కథకు దక్కిన గౌరవం | Sakshi Editorial On Kannada writer Banu Mushtaq | Sakshi
Sakshi News home page

కథకు దక్కిన గౌరవం

May 26 2025 12:46 AM | Updated on May 26 2025 12:46 AM

Sakshi Editorial On Kannada writer Banu Mushtaq

కన్నడ రచయిత్రి బాను ముష్తాక్‌ తన ‘హార్ట్‌ ల్యాంప్‌’(హృదయ దీపం) కథాసంపుటికిగానూ ‘ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌’ గెలుచుకోవడం చాలా విధాలుగా ప్రత్యేకమైనది. ఇది కర్ణాటకకే కాదు, దక్షిణ భారతదేశానికే దక్కిన తొలి గౌరవం. బుకర్‌ చరిత్రలో ఒక కథల సంపుటికి ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. ఇది గెలుచుకున్న అత్యంత ఎక్కువ వయసువాళ్లలో(77) ఆమె ఒకరు (ఫిలిప్‌ రాత్‌కు ఇచ్చినప్పుడు 78 ఏళ్ళు). 

ఆంగ్లంలో రాసిన పుస్తకాలకు ఇచ్చే ‘బుకర్‌ ప్రైజ్‌’ను కొంతమంది భారతీయ, భారత సంతతి రచయితలు ఇంతకుముందు గెలుచుకున్నారు; వాటి గొప్పతనం వాటిదే! కానీ ఆంగ్లంలో రాయనక్కర్లేకుండా తమకు చేరువైన భాషలో రాస్తూనే అంతర్జాతీయ ఖ్యాతి పొందవచ్చని ఈ గౌరవం చెబుతోంది. భిన్న భారతీయ భాషల్లో వస్తున్న శ్రేష్ఠమైన సాహిత్యాన్ని ఆంగ్ల ప్రపంచపు గుమ్మంలోకి ప్రవేశపెట్టే చొరవ చూపేలా ఈ విజయం ప్రచురణకర్తలకు ప్రేరణనిస్తోంది. గట్టిగా ఆంగ్ల భాష తలుపు కొట్టగలిగితే, ఇతర భాషల కిటికీలు వాటికవే తెరుచుకుంటాయి.

రచయిత్రి, పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త, న్యాయవాది అయిన బాను ముష్తాక్‌ ఆరు కథా సంపుటాలు, ఒక వ్యాసాల సంకలనం, ఒక కవిత్వ సంపుటి, ఒక నవల వెలువరించారు. 

పురుషాధిపత్య సమాజంలో ముస్లిం మహిళల జీవన వ్యథలను ఆమె చిత్రించారు. ఆమె పాత్రలు కన్నడ, దక్కనీ ఉర్దూ, అరబిక్‌ మాట్లాడుతాయి. 1990–2023 మధ్యకాలంలో ఆమె రాసిన 50కి పైగా కథల్లోంచి 12 కథలను కూర్చడంతోపాటు, వాటిని ఆంగ్లంలోకి అనువదించిన దీపా భాస్తి ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న తొలి భారతీయ అనువాదకురాలు అయ్యారు. ‘‘మహిళ రాసి, మహిళ సంపాదకత్వం వహించి, మహిళ అనువదించిన పుస్తకం హార్ట్‌ ల్యాంప్‌’’ అన్నారు బెంగాలీ అనువాదకుడు అరుణవ సిన్హా. 

ఈ పురస్కారాన్ని 2022లో తొలిసారిగా ఇండియా నుండి హిందీ రచయిత్రి గీతాంజలిశ్రీ గెలుచుకోవడానికి కారణమైన అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌ ఒక అమెరికన్‌ అని తెలిసిందే! అవార్డు కింద నగదుగా ఇచ్చే యాభై వేల పౌండ్లను నియమాల మేరకు బాను, దీపా సమానంగా పంచుకుంటారు. భారతీయ భాషల్లోని మంచి సాహిత్యాన్ని మరో దరికి చేర్చాలన్న అనువాదకుల పూనికకు ఇది గట్టి ప్రోత్సాహం కాగలదు. 

1970–80ల్లో కర్ణాటకలో మొదలైన బండాయ సాహిత్యోద్యమం దళితులు, ముస్లింలు తమ కథలను తామే రాసుకునే ప్రేరణనిచ్చింది. మంచి ముస్లిం బాలికలు ఉర్దూలో ఖురాన్‌ చదవగలిగితే చాలు అనే సామాజిక వాతావరణంలో తొలుత ఉర్దూలో చదవడం ప్రారంభించి, తండ్రి (ఎస్‌.ఎ.రహమాన్, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌) ప్రోద్బలంతో కన్నడ మాధ్యమంలోకి మారిన బాను ఆ భాషనే తన రచనా వాహికగా ఎంచుకున్నారు. ‘‘నాకు అక్షరాలు వచ్చినప్పటి నుంచీ రాయడం మొదలుపెట్టాను’’ అంటారామె. 

రష్యన్‌ రచయిత ఫ్యోదర్‌ దోస్తోవ్‌స్కీ, కన్నడ రచయిత దేవనూర్‌ మహదేవను అభిమానించే ఆమె ‘నాను అపరాధియే?’ పేరుతో తొలి కథ రాశారు. తన స్నేహితురాళ్లు చిన్ననాటనే పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో నిలిచిపోతున్నా ఆమె ఆగకుండా పైచదువులకు వెళ్లారు. సినిమాకు వెళ్లడం మీద ఒక ముస్లిం యువతిని అడ్డుకున్న ఉదంతం గురించి ఆమె రాసిన తొలి వ్యాసం చర్చనీయాంశం కావడంతో పాటు ఆమెను ‘లంకేశ్‌ పత్రికే’ జర్నలిస్టుగా మార్చింది. 

26 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, వివాహానంతరం బురఖా ధరించాలనీ, ఇంటి పనులకే పరిమితం కావాలనీ అత్తవారింటి నుంచి ఒత్తిడి వచ్చింది. చేస్తున్న హైస్కూల్‌ టీచర్‌ ఉద్యోగం మానాల్సి వచ్చింది. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కలిగాక ఒక దశలో నిరాశా నిస్పృహలతో వైట్‌ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయారు. మూడేళ్ల పాపను ఆమె కాళ్ల దగ్గర పెట్టి, అలా చేయొద్దంటూ ఆమె భర్త ముష్తాక్‌ మొహియుద్దీన్‌ ఆమెను హత్తుకున్నారు. 

అప్పట్నించీ ఆమెకు అన్నింటా అండగా నిలిచారు. స్త్రీల వేదన, నిస్సహాయత తన మీద లోతైన ప్రభావం చూపి, రాయక తప్పని స్థితిని కల్పించాయంటారు బాను. ‘‘నువ్వు ఈ ప్రపంచాన్ని మళ్లీ నిర్మించదలిస్తే, మగవాళ్లనూ ఆడవాళ్లనూ సృష్టించదలిస్తే అనుభవం లేని కుమ్మరిగా ఉండకు. ప్రభూ! ఈ భూమ్మీదకు ఒక్కసారి ఆడదానిగా రా!’’ అని అడుగుతుంది ‘ఓ దేవుడా! ఒక్కసారి ఆడదానిగా ఉండు’ కథ. ‘‘మతం, సమాజం, రాజకీయాలు స్త్రీల నుంచి ప్రశ్నించకూడని విధేయతను డిమాండ్‌ చేస్తాయి. 

ఈ క్రమంలో అమానవీయ క్రూరత్వాన్ని మోపుతాయి’’ అంటారామె. మసీదుల్లో స్త్రీలకు ప్రార్థించే హక్కు ఉండాలంటారు ఈ ‘ఫైర్‌బ్రాండ్‌’. సొంత సమాజం మీద ఉమ్మివేయడం ద్వారా బయట జేజేలు కొట్టించుకుంటోందన్న నిందలు మోశారు. ఒక దశలో ఆమె మీద కత్తిదాడి యత్నం జరిగింది. అయితే దాడి చేసిన వ్యక్తిని ఆమె క్షమించారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. ‘మన ముక్కులు కోపిస్తుంది’ అని ఆమె తండ్రితో ఆమె కుటుంబ సభ్యులు సరదాగా అనేవాళ్లట. 

బదులుగా ఇప్పుడు అందరిలోనూ వాళ్లంతా ముఖాలు ఎత్తి నిలబడేలా చేయగలిగారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడాన్ని ‘ఒక్క ఆకాశాన్ని వెయ్యి మిణుగురులు వెలిగించినట్టుగా’ ఆమె అనుభూతి చెందారు. ‘ప్రతీ గొంతుకనూ వినే, ప్రతీ కథకూ మన్నన దక్కే, ప్రతీ మనిషీ మరొకరికి చెందే ప్రపంచాన్ని సృష్టించాలి’ అని తన పురస్కార అంగీకారోపన్యాసంలో కోరారు. అదే నిజమైతే, మిణుగురులు ఆకాశాన్ని వెలిగించే అనుభూతి ప్రతి ఒక్కరికీ సాక్షాత్కరిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement