
భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు గుప్పించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తామని మోదీ తనకు మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ గొప్ప వ్యక్తి అంటూనే ట్రంప్ విచిత్రమైన వ్యాఖ్య ఒకటి చేశారు.
మోదీ ఓ గొప్ప వ్యక్తి. భారత్‌ను ఎంతో కాలంగా నేను చూస్తున్నా. అది ఎంతో అద్భుతమైన దేశం. అలాంటి దేశానికి నా స్నేహితుడు అధినేతగా దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారు. ఆయన ట్రంప్‌ను ఎంతో ప్రేమిస్తారు. ఇక్కడ ప్రేమంటే తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు అంటూ నవ్వుతూ అన్నారాయన.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని.. ఈ చర్యతో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్ అర్ధిక సహకారం అందిస్తోందని ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించారాయన. అయితే తాజాగా వైట్‌హౌజ్‌లో ఆయన మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ ఇక మీదట చమురు కొనదని మోదీ హామీ ఇచ్చారని ప్రకటించారు.
ఇప్పటికప్పుడే కాకపోయినా.. త్వరలోనే ఈ నిర్ణయం అమలు చేస్తామని మోదీ తనతో చెప్పారని ట్రంప్ అన్నారు. అలాగే.. భారత్ నిర్ణయం ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు కీలక ముందడుగు అని అభివర్ణించారాయన. అలాగే తన తదుపరి లక్ష్యం చైనానే అని ప్రకటించారాయన.