
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల వార్షిక ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచినా మౌనంగా ఉండిపోయిన ప్రధాని మోదీ నిజంగానే బలహీన ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ తమ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాల్లో పోస్ట్‌లు పెట్టారు.
‘నేను మరోసారి చెబుతున్నా. భారత్‌కు ఉన్నది కేవలం బలహీన ప్రధాని మాత్రమే’ అని రాహుల్ విమర్శించారు. ‘మోదీజీ.. పుట్టినరోజు నాడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ట్రంప్ నుంచి మీకు ఫోన్‌కాల్ వచ్చింది. కానీ రిటర్న్ గిఫ్ట్‌గా లక్ష డాలర్ల రుసుం భారం భారతీయులపై పడింది’ అని ఖర్గే అన్నారు. ‘‘నాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తరఫున పాల్గొని ‘మరోసారి ట్రంప్ సర్కార్’ అని మీరే నినదించారు. అందుకే రిటర్న్ గిఫ్ట్‌గా లక్షడాలర్ల వార్షిక ఫీజు భారం భారతీయ టెక్ ఉద్యోగులపై పడింది. ఇప్పటికే 50 శాతం టారిఫ్ పడుతోంది. దీంతో 10 కీలక రంగాల్లో భారత్ రూ.2.17 లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోతోంది. ఇవి చాలవన్నట్లు భారత్‌పై 100 శాతం టారిఫ్ మోపాలని ఐరోపా సమాఖ్యను ట్రంప్ ఉసిగొల్పుతున్నారు.
విదేశీ అగ్రనేతలు కనబడగానే గట్టిగా ఆలింగనాలు చేసుకోవడం, ప్రాసలు వినిపించేలా నినాదాలు ఇవ్వడం, పెద్ద సభలు ఏర్పాటుచేయడం, ఆ సభల్లో మోదీ, మోదీ అని బిగ్గరగా నినా దాలు ఇప్పించుకోవడం సరైన విదేశాంగ విధానం అనిపించుకోదు’ అని మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘భారతీయ ప్రతిభావంతులు, అత్యున్నత నైపుణ్యాలున్న సిబ్బంది భవిష్యత్తును అమెరికా ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఇంతటి రుసుముల భారం మోపినా మోదీ మౌనంగా ఉండటం ఆయన బలహీనతను రుజువుచేస్తోంది’అని గౌరవ్ గొగోయ్ అన్నారు. ‘నేరుగా చర్చల వేళ హెచ్–1బీ వీసాల విషయంలో నాటి ట్రంప్ ప్రభుత్వం ఆనాడు మోదీకి ఎలాంటి హామీ ఇవ్వలేదని 2017లోనే రాహుల్‌గాంధీ బయటపెట్టారు. ఇప్పుడు అది నిజమని నిరూపితమైంది’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అన్నారు.