● బైక్ ప్రమాదంలో గాయాలు
● వాహన రద్దీలో అంబులెన్స్ ఆలస్యం
యశవంతపుర: రోడ్డు డివైడర్‌ను బైకు ఢీకొని టెక్కీ చనిపోయిన ఘటన యలహంక పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. అట్టూరు లేఔట్‌లో నివాసం ఉంటున్న చింతామణివాసి ఆనంద్ (35) మృతుడు. వివరాలు.. మాన్యత టెక్‌పార్క్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న ఆనంద్ బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో విధులు ముగించుకొని బైకులో ఇంటికి బయల్దేరాడు. న్యాయ లేఔట్ సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కిందపడిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితున్ని స్థానికులు అంబులెన్సును పిలిపించి ఆస్పత్రికి పంపించారు. అయితే దారిలో రైల్వే అండర్‌పాస్ కింద ట్రాఫిక్‌లో అంబులెన్స్ నిలిచిపోయింది. అతనిని మరో కారులో తరలిస్తుండగా కొంతసేపటికే చనిపోయాడు. సకాలంలో అంబులెన్స్ ఆస్పత్రికి వెళ్లి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు తెలిపారు. మెట్రో రైలు మార్గం పనులు జరుగుతున్నందున యలహంక పరిధిలో ట్రాఫిక్ సమస్య అధికమైంది. బెంగళూరు సిటీలోకి వెళ్ళే ఒక మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. దీంతో అత్యవసర వేళల్లో ఇబ్బందిగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
బాలిక హత్య
యశవంతపుర: బాలికను గొంతుపిసికి హత్య చేసిన ఘటన బెంగళూరు కగ్గలిపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. బోళారెవాసి కవన (15), గతంలో తల్లి చనిపోయింది. తండ్రి దూరంగా ఉంటాడు. కవన సావిత్రమ్మ అనే బంధువు ఇంట్లో ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం మరుగుదొడ్డికి బయటకు వెళ్లిన కవన సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. సావిత్రమ్మ, స్థానికులు చుట్టుపక్కల గాలించగా బాలిక శవం కనిపించింది. ఎవరో దుండగులు గొంతు నులిమి బాలికను హత్య చేసినట్లు గుర్తులున్నాయి. కగ్గలిపుర పోలీసులు హంతకుల కోసం గాలింపు చేపట్టారు.
సఫారీలు వద్దే వద్దు
● రైతు సంఘాల డిమాండ్
మైసూరు: నాగరహొళె, బండీపుర అటవీ ప్రాంతాల్లో మళ్లీ సఫారీ టూర్లను ప్రారంభించడంపై రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. హోటల్ వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి అడవి లోపల సఫారీకి అనుమతిస్తే ఉగ్రపోరాటం చేపడతామని హెచ్చరించారు. అలాగే డిసెంబర్ 4లోగా వరి, రాగి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవకుంటే జిల్లాధికారి కార్యాలయం ఎదుట నిరవధిక ధర్నా చేపడతామన్నారు. గురువారం ప్రభుత్వ అతిథిగృహంలో సమావేశమయ్యారు. సమాఖ్య అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్ మాట్లాడుతూ అటవీ సరిహద్దు గ్రామాల్లో పులుల దాడిలో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడే సఫారీ వద్దేవద్దని నినదించారు. ప్రభుత్వం వెంటనే అడవిలోని రిసార్ట్‌లను బంద్ చేయించాలని కోరారు.
ఓపెన్ వర్సిటీలో లంచగొండి
మైసూరు: ప్రాజెక్ట్ వర్క్ కోసం విద్యార్థుల నుంచి లంచం తీసుకున్న ఆరోపణలపై మైసూరులోని కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమతి ఆర్.గౌడను సస్పెండ్ చేశారు. వివరాలు.. ప్రాజెక్టు వర్క్ మంజూరుకు సుమతి తమ నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు వర్సిటీ పాలక మండలికి ఫిర్యాదు చేశారు. ఆ వాట్సప్ సంభాషణల స్క్రీన్ షాట్లు, వాయిస్ మెసేజ్‌లు, డబ్బు చెల్లించిన వివరాలను వర్సిటీ వీసీకి సమర్పించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ జగదీష్‌బాబు, సునీత కూడా సుమతి బాగోతం నిజమేనని ఫిర్యాదు చేశారు. వర్సిటీ ఘనతకు భంగం కలిగించినందున సేవల నుంచి సస్పెండ్ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ఆదేశాలిచ్చారు. ఆమైపె విచారణ చేపట్టారు.
ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు
మైసూరు: విద్యార్థినిని వేధించిన వ్యవహారంలో మైసూరు విశ్వవిద్యాలయం పట్టు విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఉమాకాంత్‌ను సస్పెండ్ చేయాలని వర్సిటీ సిండికేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఉమాకాంత్ ఒక విద్యార్థిని సెల్‌ఫోన్‌కు నిత్యం అసభ్యకరమైన సందేశాలు పంపేవాడు, తనతో గడపకపోతే మార్కులు తక్కువ వేసి ఫెయిల్ చేస్తానని వేధించేవాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఉప చాన్సలర్ ప్రొఫెసర్ ఎన్.కే.లోకనాథ్ అధ్యక్షతన సిండికేట్ సమావేశం జరిగింది. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉమాకాంత్‌ను సస్పెండ్ చేశారు. ప్రొఫెసర్ల బాగోతాలు కలకలం రేపాయి.
సిటీ ట్రాఫిక్‌కు టెక్కీ బలి


