
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులుండరన్న నానుడి దౌత్యానికి కూడా వర్తిస్తుంది. పైకి ఏం చెబుతున్నా, ఇతరేతర ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలను పరిశీలించటమనే ప్రక్రియ దౌత్యంలో నిరంతరం కొనసాగుతుంటుంది. పర్యవసానంగా ఒక్కోసారి అనూహ్య పరిణామాలు కూడా చోటుచేసుకోవచ్చు. తాలిబన్‌ల ఆధ్వర్యంలోని అఫ్గానిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ గురువారం అయిదు రోజుల భారత సందర్శనకు రావటం అటువంటిదే. ఇది దక్షిణ, మధ్య ఆసియా భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేసే పరిణామం.
ప్రపంచ దేశాల్లో రష్యా మినహా మరే దేశమూ ఇంతవరకూ అఫ్గాన్ ప్రభుత్వాన్ని లాంఛనంగా గుర్తించలేదు. మన దేశం తొలిసారి ఆ దిశగా అడుగులేస్తున్నది. అమీర్ ఖాన్ రానున్న సందర్భంగా తాలిబన్‌ను ప్రాంతీయ బృందంలోని భాగస్వామిగా గుర్తించటానికి భారత్ సిద్ధపడింది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించటం ఇక లాంఛన ప్రాయం. భద్రతా మండలి ఉగ్రవాదులుగా గుర్తించి ఆంక్షలు విధించిన వారిలో అమీర్ ఖాన్ ఒకరు. దానికింద ఆయన తారసపడితే అరెస్టు చేయాల్సి ఉంటుంది. భారత్ చొరవతో ఈ విషయంలో తాత్కాలికంగా మినహాయింపు లభించింది.
తొలిసారి 1996లో అఫ్గాన్ తాలిబన్‌ల వశమైనప్పుడు మనకు ఎన్ని విధాల సమస్య లొచ్చాయో ఎవరూ మరిచిపోరు. సోవియెట్ దురాక్రమణను ప్రతిఘటించి పాలనాధి కారాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్‌లు అనేకమంది మిలిటెంట్లను కశ్మీర్‌కు తరలించారు. పర్యవసానంగా అక్కడ నెత్తురుటేర్లు పారాయి. కేంద్రంలో వాజ్‌పేయి నాయ కత్వాన తొలి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక 1999లో ఉగ్రవాదులు ఖాట్మండు నుంచి న్యూఢిల్లీ వచ్చే విమానాన్ని హైజాక్ చేసి అఫ్గాన్‌లోని కాందహార్‌కు తరలించారు. ముగ్గురు ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు. ఈ చర్య వెనక నేరుగా తాలిబన్‌లు లేక పోయినా ఉగ్రవాదులు సురక్షితంగా వెళ్లటానికి సహకరించారు. తాలిబన్‌లతో చర్చలు గానీ, గుర్తింపుగానీ ఉండబోదని అప్పట్లో మన దేశం ప్రకటించింది. ఇంటా, బయటా వారు సాగిస్తున్న అరాచకాలను తీవ్రంగా ఖండించేది.
ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా 2001లో అఫ్గాన్‌ను దురాక్రమించాక ఏర్పడిన ప్రభుత్వాలకు మన దేశం మద్దతుగా నిలిచింది. 2021లో తాలిబన్‌ల పునరాగమనంతో అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం పడిపోయేవరకూ మన దేశం పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టింది. రూ. 25,000 కోట్ల వ్యయంతో పార్లమెంటు భవనాన్నీ, సల్మా ఆనకట్టనూ, ఒక జాతీయ రహదారినీ నిర్మించింది. విద్యుదుత్పాదన ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితరాల్లో పాలుపంచుకుంది. ఇవన్నీ తాలిబన్‌లలో సద్భావన కలిగించటంతో పాటు పాకిస్తాన్‌తో వచ్చిన విభేదాలు కూడా వారిని భారత్‌వైపు మొగ్గేలా చేశాయి.
పాక్– అఫ్గాన్ దీర్ఘకాల సంబంధాలూ, ఉజ్బెకిస్తాన్ ద్వారా సన్నిహితం కావటానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలూ, చైనా వరస మంతనాలూ మన దేశంలో కూడా పునరాలోచన కలిగించాయి. మనం ముందడుగు వేయనట్టయితే ఏదోనాటికి తాలిబన్–పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడి, చైనా పలుకుబడి పెరిగి అది మన భద్రతకు ముప్పు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. పైగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా కీలకమైన అఫ్గాన్‌లోని బగ్రాం వైమానిక స్థావరాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. ఇది కూడా మన భద్రతను ప్రశ్నార్థకం చేసే పరిణామం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోబట్టే తాలిబన్‌లతో సత్సంబంధాలకు మన దేశం సిద్ధపడింది.
ఏ దేశానికైనా స్వీయ ప్రయోజనాలు, భద్రత అత్యంత కీలకం. ఆ తర్వాతే మిగిలిన వన్నీ. గత నాలుగేళ్లుగా మన దేశం వేలాది టన్నుల గోధుమలు, వందల టన్నుల మందులు, వ్యాక్సిన్లు, భారీ మొత్తంలో పురుగుమందులు, అత్యవసర సరుకులు పంపింది. ఇటీవల భూకంపం వచ్చినప్పుడు టెంట్లు, మందులు, దుప్పట్లు, జనరేటర్లు అందించింది. కాబూల్‌లో పూర్తిస్థాయి దౌత్య కార్యాలయం కాకపోయినా సాంకేతిక కార్యాలయాన్ని తెరిచింది. తాలిబన్ ప్రభుత్వం ఢిల్లీలో రాయబార కార్యాలయం ప్రారంభించుకోవటానికి అనుమతినిచ్చింది. ఈ అనుకూల వాతావరణంలో అఫ్గాన్‌తో సత్సంబంధాలకు ప్రయత్నించటం అనేక విధాల శుభ పరిణామం.