాగా 11.19 శాతంగా ఉందని గుర్తు చేశారు. అత్యుత్తమ రాష్ట్రంగా తమిళనాడు అవతరించి ఉందని పేర్కొంటూ, పెట్టుబడుల ఆహ్వానంలో దూసుకెళ్తున్నామన్నారు. ఈ పథకం కోసం రానున్న 30 రోజుల పాటు ప్రతి కుటుంబం తమ అభిప్రాయాలను, కలలను పంచుకోవాలని, తమిళనాడు కోసం ఒక గొప్ప కలల ప్రాజెక్టును దీని ఆధారంగా ప్రకటించబోతున్నామని స్పష్టం చేశారు. 2030 నాటికి ఒక విజన్‌తో కూడిన కలల ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ఉంటుందని ప్రకటించారు. 2026 ఎన్నికలకు స్టాలిన్ హామీ ఇదేనని పేర్కొంటూ, కల నిజం అవుతుంది. తమిళనాడు గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు.
మీ కలలను పంచుకోండి!
మీ కలలను పంచుకోండి!


