
స్వతంత్ర రచయితా, అనువాదకుడా – ఎవరు గొప్ప అని ప్రశ్నిస్తే; ఎవరైనా స్వతంత్ర రచయితే నంటారు, రచయిత లేకుండా అనువాదకుడు ఉండనే ఉండడు కనుక ఎప్పుడైనా స్వతంత్ర రచయితదే ప్రథమ స్థానం. ‘అనువాద’ మనడంలోనే ఆ సూచన ఉంది. ‘ఒకరు చెప్పిన దానిని వేరొక భాషలో తిరిగి చెప్పడ’మని ఆ మాటకు వ్యుత్పత్త్యర్థం.
క్రియలో చూస్తే, అనువాదకుడు స్వతంత్ర రచయితకు సమవుజ్జీ అనే కాక, కొన్ని విషయాల్లో అతణ్ణి మించగలడని కూడా అనిపిస్తుంది. అయినాసరే, మూల రచనను అందించిన స్వతంత్ర రచయితదే ప్రథమ స్థానమూ, అనువాదకుడిది ద్వితీయస్థానమేనంటారా; అనువాదకుడిది మరీ తక్కువ స్థానమేమీ కాదని గుర్తిస్తే చాలు!
స్వతంత్ర రచనా, అనువాదమూ సృష్టీ, పునఃసృష్టి లాంటివి. సృష్టి గొప్పదా, పునఃసృష్టి గొప్పదా అంటే; దేని గొప్ప, దేని కష్టాలు, దేని సౌలభ్యాలు దానికే ఉన్నాయి. సృష్టిలో సృజనశక్తి కీలకమవుతుంది కనుక ఆ మేరకు దాని స్థానం దానిదే, ఎంతైనా అనువాదం అనుçసృజన మాత్రమే.
అయితే సృష్టిలో ఉన్న ఒక సౌలభ్యమేమిటంటే, అది ఇంకొకదాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు కనుక, ఏది ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో నిర్ణయించుకునే అపరిమిత స్వేచ్ఛ దాని కుంటుంది.
అనువాదకునికి లేనిదదే; మూలరచన విధించిన హద్దులకు లోబడే తన అనుకృతిని తీర్చి ఒప్పించి మెప్పించవలసిందే. ఆ కోణంలో, అనువాదమనేది నెత్తిమీద కలశాలను పెట్టుకుని, పళ్ళెం అంచుల మీద చేసే నృత్య విశేషం లాంటిదైతే, మూలరచన నిర్నిబంధ, స్వేచ్ఛానర్తనం.
అనువాదమంటే ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి తేవడమే కదా అనుకుంటాం; అందుకూ కొంత నేర్పూ, శ్రమా అవసరమే కానీ, ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ దానిని మరింత సులభ తరం చేసిందని కూడా అనుకుంటున్నాం. అయితే, అనువాదమంటే కేవలం భాషానువాదమే కాదన్న సంగతి అనువాదంలోకి తలదూర్చితేనే అర్థమవుతుంది. భాషానువాదం పైకి కనిపించే తొలిమెట్టు మాత్రమే; దానికి పైన కనిపించని మెట్లు చాలా ఉంటాయి.
వాటిని కూడా మనోనేత్రంతో దర్శించి వాటి మీదుగా తన అనుకృతిని చివరి మెట్టు దాకా ఒడుపుగా నడిపించి మూలాన్ని మరిపించడంలోనే అనువాదకుడి ప్రతిభ పండుతుంది. అంటే, అతను భాషనే కాక మూలరచయిత శైలీ, శిల్పం, భావం సహా సమస్త రచనాంగాలనూ అనువదిస్తాడు; అంతిమంగా మూలరచయిత హృదయాన్నీ, మేధనూ అనువదిస్తాడు; అలా తనే మూల రచయిత అయి పోతాడు. ఇది మాంత్రికులు చెప్పే పరకాయ ప్రవేశానికేమాత్రం తక్కువ కాదు. ఎంత కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చినా ఈ సహజ మేధకు ప్రత్యామ్నాయమవుతుందా అన్నది సందేహమే.
ఇంతకీ సారాంశమేమిటంటే, మూల రచయితది ఏకపాత్రాభినయమైతే, అనువాదకుడిది ద్విపాత్రాభినయం; అతని(లేదా ఆమె)లో అనువాదకుడు, మూల రచయితా ఇద్దరూ ఉంటారన్న మాట. అలా చూసినప్పుడు ప్రతిభలో అనువాదకుడు మూల రచయితకు దాదాపు సమానుడవుతాడు; అదే అతను పడే పరిశ్రమకు వస్తే, అది ద్విగుణితమూ, త్రిగుణితమూ కూడా అవుతుంది. ఆ విధంగా, స్వతంత్ర రచయిత ప్రథమ గణ్యుడే కానీ, అనువాదకుడు అగస్త్య భ్రాతేమీ కాదు.
ఆధునిక కాలానికి వస్తే, దేశీయంగా, విదేశీయంగా కూడా బహు భాషా సాహిత్యాలు, సాహిత్య ప్రక్రియలతో పరిచయం పెరిగి, అనువాద రంగం బహుముఖాలుగా అభివృద్ధి చెందడం చూస్తు న్నాం. కాకపోతే, అనువాదంలో మెళకువలు, ప్రమాణాలు, ఎదుర్కొనే క్లిష్టతా మొదలైన విష యాల్లో ప్రాచీనులు, ఆధునికుల అవగాహనలో పెద్ద తేడా లేకపోవడం ఒక విధంగా ఆశ్చర్యకరమే.
అసలు తెలుగు సాహిత్యం నన్నయ భారతానువాదంతో ప్రారంభమవడమే ఒక విశేషమనుకుంటే, అనువాదంలోని క్లేశాన్ని గుర్తించి చెప్పిన తొలి అనువాదకుడు కూడా నన్నయే కావడం మరో విశేషం. అనువాదమంటే కేవలం భాషానువాదం కాదు కనుకనే, ‘గహనమైన అర్థాలనే జలాలతో నిండిన భారతమనే మహాసముద్రాన్ని చివరిదాకా ఈదడం బ్రహ్మకైనా సాధ్యమవుతుందా? అయినా నాకు చేతనైన మేరకు ప్రయత్నిస్తా’నని చెప్పుకుని ముందే జాగ్రత్తపడతాడు.
ఆ ఒరవడి లోనే తిక్కన, ‘నా నేర్చిన భంగి చెబుతా’నంటూనే, మహాభారత మూలకర్త వ్యాసమహర్షిని మనసు నిండా నిలుపుకొని మరీ ముందుకెడతానంటాడు. నన్నయ మిగిల్చిన అరణ్య పర్వ శేషాన్ని పూరించిన ఎఱా<ప్రగడ అయితే, అనువాదంతోపాటు, అచ్చం నన్నయలానే రచించాలనే మరో సవాలును మీదేసుకుంటాడు.
భట్ట హర్షుని ‘నైషధ’ కావ్యాన్ని ‘శృంగార నైషధము’ పేరిట అనువదిస్తూ శ్రీనాథుడు నిర్దేశించిన ప్రమాణాలు త్రికాలాలలోనూ శిరోధార్యాలే. ‘శబ్దాన్ని అనుసరించి, అభి ప్రాయాన్ని గుర్తించి, భావాన్ని ఉపలక్షించి, రసాన్ని పోషించి, అలంకారాన్ని భూషించి, ఔచిత్యాన్ని ఆదరించి, అనౌచిత్యాన్ని పరిహరించి మూలానుసారంగా రచిస్తా’నంటాడాయన.
అలా ‘మూలానుసారంగా’ అనువదించడం కూడా ఒక సార్వకాలికమైన ప్రాథమిక విధేనను కుంటే, ‘స్వేచ్ఛానువాదం’, ‘సంక్షిప్తానువాద’ మనేవి మూలాతిక్రమణలే కావచ్చు; సరే, అది వేరే ముచ్చట. ఏ రెండు భాషల నిర్మాణమూ ఒకేలా ఉండాలని లేదు కనుక ఒక్కోసారి మూలం నుంచి పక్కకు జరగడమూ అనివార్యమవుతుంది, నిజమే కానీ, అలాంటివి మినహాయింపులు మాత్రమే, నిబంధన మాత్రం మూలానుసరణమే! అసలు దేనికైనా తప్పనిసరి ముడిసరకు ప్రతిభే అనుకున్న ప్పుడు స్వతంత్రమా, అనువాదమా అన్న చర్చ పక్కకు తప్పుకుని అనువాదమే స్వతంత్ర రచన లానూ భాసించవచ్చు.