
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందని, ఇందుకుగానూ భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇంధన దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ నోట్ రూపేణా స్పందించింది. అస్థిర పరిస్థితుల నడుమ.. వినియోగదారుల ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం ఉంటుందని అందులో కేంద్రం స్పష్టం చేసింది(India Reacts On Trump Russia Oil Comments).
మీడియా ప్రశ్నలకు బదులుగా.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తాజా పరిణామాలపై ఒక నోట్ విడుదల చేశారు. చమురు సంబంధిత దిగుమతులు భారత్‌కు ఎంతో కీలకం. మార్కెట్ అస్థిరతల మధ్య ఇక్కడి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం మా ప్రధాన ధ్యేయం. అందుకే దిగుమతుల విధానాలు ఆ దిశగా రూపొందించబడ్డాయి..
.. స్థిరమైన ఇంధన ధరలు, భద్రతతో కూడిన సరఫరా.. ఇవే మా ద్వంద్వ లక్ష్యాలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఇంధన వనరుల విస్తరణ, వివిధ దేశాల నుంచి సరఫరా పొందడం జరుగుతోంది అని అందులో పేర్కొన్నారాయన. అలాగే..
Our response to media queries on comments on India’s energy sourcing⬇️
🔗 https://t.co/BTFl2HQUab pic.twitter.com/r76rjJuC7A— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2025
అమెరికాతో సంబంధం గురించి మాట్లాడుతూ.. గత దశాబ్దంగా ఇంధన సహకారం పెరుగుతోంది. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సహకారం మరింతగా అభివృద్ధి చేయాలనే ఆసక్తి చూపుతోంది. చర్చలు కొనసాగుతున్నాయి అని జైస్వాల్ అందులో తెలిపారు. తద్వారా.. అంతర్జాతీయ ఒత్తిడులకు కాకుండా దేశ ప్రయోజనాల ఆధారంగా భారత్ ముందుకు వెళ్తుందని మరోసారి భారత్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం(Ukraine Crisis) ముగింపు దిశగా కీలక అడుగు పడిందని, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయబోతోందని, మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ భగ్గుమన్నారు. ట్రంప్ నుంచి సానుకూల స్పందన లేకపోయినా తరచూ అభినందన సందేశాలు ఎందుకంటూ మోదీని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ తరుణంలో కౌంటర్‌గా కేంద్రం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
ఇదీ చదవండి: మోదీ నన్ను ప్రేమిస్తారు.. అంటే మరోలా కాదు!