స్త్రీ హృదయ దీపానికి మరింత కాంతి | India Banu Mushtaq makes history at the International Booker Prize | Sakshi
Sakshi News home page

స్త్రీ హృదయ దీపానికి మరింత కాంతి

May 22 2025 12:40 AM | Updated on May 22 2025 12:40 AM

India Banu Mushtaq makes history at the International Booker Prize

న్యూస్‌మేకర్‌

మైనారిటీ సమాజంలోని స్త్రీల జీవితాన్ని, సంఘర్షణను కథలుగా రాసిన కన్నడ రచయిత్రి బాను ముష్టాక్‌కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్‌ బుకర్‌ప్రైజ్‌ మంగళవారం ప్రకటించారు. 50 వేల పౌండ్లు బహుమతి. కర్నాటక రాష్ట్రంలో సామాజిక కార్యకర్తగా, అడ్వకేట్‌గా, రచయిత్రిగా గుర్తింపు పొంది నేడు తొలిసారి దక్షిణాది భాషకు బుకర్‌ ప్రైజ్‌ తెచ్చి పెట్టిన బాను ముష్టాక్‌ పరిచయం.

‘మీరు రచయిత కావడానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు?’ అనే ప్రశ్నకు ‘ప్రజలు’ అని సమాధానం చెప్తారు బాను ముష్టాక్‌. ‘వారిలోని మంచి, చెడు, టక్కరితనం, నిస్సహాయత, ఓర్పు, ప్రతి మనిషికీ ఉండే కథ... ఇవే నన్ను రచయిత్రిని చేశాయి’ అంటారామె.

75 ఏళ్ల బాను ముష్టాక్‌ భారతీయ సాహిత్యం, అందునా దక్షిణాది సాహిత్యం, ప్రత్యేకం కన్నడ సాహిత్యం గర్వపడేలా ‘ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ 2025’ను మంగళవారం రాత్రి గెలుచుకున్నారు. ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేట్‌ అయిన ఆమె 12 కథల పుస్తకం ‘హార్ట్‌ ల్యాంప్‌’ ఈ ప్రతిష్టాత్మక బహుమతి గెలుచుకుంది. దక్షిణాది భాషలకు బుకర్‌ ప్రైజ్‌ దక్కడం ఇదే మొదటిసారి. 

జర్నలిస్టుగా, అడ్వకేట్‌గా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన బాను ముష్టాక్‌ 1990 నుంచి ముస్లిం స్త్రీల జీవన గాథలను కథనం చేస్తూ వచ్చారు. ఆమె రాసిన మొత్తం 50 కథల నుంచి 12 కథలు ఎంచి దీపా బస్తీ అనువాదం చేయగా ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్‌కు చెందిన ‘అండ్‌ అదర్‌ స్టోరీస్‌’ అనే చిన్న పబ్లిషింగ్‌ సంస్థ ప్రచురించింది.

బాను ముష్టాక్‌ ఎవరు?
బాను ముష్టాక్‌  కర్ణాటక రాష్ట్రం హాసన్‌లో జన్మించారు. తండ్రి సీనియర్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌. ఆమెను చిన్నప్పుడు ఉర్దూ స్కూల్లో వేయగా, అక్కడి వాతావరణం సరిపడక ఎనిమిదేళ్ల వయసులో శివమొగ్గలోని కన్నడ  స్కూల్లో చేరారు. ఆరు నెలల్లో కన్నడ నేర్చుకుంటేనే స్కూల్లో ఉంచుతాం లేకుంటే పంపించేస్తాం అనంటే కొద్ది రోజుల్లోనే కన్నడ భాషను నేర్చుకుని ఆశ్చర్యపరిచారు. దీంతో ఒక్క ఏడాదిలోనే ఆమెను ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతికి పంపించారు. ‘నేను మా ఇంటికి పెద్ద కూతుర్ని. మా నాన్న తన పిల్లలు డబుల్‌ డిగ్రీలు చేయాలని పట్టుదలగా ఉండేవాడు’ అంటుంది బాను ముష్టాక్‌.

ఆది నుంచి సవాళ్లే
బాను ముష్టాక్‌కు ముందునుంచి తిరగబడే స్వభావం ఉంది. మగపిల్లలతో కలిసి సైకిల్‌ నేర్చుకుంటున్న ఆమెను ముస్లిం పెద్దలు ఆపి ఇలా సైకిల్‌ తొక్కకూడదని హెచ్చరించారు. అయినా ఆమె లెక్క చేయలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు మాత్రమే జరిగే కాలంలో ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. 1974లో కట్నం ప్రస్తావన లేకుండా ఆమె పెళ్లి జరిగింది. 

అయితే వాచ్‌ రిపేరర్‌ అయిన భర్తకు సరైన సంపాదన లేకపోవడం, అత్తింటివారి నుంచి ఇబ్బందులు, ఉమ్మడి సంసారం కలిగిన ఇంటిలో వారితో కలిసి ఉండటం.. ఇవన్నీ ఆమెను మానసికంగా బలహీనురాలిని చేశాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నారు. అగ్గిపుల్ల వెలిగించే సమయంలో భర్త ఆపారు. చివరకు ఆమె షరతులకు భర్త ఒప్పుకోవడంతో ఆత్మహత్య, విడాకుల ఆలోచనలు మానుకున్నారు. అప్పటినుంచి ఆమెకు కాస్త స్వేచ్ఛ లభించింది.
పత్రికా రచయితగా
‘ముస్లిం మహిళలు సినిమాలు చూడటం నేరమా?’ అనే అంశంపై ఆమె రాసిన వ్యాసం కన్నడ పత్రిక ‘లంకేశ్‌ పత్రికె’లో ప్రచురితమై విశేషమైన పేరు తెచ్చింది. దాంతో అదే పత్రికలో రిపోర్టరుగా చేరారు. అనంతరం కొన్ని నెలలపాటు బెంగళూరు ఆలిండియా రేడియోలో పని చేశారు. 1978లో తండ్రి ప్రోద్బలంతో మీద ఆమె మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థినిగా పోటీ చేశారు. ఎన్నికల గుర్తు ‘కుట్టు మిషన్‌’. తండ్రితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఆమె ప్రచారం చేశారు. అయితే ఇలా చేయడం స్థానిక ముస్లిం పెద్దలకు నచ్చలేదు. 

ఓటు వేయొద్దని వారు వ్యతిరేక ప్రచారం చేశారు. అలా ఒక్క ఓటు తేడాతో ఆమె ఓడిపోయారు. మొదటి ప్రయత్నంలో ఓడిపోయినా, ఆ తర్వాత రెండుసార్లు హాసన్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు. బాను ముస్తాక్‌ రచయితగానే కాక, సామాజిక కార్యకర్తగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరికీ సమానహక్కులు దక్కాలని, సామాజిక న్యాయం అందాలని పోరాడారు. తొలుత దళిత హక్కుల ఉద్యమ పరిచయంతో మొదలైన పోరాట జీవితం ఆ తర్వాత అనేక అంశాలపై పోరాడేందుకు బాటలు వేసింది. ఆ కాలంలో మొత్తం జిల్లాలో అలాంటి పోరాటాల్లో పాల్గొన్న ఏకైక ముస్లిం మహిళ ఆమే.

ముస్లింల కథలు
‘నేను రాసే వరకు ముస్లింల జీవితం అంతగా కన్నడలో రాలేదు. హిందూ రచయితల కథల్లో ముస్లింల పాత్రలు బ్లాక్‌ అండ్‌ వైట్‌గా ఉండేవి. బండాయ సాహిత్య ఉద్యమ ప్రభావంతో ఎవరి జీవితం వారు రాయాలనే ప్రయత్నం మొదలయ్యాక మా జీవితాలను రాయడం మొదలెట్టాను’ అంటారు బాను ముష్టాక్‌. ఆమె ఇప్పటికి ఆరు కథాసంపుటాలు, ఒక నవల, ఒక వ్యాససంపుటి, కవిత్వ సంపుటి ప్రచురించారు. బాను ముస్తాక్‌ రాసిన ‘కరి నాగరగళు’ అనే కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గిరీశ్‌ కాసరవెల్లి 2005లో ‘హసీనా’ అనే కన్నడ చిత్రం తీశారు. అందులో నటి తార ప్రధాన పాత్ర పోషించారు. అందులోని నటనకుగానూ ఆమెకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. 

బాను ముస్తాక్‌ కన్నడతోపాటు హిందీ, దక్కనీ ఉర్దూ, ఇంగ్లిష్‌ మాట్లాడగలరు. ఆమె రచనలు ఉర్దూ, హిందీ, తమిళం, మలయాళ, పంజాబీ, ఇంగ్లిషు భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇస్లాం ప్రకారం స్త్రీలకు మసీదుల్లో ప్రవేశం ఉందని, కేవలం మగవారే వారిని ఆపుతున్నారు అని ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారి, తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఆమెను, ఆమె కుటుంబాన్ని మూడు నెలలపాటు సామాజికంగా బహిష్కరించారు. కర్ణాటకలో ముస్లిం బాలికలు స్కూళ్లలో హిజాబ్‌ వేసుకునే హక్కు కోసం పోరాడిన సమయంలో బాను ముస్తాక్‌ వారికి మద్దతుగా నిలిచారు. 1990లో లా చదివిన బాను ముస్తాక్, లాయర్‌గా స్త్రీల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. ఇప్పటివరకూ వేలాది కేసులపై ఆమె వాదించారు. 
 

బాను ముష్టాక్‌కు బుకర్‌ప్రైజ్‌
సీనియర్‌ కన్నడ రచయిత్రి బాను ముష్టాక్‌ (75)కు సాహిత్యంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌’ను 2025 సంవత్సరానికి గాను ప్రకటించారు. మంగళవారం రాత్రి లండన్‌లో జరిగిన బహుమతి ప్రదాన వేడుకలో ఆమె రాసిన ‘హార్ట్‌ ల్యాంప్‌’ అనే కథా సంపుటికి ఈ బహుమతి దక్కింది. కన్నడంలో ఆమె రాసిన కథల నుంచి ఎంచిన 12 కథలను దీపా బస్తీ ఇంగ్లిషులో అనువాదం చేయగా ఈ బహుమతి దక్కింది. 50 వేల పౌండ్లు (57 లక్షల రూపాయలు) నగదు అందించారు. ఈ మొత్తాన్ని రచయిత్రి, అనువాదకురాలు చెరిసగం పంచుకోవాలి. 

బ్రిటిష్‌ రచయిత మేక్స్‌ పోర్టర్‌ న్యాయ నిర్ణేతల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. ‘హార్ట్‌ ల్యాంప్‌లోని కథలు ఇంగ్లిష్‌ పాఠకులకు కొత్త ప్రపంచాన్ని చూపుతాయి’ అని ఆయన అన్నారు. 12 దేశాలకు చెందిన 13 మంది రచయితలు ఈ అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో ఎంపిక కాగా ఆ తర్వాత ఆరుమంది రచయితలతో షార్ట్‌ లిస్ట్‌ను అనౌన్స్‌ చేశారు. బాను ముష్టాక్‌ పుస్తకం షార్ట్‌ లిస్ట్‌లో రావడమే ఘనత అనుకుంటే ఏకంగా బహుమతిని గెలవడంతో భారతీయ సాహిత్యాభిమానులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. 

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ‘ఇది కన్నడ భాషకు దక్కిన గౌరవం’ అని కొనియాడారు. అలాగే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తదితరులు అభినందనలు తెలిపారు. భాను ముష్టాక్‌ స్వస్థలం హాసన్‌. ఆమె రచయితగానే గాక అడ్వకేట్‌గా, సామాజిక కార్యకర్తగా కూడా కృషి చేస్తున్నారు. కాగా ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌కు అర్హత పొందాలంటే ఆ పుస్తకం ఇంగ్లాండ్‌లో ప్రచురితం అయి ఉండాలి. 2022లో గీతాంజలి శ్రీ రాసిన ‘రేత్‌ కీ సమాధి’ ఇంగ్లిష్‌లో ‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’గా అనువాదమై బుకర్‌ప్రైజ్‌ గెలుచుకోవడం పాఠకులకు విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement