డబుల్ డెక్కర్ బస్సులు సిద్ధం
సాక్షి, చైన్నె: చైన్నెలో డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏసీ సౌకర్యంతో కూడిన ఈ బస్సులను 12వ తేదీ నుంచి పర్యాటక ప్రాంతాల వైపుగా నడిపేందుకు ఎంటీసీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. 1970 నుంచి 2007 వరకు చైన్నెలో డబుల్ డెక్కర్ బస్సుల సేవలు విస్తృతంగా ఉండేది. ఆ తర్వాత చైన్నె నగరంలో వంతెనల సంఖ్య పెరగడంతో డబుల్ డెక్కర్ స్థానంలో డీలక్స్ బస్సులు ఉపయోగంలోకి వచ్చాయి. ఎంటీసీ నేతృత్వంలో డీలక్స్ బస్సులు ఓ వైపు , ఎలక్ట్రిక్ బస్సులు మరో వైపు విస్తృతంగా వివిధ మార్గాలలో సేవలను అందిస్తున్నాయి. తాజాగా మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను చైన్నెలో పరిచయంచేయడానికి ఎంటీసీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అశోక్ లేలాండ్ తో కుదిరిన ఒప్పందం మేరకు తొలి విడతగా 20 బస్సులను సిద్ధం చేయించారు. పూర్తిగా ఏసీ సౌకర్యంతో కూడిన ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల ట్రయల్ రన్‌పై దృష్టి పెట్టారు. కొన్ని మార్గాలలో ట్రయల్‌రన్ విజయవంతం చేశారు. తొలి విడతగా పర్యాటక ప్రాంతాలను కలిపే విధంగా ఈ బస్సుల సేవలను అందించేందుకు సిద్ధమయ్యారు. రిప్పన్ బిల్డింగ్, లైట్ హౌస్, జల్లికట్టు ఎద్దుతో పాటూ తమిళ సంస్కృతిని చాటే పెయింటింగ్స్‌తో తమిళం వర్ధిల్లాలి అన్న నినాదంతో ఈ బస్సులపై స్టిక్కర్లు వేయించారు. మహాబలిపురం వైపుగా తొలుత బస్సుల సేవలను అందించేందుకు తగినట్టుగా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఈనెల 12న ఈ బస్సుల సేవలు చైన్నెలో సీఎం స్టాలిన్ ప్రారంభిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


