పట్టుబట్టాడు, ఐఎఫ్‌ఎస్‌ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్‌ సక్సెస్‌ స్టోరీ | UPSC IFS Dixit secured 30th rank in the All India Open category | Sakshi
Sakshi News home page

పట్టుబట్టాడు, ఐఎఫ్‌ఎస్‌ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్‌ సక్సెస్‌ స్టోరీ

May 21 2025 2:18 PM | Updated on May 21 2025 4:08 PM

UPSC IFS Dixit secured 30th rank in the All India Open category

యూపీఎస్సీ పరీక్షలో సత్తా చాటిన అమరాపురం యువకుడు దీక్షిత్‌ 

ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా 30వ ర్యాంకు కైవసం

మధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికైనాడు ఆంధ్రప్రదేశ్‌, శ్రీసత్యసాయి జిల్లాలోని అమరాపురానికి చెందిన యువకుడు.

అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్‌ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు.

మధ్య తరగతి కుటుంబం..
పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్‌ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్‌ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్‌ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్‌ ఆ తర్వాత ఇంటర్‌ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు.

దీక్షిత్‌ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్‌ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్‌ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్‌ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు.

ఇంట్లో ఉంటూ చదువుకుని..
ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో దీక్షిత్‌కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో.. ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్‌ అయ్యి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్‌ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు.

ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్‌ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్‌ లుక్‌

కష్టాన్ని మరిపించిన ఫలితం..
యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్‌ ఏకంగా ఆల్‌ ఇండియా ఓపెన్‌ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్‌ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు.

అమ్మానాన్నకు అంకితం
ఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా.  – దీక్షిత్‌

చదవండి: డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement