
న్యూఢిల్లీ: ఓట్ల చోరీ పేరిట కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల స్పందించింది. ఆన్‌లైన్‌లో ఓట్లు ఎవరూ తొలగించలేరని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అదే సమయంలో మరోవైపు.. బీజేపీ సైతం ఆయన చేసిన ఆరోపణలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారం.. అవాస్తవం. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం లేదు అని ఈసీ స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలను మాత్రం అంగీకరించింది. ‘‘ ఆ సమయంలో కర్ణాటకలోని ఆలంద్ శాసనసభ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించేందుకు కొన్ని విఫలయత్నాలు జరిగాయి. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్నికల సంఘం స్వయంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపింది’’ అని పేర్కొంది.
మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం.. నకిలీ ఓట్ల చేర్పు ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆయన బాంబు పేలలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్‌ను బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అని మండిపడ్డారు.
‘‘ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ నిష్పక్షపాతంగా పనిచేస్తోంది. కానీ రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ.. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ సుమారు 90 ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ వైరాగ్యంతోనే ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని ఠాకూర్ విమర్శించారు. హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానన్న రాహుల్.. చివరికి పటాకులతోనే సరిపెట్టారు. ఆరోపణలే ఆయన రాజకీయ ఆభరణంగా మారాయి. కోర్టులు క్షమాపణలు కోరడం, మందలించడం ఆయనకు అలవాటైపోయింది అని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: ఓట్ల దొంగలకు రక్షగా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు