చెట్టును ఢీకొన్న బైక్
పళ్లిపట్టు: కానగ చెట్టును బైకు ఢీకొన్న ప్రమాదంలో కళాశాల విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన గురువారం రాత్రి శోకాన్ని మిగిల్చింది. పళ్లిపట్టు యూనియన్‌లోని జంగాలపల్లె గ్రామానికి చెందిన బుల్లోడు ఆర్కాడుకుప్పంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి ముగ్గురు అబ్బాయిలు. వారిలో రెండో అబ్బాయి దినేష్(18) అరక్కోణంలోని ప్రయివేటు కళాశాలలో బీబీఏ ప్రథమ సంవత్సరం చదువుకునేవాడు. గురువారం రాత్రి 9 గంటలకు దినేష్ తన బైకులో అతని మిత్రులు మోహన్‌బాబు, నవీన్‌కుమార్‌తో పొదటూరుపేటకు వెళ్లి రాత్రి ఇంటికి తిరుగు పయనమయ్యారు. తిరుత్తణి రాష్ట్ర రహదారిలోని ఈచ్చంతోప్పు వద్ద వేగంగా వెళ్లుతుండగా అదుపుతప్పిన బైకు రోడ్డుకు సమీపంలోని కానగచెట్టును ఢీకొంది. ప్రమాదంలో బైకు నుజ్జునుజ్జు కాగా బైకు నడిపిన దినేష్‌కు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మోహన్‌బాబు తలకు గాయాలు కావడంతో అక్కడున్నవారు కాపాడి 108 ఆంబులెన్స్ సాయంతో పొదటూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు., నవీన్‌కుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారంతో పొదటూరుపేట పోలీసులు దినేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును బైకు ఢీకొని కళాశాల విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది.


