
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. ఓట్ల దొంగతనం ఒక పథకం ప్రకారమే జరుగుతోందని.. ఆ దొంగలను రక్షించే ప్రయత్నంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని.. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు.
100 శాతం ఆధారాలున్నాయ్
ఓట్ల చోరీ గురించి ఈసీ నుంచి మాకు సమాచారం వస్తోంది. చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగానే లక్షల ఓట్లను తొలగించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. కర్ణాటక ఓటర్లకు లింక్ చేసిన ఫోన్ నెంబర్లన్నీ తప్పుడువే. కాంగ్రెస్‌కు బలమున్న ప్రాంతాల్లోనే ఓట్ల తొలగింపు జరిగింది. ఓట్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు. ఫేక్ లాగిన్‌తో కాంగ్రెస్ సానుభూతి ఓట్లను తొలగించారు. ఇవన్నీ ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతో చెబుతున్నా..
సీఈసీపై సంచలన ఆరోపణలు
ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని కాపాడుతోంది. అధికారులకు తెలియకుండా జాబితా నుంచి ఓట్లు ఎలా పోతాయి?. కేవలం కాంగ్రెస్ ఓటర్లే టార్గెట్‌గా ఇదంతా నడుస్తోంది. కర్ణాటక సీఐడీ ఓట్ల తొలగింపు వివరాలు 18సార్లు అడిగినా ఈసీ స్పందించడం లేదు. మాకు ఓట్ల తొలగింపు ఐడీల వివరాలు, ఓటీపీలు కావాలి. వారం లోగా సీఐడీ అడిగిన వివరాలు అందించాలి.
ఓట్ల దొంగలను రక్షిస్తూ..
కర్ణాటక అలంద్‌లో గోదాబాయ్ పేరుతో 18 ఓట్లు తొలగించారు . మహారాష్ట్ర రాజురా నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారు. కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర, హర్యానాలో ఒకే రీతిలో ఓట్ల తొలగింపు జరిగింది. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా పథకం ప్రకారం రాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు డిలీట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థ ఆ పని చేయడం లేదు. ఓట్ల దొంగలను సీఈసీ రక్షిస్తోంది. అందుకే ప్రతిపక్ష నేతగా నేను ప్రజల ముందు ఉంచుతున్నా
ఓటు చోరీ అనేది ప్రజాస్వామ్యంపై అణుబాంబ్ లాంటిది. కానీ ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ పేలబోతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవాళ్లను ఈసీ కాపాడుతోంది. ఓట్లు చోరీ చేస్తున్న వారిని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారు. అన్నింటికీ మా దగ్గర ఆధారాలన్నాయ్. ఎన్నికల వ్యవస్థలో అక్రమాలను కోర్టులు పరిశీలించాలి. ఓట్ల చోరీపై న్యాయ వ్యవస్థ దృష్టి సారించాలి అని రాహుల్ గాంధీ కోరారు. ఈ క్రమంలో ఆధారాల పేరిట పలువురు ఓటర్లతో మాట్లాడించిన ఆయన, ఓట్ల అవకతవకల పేరిట జరిగిన అంశాలనూ మీడియా ముందు ప్రవేశపెట్టారు.
VIDEO | Delhi: During a press conference, Congress MP Rahul Gandhi (@RahulGandhi) shows 'evidence' of alleged vote theft in Karnataka, claiming that the theft happened specifically on the booths where Congress was winning.
He further claimed that a fake login was created in the… pic.twitter.com/k9uSw4boLG— Press Trust of India (@PTI_News) September 18, 2025
LIVE: Special press briefing by LoP Shri @RahulGandhi at Indira Bhawan | New Delhi. https://t.co/BfcSQU0LTd
— Congress (@INCIndia) September 18, 2025