
ఎటు చూసినా నిరాశామయ వాతావరణమే అలుముకుని అంతటా నిర్లిప్తత ఏర్పడిన తరుణంలో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన అందరిలోనూ ఉత్సాహం నింపింది. ఈ క్షణం కోసం సామాన్యులు మొదలుకొని రైతులూ, చిరు వ్యాపారులూ, చిన్నా చితకా పరిశ్రమలవారూ ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
సరుకులు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను హేతుబద్ధీకరిస్తూ, సాధారణ ప్రజానీకం వాడే అనేకానేక నిత్యావసరాలకు పన్ను తగ్గించటం లేదా పూర్తిగా ఎత్తేయటం... ఆరోగ్య బీమాకు పన్నుపోటు నుంచి మినహాయించటం తదితరాలు ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో ఊరట నిస్తాయి.
సామాన్యుల్లో జీఎస్‌టీ ‘గబ్బర్‌సింగ్ టాక్స్’గా అపకీర్తి పాలైందంటేనే వారిని ఎంతగా కష్టపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే పన్నుల హేతుబద్ధీకరణను అమలు చేయబోతున్నామని పదే పదే ప్రకటించటంతో జీఎస్‌టీ మండలి సమావేశమైనప్పుడల్లా అందరిలోనూ ఆశలు చిగురించేవి. తీరా మరిన్ని సరుకుల్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావటంతో వారంతా బిత్తరపోయేవారు.
ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడూ, వార్షిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టినప్పుడూ జీఎస్‌టీ తగ్గింపుపై ఊహాగానాలు రావటం, చివరకు నిట్టూర్చటం రివాజైపోయింది. ఈ దశలో మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్‌టీని సరళీకృతం చేయబోతున్నామని వెల్లడించారు. మొత్తానికి ఇప్పుడిక 5 శాతం, 18 శాతం పన్నుల విధానం అమలు కాబోతోంది.
ఆరంభమైన మొదలుకొని జీఎస్‌టీని ఎవరూ మెచ్చింది లేదు. తమ ఆదాయ వనరు లకు గండి కొట్టిందని రాష్ట్రాలూ, తమ జేబులు కత్తిరిస్తోందని మధ్యతరగతి జీవులూ,ఎంతో కష్టపడి సంపాదిస్తున్నది కాస్తా జీఎస్‌టీ పేరు మీద ప్రభుత్వం తన్నుకు పోతున్నదని వ్యాపారులూ ఆక్రోశిస్తూనే ఉన్నారు. జీఎస్‌టీ చిత్రవిచిత్రాలు పోయింది. వడాపావ్ వెన్నతో తింటే ఒక రకమైన పన్ను, అది లేకుండా తింటే వేరే రకం పన్ను వేయటాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు.
ఆ మధ్య నిర్మలా సీతారామన్ సమక్షంలో ఒక వ్యాపారవేత్త జీఎస్‌టీపై వెటకారంగా వ్యాఖ్యానించటం, ఆ వీడియో కాస్తా వైరల్ కావటంతో ఆయన కంగారుపడి మంత్రిని కలిసి క్షమాపణలు చెప్పటం అందరికీ తెలుసు. జీఎస్‌టీ అరాచకం అంతా ఇంతా కాదు. సబ్బు, షాంపూలపై 18 శాతం, స్కూలు పుస్త కాలు, పెన్సిళ్లు, రంగు పెన్సిళ్లు తదితరాలపై 12 శాతం, ఆఖరికి కోచింగ్ తీసుకుంటే 18 శాతం పన్నులతో ఎడాపెడా బాదటం అందరినీ దిగ్భ్రాంతి పరిచింది.
అయినా కేంద్రంలో కదలిక రాలేదు. అమెరికా విధించిన 50 శాతం సుంకాల వల్ల ఎదురుకాగల సమస్యల్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రంలో కదలిక వచ్చిందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఆ సంగతలా ఉంచితే ప్రజల్లో వినిమయాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు తీసుకురావటానికి తాజా నిర్ణయాలు దోహదపడతాయి.
ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకోవటానికి ఎంతసేపూ పరోక్ష పన్నులపైనే ఆధారపడతాయి. ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే నిజానికిది చాలా తక్కువ. కానీ పారిశ్రామికవేత్తలనూ, సంపన్నులనూ నొప్పించటం ప్రభుత్వాలకు ఇష్టం ఉండదు. వాళ్లంతా ఉపాధి కల్పనలో పాలుపంచుకుంటున్నారన్న కారణం చెబు తారు. పరోక్ష పన్నుల్ని ‘తిరోగమనం’గా అభివర్ణించేవారు కూడా ఉన్నారు.
సినిమా టిక్కెట్లపై విధించే వినోదపు పన్నునే వారు ఉదాహరిస్తారు. సామాన్యుడికైనా, కోట్లకు పడగెత్తిన సంపన్నుడికైనా ఆ పన్ను ఒకేలా ఉంటుంది. అయితే పన్ను విధింపులో కాస్తంత హేతుబద్ధత చూపటం ద్వారా సామాన్యుల్ని కూడా సంతుష్టి పరచవచ్చు. అర్థశాస్త్రంలోని ‘లేఫర్ కర్వ్’ భావన అటువంటిదే. పన్నులు తక్కువగా ఉంటే సామాన్య జనం అధికంగా కొని ఖజానా ఆదాయాన్ని పెంచుతారని ఈ భావన చెబుతుంది.
కానీ ప్రభుత్వాలు ఎంతసేపూ అధిక పన్నుల ద్వారా అధికాదాయం అనే ఆలోచనలోనే ఉంటాయి. అధిక పన్నులూ, వాటిని చెల్లించలేదంటూ వేధింపులూ వగైరాలను ‘ట్యాక్స్ టెర్రరిజం’గా కొందరు అభివర్ణిస్తున్నారు. ఈ సంస్కరణలు మైలురాయి వంటివా... కాదా అన్నది రానున్న కాలంలో తేలిపోతుంది. పనిలో పనిగా జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలకు కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే యోచన కూడా చేస్తే దేశంలో ఫెడరలిజం వర్ధిల్లుతుంది.