అడవి పందిని ఢీకొన్న బైక్
– కార్మికుడి మృతి
తిరుత్తణి: బైకు అడవి పందిని ఢీకొట్టడంతో కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కనకమ్మసత్రం ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. తిరువలంగాడు యూనియన్‌లోని లక్ష్మీపురం గ్రామపంచాయతీలోని దాస్‌రెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన రామచంద్రన్ కుమారుడు సతీష్(29) శ్రీపెరంబదూరులోని ప్రయివేటు కర్మాగారంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. రోజూ ఇంటి నుంచి బైకులో వెళ్లి లక్ష్మీపురంలో బైకు పార్క్ చేసి అక్కడనుంచి కర్మాగారం బస్సులో వెళ్లి వచ్చేవాడు. యథాప్రకారం శుక్రవారం వేకువజామున ఇంటి నుంచి బైకులో పనికి వెళ్లాడు. మంచు ఎక్కు వగా ఉండడంతో ఎదురుగా మంచు కప్పేయడంతో అటవీ ప్రాంతం నుంచి వచ్చిన అడవి పందిని గుర్తు పట్టలేక పోవడంతో బైకు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో సతీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం మేరకు కనకమ్మసత్రం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మహిళల నిరసన
గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో అడవి పందులు తరుచూ రోడ్డు, గ్రామంలోకి చొరబడి పంట పొలాలు నాశనం చేయడంతోపాటు రాత్రి సమయాల్లో వెళ్లి వచ్చేవారిని ప్రమాదాలకు గురిచేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. అడవి పందులతో సమస్యలు తలెత్తకుండా అటవీ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని గ్రామీణులు అటవీశాఖ అధికారులను కోరారు. అయితే వారు పట్టించుకోక పోవడంతోనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపిస్తూ గ్రామానికి చెందిన మహిళలు వందమంది చైన్నె–తిరుపతి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టేందుకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను దాటి దాదాపు 8 కి.మీ దూరం నడుచుకుంటూ తిరుత్తణి ప్రభుత్వాసుపత్రి చేరుకుని ముట్టడించారు. దీంతో పోలీసులు చర్చలు జరిపి వెంటనే అటవీ ప్రాంతంలో కంచె ఏర్పాటు చేస్తామని అటవీశాఖ అధికారుల హామీ మేరకు పోరాటం వీడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి తీసుకెళ్లారు. మృతి చెందిన సతీష్‌కు భార్య, ఇద్దరు పిల్లలుండడం గమనార్హం.
అడవి పందిని ఢీకొన్న బైక్


