breaking news
IFS results
-
ఐఎఫ్ఎస్లో సత్తా చాటిన తెలంగాణ యువకులు
సాక్షి, పెద్దపల్లి: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)–2024 పరీక్ష తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రాత పరీక్షను గత ఏడాది నవంబర్, డిసెంబర్లో నిర్వహించగా, ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటి ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం ప్రకటించగా, దేశవ్యాప్తంగా మొత్తం 143 మంది విజేతలుగా నిలిచారు. ఈ జాబితాలో తెలంగాణ యువకులు చోటుసాధించారు.గోదావరిఖని (godavarikhani)కి చెందిన చెరుకు అవినాష్‌రెడ్డి ఆలిండియా 40వ ర్యాంకు సొంతం చేసుకుని సత్తా చాటాడు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లిన అతడు.. లక్ష్యాన్ని వీడకుండా ప్రయత్నంచి ఇప్పుడు విజయం సాధించాడు. అవినాష్‌రెడ్డి తండ్రి చెరుకు నర్సింహారెడ్డి సింగరేణి ఓసీపీ–3లో ఫిట్టర్‌గా పనిచేస్తున్నారు. తల్లి రాజమణి గృహిణి. ఆయన సోదరుడు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. సివిల్స్ సాధించడంలో అమ్మ, నాన్న, అన్న ప్రోత్సాహం ఎంతో ఉందని అవినాష్ తెలిపాడు.బీటెక్ (BTech) పూర్తికాగానే హైదరాబాద్‌లో రూమ్ తీసుకుని సొంతంగానే ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు అవినాష్ తెలిపారు. ఎన్సీఈఆర్టీ బుక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు కరెంట్ అఫైర్స్ కోసం వార్తాపత్రికలు (News Papers) చదివినట్లు చెప్పారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో 61వ ర్యాంకు సాధించానన్నారు. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే అనుకున్న గోల్ సాధించవచ్చని చెప్పాడు. తరుణ్‌తేజకు 53వ ర్యాంక్హనుమకొండ జిల్లా కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన అట్ల తరుణ్‌తేజ కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. ఐఎఫ్ఎస్ 2024 ఫలితాల్లో (IFS 2024 Results) అతడు అఖిల భారత స్థాయిలో 53వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన సివిల్స్ పరీక్షల్లో ఆలిండియా 770 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచారు.ఫాతిమానగర్ సెయింట్ గ్యాబ్రియల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన తరుణ్‌తేజ ఐఐటీ బాంబే (IIT Bombay) నుంచి బీటెక్ సీఎస్సీ పూర్తి చేశాడు. గణితం ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈసందర్భంగా మంగళవారం తరుణ్‌తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఐఏఎస్ (IAS) సాధించడమే తన అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపాడు.చదవండి: పట్టుబట్టాడు.. ఐఎఫ్ఎస్ కొట్టాడు: రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీ -
పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీ
మధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైనాడు ఆంధ్రప్రదేశ్, శ్రీసత్యసాయి జిల్లాలోని అమరాపురానికి చెందిన యువకుడు.అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు.మధ్య తరగతి కుటుంబం..పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్ ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు.దీక్షిత్ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు.ఇంట్లో ఉంటూ చదువుకుని..ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో దీక్షిత్‌కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో.. ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్‌ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు.ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్కష్టాన్ని మరిపించిన ఫలితం..యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్ ఏకంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్‌ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు.అమ్మానాన్నకు అంకితంఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా. – దీక్షిత్చదవండి: డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..! -
ఐఎఫ్ఎస్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. అంతిమంగా 110 మంది అభ్యర్థులు విజయం సాధించినట్లు తెలిపారు. ఇందులో 48 మంది జనరల్ కేటగిరీ, 37 మంది ఓబీసీ, 17 మంది ఎస్సీ, 8మంది ఎస్టీ కేటగిరీకి చెందిన వారని యూపీఎస్సీ వివరించింది. గత ఏడాది నవంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫైనల్ ఇంటర్వ్యూలు చేపట్టింది. అంతిమ ఫలితాలను యూపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది.