
అన్నమే కాదు, అక్షరమూ పరబ్రహ్మ స్వరూపమే! బొందిలో ప్రాణాన్ని నిలుపు కోవడానికి అన్నం ఎంత అవసరమో; ఆలోచనలను పదును పెట్టుకోవడానికి, పదును పెట్టుకున్న ఆలోచనలను పదికాలాల పాటు పదిలపరచుకోవడానికి అక్షరం అంతే అవసరం. ‘అక్షరం బ్రహ్మ పరం స్వభావో అధ్యాత్మముచ్యతే/ భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః’ అని ‘భగవద్గీత’ చెబుతోంది. అంటే, నాశనం లేని అక్షరమే పరబ్రహ్మం. అక్షర స్వభావమే, తన ఆత్మరూపమే అధ్యాత్మం అని అర్థం. అక్షరం జ్ఞానకళిక. ప్రపంచం సాధించిన నేటి పురోగతికి అక్షరమే ఆలంబన. అక్షరమే లేకుంటే, నేటికీ ప్రపంచం అజ్ఞాన తమస్సమాధిలోనే కూరుకుని ఉండేది.
అనంత జ్ఞానయానానికి అక్షరం తొలి అడుగు మాత్రమే! కేవలం అక్షరాస్యత వల్లనే ఎవరూ జ్ఞానఖనులు కాలేరు. ‘జీవితంలో విజయవంతం కావాలంటే అక్షరాస్యత, డిగ్రీలు మాత్రమే చాలవు; విద్య కావాలి’ అన్నారు ప్రఖ్యాత హిందీ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్. ఆయన మాట అక్షరసత్యం. మన దేశంలో పట్టభద్రుల సంఖ్య పెరుగు తున్నంతగా విద్యావంతుల సంఖ్య పెరగడం లేదు. అక్షరాస్యత సాధించడమే ఘనకార్యంగా ప్రచారం చేసుకునే దశ నుంచి మన ప్రభుత్వాలు ఎంత త్వరగా బయటపడితే దేశానికి అంత మంచిది.
మన దేశంలోని బడిపిల్లల్లో అక్షరాస్యత కూడా అరకొరగానే ఉంటోంది. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల్లో దాదాపు సగం మందికి ప్రాథమిక స్థాయి అంశాలపై కూడా అవగాహన లేదని; చిన్న చిన్న లెక్కలు చేయడానికి, సరళమైన వాక్యాలు రాయడానికి కూడా వీరు సతమతమయ్యే స్థితిలోనే ఉన్నారని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ పరిశీలనలో తేలింది. నేటి బడిపిల్లలే రేపటి పట్టభద్రులు. నేటి పునాదులే ఇంత చక్కగా ఉంటే, ఈ పునాదుల పైనే వెలిసే రేపటి భవంతులు ఎంత దృఢంగా ఉంటాయో ఊహించుకోవాల్సిందే!
మన చదువుల తీరుతెన్నులపై ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆందోళన కాదిది. ఈ పరిస్థితి బ్రిటిష్ హయాంలోనూ ఉండేది. ‘ఇంగిలీషుతో పాటుగా నిపుడు సంస్కృ/ తమ్మునకు గూడ డిగ్రీల తంపి వచ్చె/ నట్లు ప్యాసగు వారలయందెవండొ/ తక్క దక్కినవారు శుద్ధ జడమతులె’ అని చెళ్లపిళ్లవారు అప్పట్లోనే వాపోయారు. బ్రిటిష్ పాలన ముగిసి, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా, మన అక్షరాస్యత డెబ్బయి ఐదు శాతానికి లోపే! అంటే, ఇంకా దాదాపు నాలుగో వంతు జనాభా అక్షరాస్య తకు దూరంగానే ఉంది.
స్వాతంత్య్రం వచ్చే నాటితో పోల్చుకుంటే దేశంలోని పట్టభద్రుల సంఖ్య దాదాపు నూటయాభై రెట్లు పెరిగింది. డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించుకుంటున్న బహుపట్టభద్రుల్లో ఎంతమంది వివేకం కలిగిన విద్యావంతులో నిగ్గుతేల్చడం అంత సాధ్యమయ్యే పనికాదు. అయినా, ఎవరి డిగ్రీలు వారి వ్యక్తిగతాలు. వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
అక్షరాస్యత వలన విద్య; విద్య వలన వినయ వివేకాలు ఒనగూరుతాయనేది ఒక చిరకాల విశ్వాసం. విశ్వాసాలు విశ్వాసాలే! విశ్వాసాలన్నీ వాస్తవాలు కావాలనే నిబంధనేదీ లేదు. ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టక నేర్చునటయ్య భాస్కరా!’ అన్నాడు శతకకారుడు. ఎంత చదువు చదివినా, కాస్త రసజ్ఞత లేకుంటే ఆ చదువు నిరర్థకమే! గుణవంతులెవరూ అలాంటి చదువును మెచ్చరు అని మారవి వెంకయ్య కవిహృదయం.
‘చదువని వాడజ్ఞుండగు/ చదివిన సదసద్వివేక చతురత గలుగున్/ చదువగ వలయును జనులకు/ చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రీ!’ అని పోతనా మాత్యుడు భాగవతంలో హిరణ్యకశిపుడి పాత్ర ద్వారా చెప్పారు. ప్రహ్లాదుడిని చండా మార్కుల గురుకులానికి పంపిస్తూ, ఎందుకు చదువుకోవాలో చెప్పాడు హిరణ్యకశిపుడు. మన పూర్వ కవులకు తెలిసిన చదువుల ప్రయోజనానికీ, నేటి జనాలకు తెలిసిన చదువుల ప్రయోజనానికీ నడుమ యోజనాల దూరం ఉంది. అక్షరాస్యత వలన డిగ్రీలు; డిగ్రీల వలన కొలువులు ఒనగూరుతాయనేదే నేటి విశ్వాసం.