
తల్లిదండ్రులతో చెరుకు అవినాష్‌రెడ్డి
సాక్షి, పెద్దపల్లి: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)–2024 పరీక్ష తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రాత పరీక్షను గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించగా, ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటి ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం ప్రకటించగా, దేశవ్యాప్తంగా మొత్తం 143 మంది విజేతలుగా నిలిచారు. ఈ జాబితాలో తెలంగాణ యువకులు చోటుసాధించారు.
గోదావరిఖని (godavarikhani)కి చెందిన చెరుకు అవినాష్‌రెడ్డి ఆలిండియా 40వ ర్యాంకు సొంతం చేసుకుని సత్తా చాటాడు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లిన అతడు.. లక్ష్యాన్ని వీడకుండా ప్రయత్నంచి ఇప్పుడు విజయం సాధించాడు. అవినాష్‌రెడ్డి తండ్రి చెరుకు నర్సింహారెడ్డి సింగరేణి ఓసీపీ–3లో ఫిట్టర్‌గా పనిచేస్తున్నారు. తల్లి రాజమణి గృహిణి. ఆయన సోదరుడు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. సివిల్స్ సాధించడంలో అమ్మ, నాన్న, అన్న ప్రోత్సాహం ఎంతో ఉందని అవినాష్ తెలిపాడు.
బీటెక్ (BTech) పూర్తికాగానే హైదరాబాద్‌లో రూమ్ తీసుకుని సొంతంగానే ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు అవినాష్ తెలిపారు. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు కరెంట్ అఫైర్స్ కోసం వార్తాపత్రికలు (News Papers) చదివినట్లు చెప్పారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో 61వ ర్యాంకు సాధించానన్నారు. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే అనుకున్న గోల్ సాధించవచ్చని చెప్పాడు.
తరుణ్‌తేజకు 53వ ర్యాంక్
హనుమకొండ జిల్లా కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన అట్ల తరుణ్‌తేజ కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. ఐఎఫ్ఎస్ 2024 ఫలితాల్లో (IFS 2024 Results) అతడు అఖిల భారత స్థాయిలో 53వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన సివిల్స్ పరీక్షల్లో ఆలిండియా 770 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచారు.
ఫాతిమానగర్ సెయింట్ గ్యాబ్రియల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన తరుణ్‌తేజ ఐఐటీ బాంబే (IIT Bombay) నుంచి బీటెక్ సీఎస్సీ పూర్తి చేశాడు. గణితం ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈసందర్భంగా మంగళవారం తరుణ్‌తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఐఏఎస్ (IAS) సాధించడమే తన అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపాడు.
చదవండి: పట్టుబట్టాడు.. ఐఎఫ్ఎస్ కొట్టాడు: రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీ