
ఏడేళ్ల అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో జరిపిన పర్యటన అనేక విధాల సత్ఫలితాలనిచ్చింది. ఇది అంతర్జాతీయ పెత్తందార్లకు తగిన సందేశం పంపింది. పెహల్గామ్ ఉగ్రవాద దాడిపై మూణ్ణెల్లు గడిచినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండి పోయిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో)తో ఆ ఘటనను ఖండిస్తూ తీర్మానం చేయించింది. చైనా, రష్యాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రగతి సాధించింది. ఈ పరిణామాలన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు.
అంతర్జాతీయ సంబంధాల్లో అమెరికా సృష్టించిన సరికొత్త గందరగోళం వల్ల ఏర్పడిన అయోమయ వాతావరణాన్ని ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు ఒక కుదుపు కుదిపింది. ప్రపంచవ్యాప్త మీడియా ఈ శిఖరాగ్ర సదస్సు కన్నా మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు చర్చించుకుంటున్న వీడియోకూ, ఛాయాచిత్రాలకూ అత్యధిక ప్రాధాన్యమివ్వటం మోదీ చైనా సందర్శనలోని అంతరార్థాన్నీ, దాని పరిణామాలనూ అవగాహన చేసుకోవటం వల్లే.
అయితే కేవలం ఈ పర్యటన వల్లే అంతా మారిపోతుందనీ, చైనా మనతో సవ్యంగా ఉంటుందనీ, అమెరికా తన తెలివితక్కువ విధానాలను సవరించుకుంటుందనీ అనుకోనవసరం లేదు. ఇప్పటికైతే యూరేసియాలోని మూడు అగ్ర దేశాల కలయిక అవసరార్థ బంధమే. బలపడాలంటే చేయాల్సింది చాలా ఉంటుంది. రష్యాకిది వర్తించదు. ఆ దేశంతో మన మైత్రి చిరకాలమైనది. దాన్ని నీరుగార్చడానికి అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ అదేమంత తగ్గలేదు. కానీ పెరగాల్సినంత పెరగలేదు.
ఈ మూడు దేశాల కలయికా ఈ దేశాల ప్రయోజనాలు నెరవేర్చుకోవటంతోపాటు ఈ ప్రాంత శాంతికీ, సుస్థిరతకూ, అభివృద్ధికీ దోహదపడుతుంది. దీని మూలాలు ప్రచ్ఛన్న యుద్ధానంతర పరిణామాల్లో ఉన్నాయి. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యాగా మిగిలిపోయిన 1990వ దశకంలో అప్పటి ఆ దేశ ప్రధాని యెవ్‌జెనీ ప్రైమకోవ్ ఈ భావనకు రూపుదిద్దారు. ఈ వ్యూహాత్మక కలయిక భవిష్యత్తులో అమెరికా ఆధిపత్యా నికి చెక్ పెట్టగలదని భావించారు. మంత్రుల స్థాయిలో, నిపుణుల స్థాయిలో పలు సమావేశాలు కూడా జరిగాయి.
కానీ 2020లో గల్వాన్ ఉదంతం అనంతరం నిలిచిపోయాయి. చైనాతో మనకున్న సరిహద్దు తగాదాలూ, చేదు అనుభవాలూ తక్కువేం కాదు. నిజానికి మొన్నటికి మొన్న ఎస్‌సీవో మంత్రుల స్థాయి భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో పెహల్గామ్ ప్రస్తావన లేకపోవటాన్ని నిరసిస్తూ మన దేశం దానిపై సంతకం చేసేందుకు నిరాకరించింది. ఇప్పుడు ఎస్‌సీవో తన తప్పు దిద్దుకోవటం శుభæపరిణామం.
ఈ త్రైపాక్షిక కలయికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు గమనిస్తే ఆయనెంత కలవరపడుతున్నారో తెలుస్తుంది. ఇది ‘ఏకపక్ష విపత్తు’గా పరిణమిస్తుందట! ఆ దేశ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సరేసరి. రోజుకో రకంగా నోరు పారేసు కుంటున్నారు. మన దేశం సంయమనంతో అమెరికా 50 శాతం సుంకాలు ఎంత అర్థరహితమో చెప్తూ వస్తోంది.
తాను తప్ప దిక్కులేదనే స్థితికి చేరిన అమెరికా కళ్లు తెరిపించటం ప్రస్తుతావసరం. దేశాల మధ్య పటిష్ఠమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్న కాలంలో తనకు అనుకూలమైన నిబంధనలతో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను అమల్లోకి తెచ్చింది అమెరికాయే. పర్యవనసానంగా ఎడాపెడా ఆర్జించి, స్వీయ తప్పిదాల కారణంగా సంక్షోభంలో పడిన ఆ దేశం అందుకు ఇతరులను నిందిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది.
భారత–చైనా సంబంధాలపై రెండు వైపుల నుంచీ వెలువడిన ప్రకటనలు ఒకే స్వరంతో ఉండటం గమనించదగ్గది. ఇరు దేశాలూ భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కారని ఆ ప్రకటనలు గుర్తుచేశాయి. చైనాతో మన సంబంధాలు బాగున్నప్పుడు పాకిస్తాన్ అణిగిమణిగి ఉండటం మొదటినుంచీ కనబడుతోంది.
ఇకపై కూడా అదే జరిగితే మంచిదే. ఏదేమైనా పెత్తందారీ పోకడలు చెల్లబోవని చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. కాకపోతే భారత్–చైనా–రష్యా కలయిక వికసించాలంటే ఎంతో చిత్త శుద్ధితో, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది. అది జరగాలని ఈ మూడు దేశాలు మాత్రమే కాదు... ప్రపంచమే కోరుకుంటోంది.