breaking news
Kannada Writer
-
కథకు దక్కిన గౌరవం
కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ తన ‘హార్ట్ ల్యాంప్’(హృదయ దీపం) కథాసంపుటికిగానూ ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్’ గెలుచుకోవడం చాలా విధాలుగా ప్రత్యేకమైనది. ఇది కర్ణాటకకే కాదు, దక్షిణ భారతదేశానికే దక్కిన తొలి గౌరవం. బుకర్ చరిత్రలో ఒక కథల సంపుటికి ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. ఇది గెలుచుకున్న అత్యంత ఎక్కువ వయసువాళ్లలో(77) ఆమె ఒకరు (ఫిలిప్ రాత్‌కు ఇచ్చినప్పుడు 78 ఏళ్ళు). ఆంగ్లంలో రాసిన పుస్తకాలకు ఇచ్చే ‘బుకర్ ప్రైజ్’ను కొంతమంది భారతీయ, భారత సంతతి రచయితలు ఇంతకుముందు గెలుచుకున్నారు; వాటి గొప్పతనం వాటిదే! కానీ ఆంగ్లంలో రాయనక్కర్లేకుండా తమకు చేరువైన భాషలో రాస్తూనే అంతర్జాతీయ ఖ్యాతి పొందవచ్చని ఈ గౌరవం చెబుతోంది. భిన్న భారతీయ భాషల్లో వస్తున్న శ్రేష్ఠమైన సాహిత్యాన్ని ఆంగ్ల ప్రపంచపు గుమ్మంలోకి ప్రవేశపెట్టే చొరవ చూపేలా ఈ విజయం ప్రచురణకర్తలకు ప్రేరణనిస్తోంది. గట్టిగా ఆంగ్ల భాష తలుపు కొట్టగలిగితే, ఇతర భాషల కిటికీలు వాటికవే తెరుచుకుంటాయి.రచయిత్రి, పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త, న్యాయవాది అయిన బాను ముష్తాక్ ఆరు కథా సంపుటాలు, ఒక వ్యాసాల సంకలనం, ఒక కవిత్వ సంపుటి, ఒక నవల వెలువరించారు. పురుషాధిపత్య సమాజంలో ముస్లిం మహిళల జీవన వ్యథలను ఆమె చిత్రించారు. ఆమె పాత్రలు కన్నడ, దక్కనీ ఉర్దూ, అరబిక్ మాట్లాడుతాయి. 1990–2023 మధ్యకాలంలో ఆమె రాసిన 50కి పైగా కథల్లోంచి 12 కథలను కూర్చడంతోపాటు, వాటిని ఆంగ్లంలోకి అనువదించిన దీపా భాస్తి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి భారతీయ అనువాదకురాలు అయ్యారు. ‘‘మహిళ రాసి, మహిళ సంపాదకత్వం వహించి, మహిళ అనువదించిన పుస్తకం హార్ట్ ల్యాంప్’’ అన్నారు బెంగాలీ అనువాదకుడు అరుణవ సిన్హా. ఈ పురస్కారాన్ని 2022లో తొలిసారిగా ఇండియా నుండి హిందీ రచయిత్రి గీతాంజలిశ్రీ గెలుచుకోవడానికి కారణమైన అనువాదకురాలు డైసీ రాక్వెల్ ఒక అమెరికన్ అని తెలిసిందే! అవార్డు కింద నగదుగా ఇచ్చే యాభై వేల పౌండ్లను నియమాల మేరకు బాను, దీపా సమానంగా పంచుకుంటారు. భారతీయ భాషల్లోని మంచి సాహిత్యాన్ని మరో దరికి చేర్చాలన్న అనువాదకుల పూనికకు ఇది గట్టి ప్రోత్సాహం కాగలదు. 1970–80ల్లో కర్ణాటకలో మొదలైన బండాయ సాహిత్యోద్యమం దళితులు, ముస్లింలు తమ కథలను తామే రాసుకునే ప్రేరణనిచ్చింది. మంచి ముస్లిం బాలికలు ఉర్దూలో ఖురాన్ చదవగలిగితే చాలు అనే సామాజిక వాతావరణంలో తొలుత ఉర్దూలో చదవడం ప్రారంభించి, తండ్రి (ఎస్.ఎ.రహమాన్, హెల్త్ ఇన్స్పెక్టర్) ప్రోద్బలంతో కన్నడ మాధ్యమంలోకి మారిన బాను ఆ భాషనే తన రచనా వాహికగా ఎంచుకున్నారు. ‘‘నాకు అక్షరాలు వచ్చినప్పటి నుంచీ రాయడం మొదలుపెట్టాను’’ అంటారామె. రష్యన్ రచయిత ఫ్యోదర్ దోస్తోవ్స్కీ, కన్నడ రచయిత దేవనూర్ మహదేవను అభిమానించే ఆమె ‘నాను అపరాధియే?’ పేరుతో తొలి కథ రాశారు. తన స్నేహితురాళ్లు చిన్ననాటనే పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో నిలిచిపోతున్నా ఆమె ఆగకుండా పైచదువులకు వెళ్లారు. సినిమాకు వెళ్లడం మీద ఒక ముస్లిం యువతిని అడ్డుకున్న ఉదంతం గురించి ఆమె రాసిన తొలి వ్యాసం చర్చనీయాంశం కావడంతో పాటు ఆమెను ‘లంకేశ్ పత్రికే’ జర్నలిస్టుగా మార్చింది. 26 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, వివాహానంతరం బురఖా ధరించాలనీ, ఇంటి పనులకే పరిమితం కావాలనీ అత్తవారింటి నుంచి ఒత్తిడి వచ్చింది. చేస్తున్న హైస్కూల్ టీచర్ ఉద్యోగం మానాల్సి వచ్చింది. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కలిగాక ఒక దశలో నిరాశా నిస్పృహలతో వైట్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయారు. మూడేళ్ల పాపను ఆమె కాళ్ల దగ్గర పెట్టి, అలా చేయొద్దంటూ ఆమె భర్త ముష్తాక్ మొహియుద్దీన్ ఆమెను హత్తుకున్నారు. అప్పట్నించీ ఆమెకు అన్నింటా అండగా నిలిచారు. స్త్రీల వేదన, నిస్సహాయత తన మీద లోతైన ప్రభావం చూపి, రాయక తప్పని స్థితిని కల్పించాయంటారు బాను. ‘‘నువ్వు ఈ ప్రపంచాన్ని మళ్లీ నిర్మించదలిస్తే, మగవాళ్లనూ ఆడవాళ్లనూ సృష్టించదలిస్తే అనుభవం లేని కుమ్మరిగా ఉండకు. ప్రభూ! ఈ భూమ్మీదకు ఒక్కసారి ఆడదానిగా రా!’’ అని అడుగుతుంది ‘ఓ దేవుడా! ఒక్కసారి ఆడదానిగా ఉండు’ కథ. ‘‘మతం, సమాజం, రాజకీయాలు స్త్రీల నుంచి ప్రశ్నించకూడని విధేయతను డిమాండ్ చేస్తాయి. ఈ క్రమంలో అమానవీయ క్రూరత్వాన్ని మోపుతాయి’’ అంటారామె. మసీదుల్లో స్త్రీలకు ప్రార్థించే హక్కు ఉండాలంటారు ఈ ‘ఫైర్‌బ్రాండ్’. సొంత సమాజం మీద ఉమ్మివేయడం ద్వారా బయట జేజేలు కొట్టించుకుంటోందన్న నిందలు మోశారు. ఒక దశలో ఆమె మీద కత్తిదాడి యత్నం జరిగింది. అయితే దాడి చేసిన వ్యక్తిని ఆమె క్షమించారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. ‘మన ముక్కులు కోపిస్తుంది’ అని ఆమె తండ్రితో ఆమె కుటుంబ సభ్యులు సరదాగా అనేవాళ్లట. బదులుగా ఇప్పుడు అందరిలోనూ వాళ్లంతా ముఖాలు ఎత్తి నిలబడేలా చేయగలిగారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడాన్ని ‘ఒక్క ఆకాశాన్ని వెయ్యి మిణుగురులు వెలిగించినట్టుగా’ ఆమె అనుభూతి చెందారు. ‘ప్రతీ గొంతుకనూ వినే, ప్రతీ కథకూ మన్నన దక్కే, ప్రతీ మనిషీ మరొకరికి చెందే ప్రపంచాన్ని సృష్టించాలి’ అని తన పురస్కార అంగీకారోపన్యాసంలో కోరారు. అదే నిజమైతే, మిణుగురులు ఆకాశాన్ని వెలిగించే అనుభూతి ప్రతి ఒక్కరికీ సాక్షాత్కరిస్తుంది. -
స్త్రీ హృదయ దీపానికి మరింత కాంతి
మైనారిటీ సమాజంలోని స్త్రీల జీవితాన్ని, సంఘర్షణను కథలుగా రాసిన కన్నడ రచయిత్రి బాను ముష్టాక్‌కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్‌ప్రైజ్ మంగళవారం ప్రకటించారు. 50 వేల పౌండ్లు బహుమతి. కర్నాటక రాష్ట్రంలో సామాజిక కార్యకర్తగా, అడ్వకేట్‌గా, రచయిత్రిగా గుర్తింపు పొంది నేడు తొలిసారి దక్షిణాది భాషకు బుకర్ ప్రైజ్ తెచ్చి పెట్టిన బాను ముష్టాక్ పరిచయం.‘మీరు రచయిత కావడానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు?’ అనే ప్రశ్నకు ‘ప్రజలు’ అని సమాధానం చెప్తారు బాను ముష్టాక్. ‘వారిలోని మంచి, చెడు, టక్కరితనం, నిస్సహాయత, ఓర్పు, ప్రతి మనిషికీ ఉండే కథ... ఇవే నన్ను రచయిత్రిని చేశాయి’ అంటారామె.75 ఏళ్ల బాను ముష్టాక్ భారతీయ సాహిత్యం, అందునా దక్షిణాది సాహిత్యం, ప్రత్యేకం కన్నడ సాహిత్యం గర్వపడేలా ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025’ను మంగళవారం రాత్రి గెలుచుకున్నారు. ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేట్ అయిన ఆమె 12 కథల పుస్తకం ‘హార్ట్ ల్యాంప్’ ఈ ప్రతిష్టాత్మక బహుమతి గెలుచుకుంది. దక్షిణాది భాషలకు బుకర్ ప్రైజ్ దక్కడం ఇదే మొదటిసారి. ఇదీ చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీజర్నలిస్టుగా, అడ్వకేట్‌గా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన బాను ముష్టాక్ 1990 నుంచి ముస్లిం స్త్రీల జీవన గాథలను కథనం చేస్తూ వచ్చారు. ఆమె రాసిన మొత్తం 50 కథల నుంచి 12 కథలు ఎంచి దీపా బస్తీ అనువాదం చేయగా ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్‌కు చెందిన ‘అండ్ అదర్ స్టోరీస్’ అనే చిన్న పబ్లిషింగ్ సంస్థ ప్రచురించింది.బాను ముష్టాక్ ఎవరు?బాను ముష్టాక్ కర్ణాటక రాష్ట్రం హాసన్‌లో జన్మించారు. తండ్రి సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్. ఆమెను చిన్నప్పుడు ఉర్దూ స్కూల్లో వేయగా, అక్కడి వాతావరణం సరిపడక ఎనిమిదేళ్ల వయసులో శివమొగ్గలోని కన్నడ స్కూల్లో చేరారు. ఆరు నెలల్లో కన్నడ నేర్చుకుంటేనే స్కూల్లో ఉంచుతాం లేకుంటే పంపించేస్తాం అనంటే కొద్ది రోజుల్లోనే కన్నడ భాషను నేర్చుకుని ఆశ్చర్యపరిచారు. దీంతో ఒక్క ఏడాదిలోనే ఆమెను ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతికి పంపించారు. ‘నేను మా ఇంటికి పెద్ద కూతుర్ని. మా నాన్న తన పిల్లలు డబుల్ డిగ్రీలు చేయాలని పట్టుదలగా ఉండేవాడు’ అంటుంది బాను ముష్టాక్. చదవండి: హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లుఆది నుంచి సవాళ్లేబాను ముష్టాక్‌కు ముందునుంచి తిరగబడే స్వభావం ఉంది. మగపిల్లలతో కలిసి సైకిల్ నేర్చుకుంటున్న ఆమెను ముస్లిం పెద్దలు ఆపి ఇలా సైకిల్ తొక్కకూడదని హెచ్చరించారు. అయినా ఆమె లెక్క చేయలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు మాత్రమే జరిగే కాలంలో ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. 1974లో కట్నం ప్రస్తావన లేకుండా ఆమె పెళ్లి జరిగింది. అయితే వాచ్ రిపేరర్ అయిన భర్తకు సరైన సంపాదన లేకపోవడం, అత్తింటివారి నుంచి ఇబ్బందులు, ఉమ్మడి సంసారం కలిగిన ఇంటిలో వారితో కలిసి ఉండటం.. ఇవన్నీ ఆమెను మానసికంగా బలహీనురాలిని చేశాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అగ్గిపుల్ల వెలిగించే సమయంలో భర్త ఆపారు. చివరకు ఆమె షరతులకు భర్త ఒప్పుకోవడంతో ఆత్మహత్య, విడాకుల ఆలోచనలు మానుకున్నారు. అప్పటినుంచి ఆమెకు కాస్త స్వేచ్ఛ లభించింది.పత్రికా రచయితగా‘ముస్లిం మహిళలు సినిమాలు చూడటం నేరమా?’ అనే అంశంపై ఆమె రాసిన వ్యాసం కన్నడ పత్రిక ‘లంకేశ్ పత్రికె’లో ప్రచురితమై విశేషమైన పేరు తెచ్చింది. దాంతో అదే పత్రికలో రిపోర్టరుగా చేరారు. అనంతరం కొన్ని నెలలపాటు బెంగళూరు ఆలిండియా రేడియోలో పని చేశారు. 1978లో తండ్రి ప్రోద్బలంతో మీద ఆమె మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థినిగా పోటీ చేశారు. ఎన్నికల గుర్తు ‘కుట్టు మిషన్’. తండ్రితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఆమె ప్రచారం చేశారు. అయితే ఇలా చేయడం స్థానిక ముస్లిం పెద్దలకు నచ్చలేదు. ఓటు వేయొద్దని వారు వ్యతిరేక ప్రచారం చేశారు. అలా ఒక్క ఓటు తేడాతో ఆమె ఓడిపోయారు. మొదటి ప్రయత్నంలో ఓడిపోయినా, ఆ తర్వాత రెండుసార్లు హాసన్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు. బాను ముస్తాక్ రచయితగానే కాక, సామాజిక కార్యకర్తగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరికీ సమానహక్కులు దక్కాలని, సామాజిక న్యాయం అందాలని పోరాడారు. తొలుత దళిత హక్కుల ఉద్యమ పరిచయంతో మొదలైన పోరాట జీవితం ఆ తర్వాత అనేక అంశాలపై పోరాడేందుకు బాటలు వేసింది. ఆ కాలంలో మొత్తం జిల్లాలో అలాంటి పోరాటాల్లో పాల్గొన్న ఏకైక ముస్లిం మహిళ ఆమే.ముస్లింల కథలు‘నేను రాసే వరకు ముస్లింల జీవితం అంతగా కన్నడలో రాలేదు. హిందూ రచయితల కథల్లో ముస్లింల పాత్రలు బ్లాక్ అండ్ వైట్‌గా ఉండేవి. బండాయ సాహిత్య ఉద్యమ ప్రభావంతో ఎవరి జీవితం వారు రాయాలనే ప్రయత్నం మొదలయ్యాక మా జీవితాలను రాయడం మొదలెట్టాను’ అంటారు బాను ముష్టాక్. ఆమె ఇప్పటికి ఆరు కథాసంపుటాలు, ఒక నవల, ఒక వ్యాససంపుటి, కవిత్వ సంపుటి ప్రచురించారు. బాను ముస్తాక్ రాసిన ‘కరి నాగరగళు’ అనే కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గిరీశ్ కాసరవెల్లి 2005లో ‘హసీనా’ అనే కన్నడ చిత్రం తీశారు. అందులో నటి తార ప్రధాన పాత్ర పోషించారు. అందులోని నటనకుగానూ ఆమెకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. బాను ముస్తాక్ కన్నడతోపాటు హిందీ, దక్కనీ ఉర్దూ, ఇంగ్లిష్ మాట్లాడగలరు. ఆమె రచనలు ఉర్దూ, హిందీ, తమిళం, మలయాళ, పంజాబీ, ఇంగ్లిషు భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇస్లాం ప్రకారం స్త్రీలకు మసీదుల్లో ప్రవేశం ఉందని, కేవలం మగవారే వారిని ఆపుతున్నారు అని ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారి, తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఆమెను, ఆమె కుటుంబాన్ని మూడు నెలలపాటు సామాజికంగా బహిష్కరించారు. కర్ణాటకలో ముస్లిం బాలికలు స్కూళ్లలో హిజాబ్ వేసుకునే హక్కు కోసం పోరాడిన సమయంలో బాను ముస్తాక్ వారికి మద్దతుగా నిలిచారు. 1990లో లా చదివిన బాను ముస్తాక్, లాయర్‌గా స్త్రీల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. ఇప్పటివరకూ వేలాది కేసులపై ఆమె వాదించారు. బాను ముష్టాక్‌కు బుకర్ప్రైజ్సీనియర్ కన్నడ రచయిత్రి బాను ముష్టాక్ (75)కు సాహిత్యంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్’ను 2025 సంవత్సరానికి గాను ప్రకటించారు. మంగళవారం రాత్రి లండన్‌లో జరిగిన బహుమతి ప్రదాన వేడుకలో ఆమె రాసిన ‘హార్ట్ ల్యాంప్’ అనే కథా సంపుటికి ఈ బహుమతి దక్కింది. కన్నడంలో ఆమె రాసిన కథల నుంచి ఎంచిన 12 కథలను దీపా బస్తీ ఇంగ్లిషులో అనువాదం చేయగా ఈ బహుమతి దక్కింది. 50 వేల పౌండ్లు (57 లక్షల రూపాయలు) నగదు అందించారు. ఈ మొత్తాన్ని రచయిత్రి, అనువాదకురాలు చెరిసగం పంచుకోవాలి. బ్రిటిష్ రచయిత మేక్స్ పోర్టర్ న్యాయ నిర్ణేతల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. ‘హార్ట్ ల్యాంప్లోని కథలు ఇంగ్లిష్ పాఠకులకు కొత్త ప్రపంచాన్ని చూపుతాయి’ అని ఆయన అన్నారు. 12 దేశాలకు చెందిన 13 మంది రచయితలు ఈ అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో ఎంపిక కాగా ఆ తర్వాత ఆరుమంది రచయితలతో షార్ట్ లిస్ట్‌ను అనౌన్స్ చేశారు. బాను ముష్టాక్ పుస్తకం షార్ట్ లిస్ట్‌లో రావడమే ఘనత అనుకుంటే ఏకంగా బహుమతిని గెలవడంతో భారతీయ సాహిత్యాభిమానులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ‘ఇది కన్నడ భాషకు దక్కిన గౌరవం’ అని కొనియాడారు. అలాగే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తదితరులు అభినందనలు తెలిపారు. భాను ముష్టాక్ స్వస్థలం హాసన్. ఆమె రచయితగానే గాక అడ్వకేట్‌గా, సామాజిక కార్యకర్తగా కూడా కృషి చేస్తున్నారు. కాగా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌కు అర్హత పొందాలంటే ఆ పుస్తకం ఇంగ్లాండ్‌లో ప్రచురితం అయి ఉండాలి. 2022లో గీతాంజలి శ్రీ రాసిన ‘రేత్ కీ సమాధి’ ఇంగ్లిష్‌లో ‘టూంబ్ ఆఫ్ శాండ్’గా అనువాదమై బుకర్‌ప్రైజ్ గెలుచుకోవడం పాఠకులకు విదితమే. -
ప్రముఖ రచయిత కన్నుమూత
బెంగళూరు: సాహితీ వర్గాలలో చిమూగా సుపరిచితులైన ప్రముఖ పండితుడు, పరిశోధకుడు, రచయిత డాక్టర్ చిదానంద మూర్తి శనివారం తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. వయోభారం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో కొద్దికాలంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిదానంద మూర్తి ఉదయం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నడ శాసనాలు, ప్రాచీనత్వం విషయంలో చిదానంద మూర్తి ఎంతో కృషి చేశారు. 2008లో భారత ప్రభుత్వం కన్నడ భాషకు ప్రాచీన హోదా ఇవ్వడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. హిందూ- రైట్ వింగ్ ఛాంపియన్‌గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. హంపి కళాఖండాలను కాపాడాలంటూ ఆయన చేపట్టిన ప్రచారం విస్తృత ప్రాచుర్యం పొందింది. మూర్తి డిమాండ్ మేరకే హైదరాబాద్ కర్ణాటక పేరును కల్యాణ్ కర్ణాటకగా ముఖ్యమంత్రి యడియూరప్ప ఇటీవల మార్చారు. ముఖ్యమంత్రి సంతాపం చిదానంద మూర్తి మరణం పట్ల ముఖ్యమంత్రి యడియూరప్ప సంతాపం ప్రకటించారు. మేధావిగా, పరిశోధకుడుగా, చరిత్రకారుడుగా కన్నడ భాషా పరిరక్షణకు చిదానంద మూర్తి విశేష సేవలందించారని కొనియాడారు. చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన లేని లోటు భర్తీ కాదని అన్నారు. హంపి కట్టడం పరిరక్షణలో ఆయన పాత్ర, కన్నడ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ (విశిష్ట భాష) గుర్తింపు రావడానికి చేసిన కృషి బహుదా ప్రశంసనీయమని ఆయన గుర్తుచేసుకున్నారు. -
స్వేచ్ఛా భారత్ దిశగా కదలండి
సాక్షి, హైదరాబాద్: స్వేచ్ఛా భారత్ దిశగా సాహితీవేత్తలు, కవులు, రచయితలు ముందడుగు వేయాలని ప్రముఖ కన్నడ రచయిత్రి, సీనియర్ జర్నలిస్టు ప్రతిభానందకుమార్ పిలుపునిచ్చారు. భిన్న ఆలోచనలను, విభిన్న సాహిత్యాలను సమాజం ప్రతిబింబించాలని, భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించే భావప్రకటనా స్వేచ్ఛను ఎప్పటికీ కోల్పోవద్దని ఆమె సూచించారు. శుక్రవారం బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘కన్నడ సాహిత్యం అప్పుడు–ఇప్పుడు’అనే అంశంపై ప్రతిభా నందకుమార్ కీలక ఉపన్యాసం చేశారు. సామాజిక పరిణామాలకు, మార్పులకు అనుగుణంగా కన్నడ సాహిత్యం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉందని, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవడంలో కన్నడ సాహితీవేత్తలు మొదటి నుంచి ముందంజలో ఉన్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు సమాజాన్ని ప్రతిబింబిస్తోన్న సోషల్ మీడియా కంటే బలమైన సాహిత్యాన్ని తాము దశాబ్దాల క్రితమే రాసినట్లు పేర్కొన్నారు. కుచించుకుపోతున్న ప్రజాస్వామిక వాతావరణం పద్మావత్ వంటి సినిమాను వ్యతిరేకించడం, అందులోని కథాంశాన్ని జీర్ణించుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి అసహనం తాము ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వాతావరణం రోజురోజుకూ కుచించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలు, వివక్ష కొనసాగుతున్న రోజుల్లోనే తాము స్వేచ్ఛగా సాహితీ సృజన చేశామని, 35 ఏళ్ల క్రితమే తాను ఎరోటిక్ పొయెట్రీ రాసినట్లు ఆమె గుర్తుచేశారు. కొంతమంది జ్యోతిష్య పండితులు మహిళల పట్ల చాలా చులకనగా మాట్లాడుతున్నారని, ఫలానా రాశి మహిళలు అత్యాచారాలకు గురయ్యే అవకాశం ఉందంటూ చేస్తోన్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిపై తాను ‘ఆగ్రహం’అనే కవిత రాసినట్లు గుర్తు చేశారు. సృజనాత్మక రచనలకు సోషల్‌మీడియా సరికొత్త వేదికగా మారుతోందని, స్వేచ్ఛాయుత వాతావరణం కోసం, వివక్ష, పురుషాధిపత్యం లేని సమాజం కోసం నేటితరం రచయితలు కృషి చేయాలని కోరారు. భిన్న సంస్కృతులకు నిలయం.. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులకు, కళలకు హైదరాబాద్ నిలయమని అన్నారు. మగ్ధూం మొహియుద్దీన్, సరోజినీనాయుడు, డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటి ఎందరో మహానుభావులు హైదరాబాద్ నుంచి తమ కలాన్ని, గళాన్ని ప్రపంచానికి వినిపించారని చెప్పారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అంతర్జాతీయ సాహిత్యంతో పాటు, తెలంగాణ సాహిత్య సంస్కృతులకు వేదిక కావాలని ఆకాంక్షించారు. కొత్తతరం రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. స్పెయిన్ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ ఎడ్యురో సాంచెజ్ మొరాకో మాట్లాడుతూ.. స్పానిష్ భాషకు తెలుగు భాషకు పోలికలున్నాయని, తెలుగులో ఉన్నట్లుగానే స్పానిష్లోనూ మాండలికాలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రెండు ప్రాంతాల మధ్య ఒక చక్కటి సాంస్కృతిక వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ప్రఖ్యాత నర్తకి సోనాల్‌మాన్‌సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో మరెక్కడా లేని వైవిధ్యభరిత సంస్కృతి, అత్యున్నత సంప్రదాయాలు, విలువలు ఒక్క భారత్‌లోనే ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం గొప్పదనమని చెప్పారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభోత్సవ సభలో కన్నడంలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. చర్చాగోష్టులు.. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం స్పెయిన్ మహిళా రచయిత్రుల సాహిత్యంపైనా, పలువురు రచయితలు రాసిన పుస్తకాలపైనా చర్చాగోష్టులు నిర్వహించారు. కర్ణాటకకు చెందిన దళిత సామాజిక కార్యకర్త సరస్వతి వంట చేస్తూ చెప్పిన రామాయణం, దక్కనీ ఉర్దూలో సాగిన మిజాహియా ముషాయిరా తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 70 మంది కళాకారులు నిర్వహించిన కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్, సినీ దర్శకుడు డాక్టర్ కిన్నెరమూర్తి తదితరులు పాల్గొన్నారు. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎస్పీ సింగ్. చిత్రంలో బుర్రా వెంకటేశం -
పద్మశ్రీ అందుకున్న డాక్టర్ ఎస్ఎల్.భైరప్ప
డాక్టర్ ఎస్ఎల్.భైరప్పను పద్మశ్రీ అవార్డుతో సత్కరిస్తున్న సుభాష్ చంద్ర మైసూరు: సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత, ప్రముఖ కన్నడ సాహితీవేత్త డాక్టర్ ఎస్ఎల్.భైరప్పకు శుక్రవారం పద్మశ్రీ అవార్డును అందజేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు ఎస్.ఎల్.భైరప్పకూడా ఎంపిక చేసారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్.ఎల్.భైరప్పను పద్మశ్రీ అవార్డుతో సన్మానించాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో ఢిల్లీ వెల్లడం కుదరలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు శుక్రవారం కర్ణాటక అసిస్టెంట్ ఛీఫ్ సెక్రటరీ సుభాష్ చంద్ర మైసూరులోని ఎస్.ఎల్.భైరప్ప నివాసానికి చే రుకొని పద్మశ్రీ అవార్డును ఆయనకు అందచేసి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అభినవ్ ఖరే,అసిస్టెంట్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్, నగర డిప్యూటీ పోలీస్కమీషనర్ శేఖర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
కన్నడ రచయిత్రికి బెదిరింపు
బెంగళూరు/పట్నా: మత విద్వేష సంఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండగానే మరోవైపు ఓ కన్నడ రచయిత్రికి బెదిరింపులు వచ్చాయి. గొడ్డు మాంసం తినడాన్ని సమర్థిస్తూ, హిందూ ఆచారాలను ప్రశ్నించడంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయని బెంగళూరులో పోలీసు డిప్యూటీ కమిషనర్ బీఎస్ లోకేశ్‌కుమార్ తెలిపారు. మధుసూదన్ గౌడ అనే వ్యక్తి తనను బెదిరించారంటూ చేతనా తీర్థహళ్లి అనే రచయిత్రి హనుమంతనగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. గొడ్డుమాంసం తినడాన్ని సమర్థిస్తూ చేతన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. చేతన హిందూమత ఆచారాలను ప్రశ్నిస్తూ పలు వ్యాసాలను రాశారు. బీఫ్ వినియోగానికి అనుకూలంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. మత విద్వేషాలపై గుల్జార్ ఆందోళన మత విద్వేషాలు పెరిగిపోవడంపై ప్రముఖ కవి, పాటల రచయిత గుల్జార్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవలి హింసాత్మక సంఘటలను ఖండించారు. మునుపెన్నడూ ఇటువంటి సంఘటనలను చూడలేదని పేర్కొన్నారు. మతవిద్వేష సంఘటనలను నిరసిస్తూ పలువురు రచయితలు తమ సాహిత్య ఆకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని ఆయన గట్టిగా సమర్థించారు. రచయితలు తమ నిరసనను తెలియజేయడానికే అవార్డులను వెనక్కు ఇస్తున్నారన్నారు. హత్యలు, హింసాత్మక సంఘటనలకు సాహిత్య అకాడమీకి సంబంధం లేకపోయినప్పటికీ, ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయడానికే వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని గుల్జార్ అభిప్రాయపడ్డారు. -
'ఇప్పుడు చావు నీ వంతు.. రోజులు లెక్కపెట్టుకో'
బెంగళూరు: మరో కర్ణాటక రచయిత బెదిరింపు లేఖ వచ్చింది. ఇప్పటికే ప్రముఖ స్కాలర్ తత్వవేత్త అయిన ఎంఎం కాల్బుర్గి హత్య నుంచి అక్కడి ప్రజానీకం తేరుకోక ముందే అదే స్థాయికి చెందిన వ్యక్తి ప్రముఖ రచయిత కేఎస్ భగవాన్‌కు ఓ బెదిరింపు లేఖ అందింది. 'ఆ లేఖ వచ్చిన మధ్యాహ్న సమయంలో నేను ఇంట్లో లేను. నా కుటుంబ సభ్యులు దానిని తీసుకున్నారు. ఆంగ్లంలో ఉన్న ఆ లేఖ చదివిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇప్పుడది వారివద్దే ఉంది' భగవాన్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మైసూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భగవద్గీతను చులకన చేసే వ్యాఖ్యాలు భగవాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ వర్గం నుంచి ఆయనకు బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలిసింది. ఇంతకీ లేఖలో సారాంశం ఏమిటంటే.. 'ఇప్పటికే ముగ్గురిని హత్య చేశాం. ఇప్పుడికి నీవంతే. ఏ పోలీసులు నిన్ను రక్షించలేదు. నీ గడువు ఇప్పటికే మించిపోయింది. ఇక రోజులు లెక్కపెట్టుకో' అని తీవ్ర వ్యాఖ్యలతో ఉంది. అయితే, ఇలాంటివాటికి తాను భయపడేది లేదని, తన గురించి పూర్తిగా తెలియని వారే ఈ లేఖ రాసి ఉంటారని అన్నారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి రచనలు చేసినా దాని వెనుక ఓ పరిశోధన, అధ్యయనం ఉందని చెప్పారు. -
ప్రముఖ రచయిత అనంతమూర్తి కన్నుమూత!
బెంగళూరు: ప్రముఖ కన్నడ రచయిత అనంతమూర్తి శుక్రవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పది రోజల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. జ్వరం, ఇన్ ఫెక్షన్ కారణంగా అనంతమూర్తి ఆరోగ్యపరిస్థితి క్షీణించిందని మణిపాల్ ఆస్పత్రికి చెందిన సీనియర్ వైద్యుడు మీడియాకు తెలిపారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. సాహిత్య రంగానికి చేసిన సేవలకు 1998లో పద్మవిభూషణ్ అవార్డు, 1994లోజ్ఞానపీఠ్ అవార్డును అనంతమూర్తి అందుకున్నారు.