మాట నిలబెట్టుకోండి..
బెంగళూరు (బనశంకరి): రాష్ట్ర రాజకీయాల్లో నంబర్ గేమ్ జోరుగా నడుస్తోంది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు ఎక్కువమంది ఎమ్మెల్యేలను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అదే మాదిరి హైకమాండ్‌ను ప్రభావితం చేయడానికి హస్తిన యాత్రలను చేపట్టారు. మొదట్లో డీకే శివకుమార్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. అందులో మండ్య, తుమకూరు, దావణగెరె జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాస్త ఆలస్యంగా మూడిగెరె ఎమ్మెల్యే నయన మోటమ్మ కూడా చేరారు. పాత మైసూరు ప్రాంత ఎమ్మెల్యేలు మాత్రం ఉంటే చాలదని, బెళగావి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను డీకేశి ఒప్పించారు. మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్, కిత్తూరు ఎమ్మెల్యే బాబాసాహేబ్ పాటిల్, కుడచి ఎమ్మెల్యే మహేంద్ర తమ్మణ్ణనవర్‌తో ఆయన చర్చలు జరిపారు. మీ ప్రాంతం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలైనా ఢిల్లీ యాత్రలో ఉండాలని వారికి సూచించారు.
డీకే నచ్చజెప్పే ఆపరేషన్
సిద్దరామయ్య ఇప్పటికి 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా అధికారం చలాయించారు. ఒక్కరే ఆ పదవిలో కొనసాగితే మిగిలినవారి పరిస్థితి ఏమిటని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. తాను కలుస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇవే మాటలతో సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డీకే సోదరుడు మాజీ ఎంపీ డీకే.సురేశ్ , మంత్రి రామలింగారెడ్డిని కలిసి చర్చించి మద్దతు కోరినట్లు తెలుస్తోంది.
సీఎం వర్గం ఆగ్రహం
ఢిల్లీకి వెళ్లిన డీకేశి వర్గం ఎమ్మెల్యేలకు మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఫోన్ చేశారు, ఎందుకు వెళ్లారు, ఏం పని అని సీఎం తరఫున ప్రశ్నించినట్లు తెలిసింది. డీకే శిబిరం ఎమ్మెల్యేల సంతకాలు సేకరిస్తోందనే దానిపై సిద్దరామయ్య వర్గం ఆగ్రహంతో ఉంది.
నన్ను ఢిల్లీకి పిలవలేదు: డీకే
తనను ఢిల్లీకి రావాలని పిలవలేదని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. నగరంలో మీడియాతో మాట్లాడుతూ అంగన్‌వాడీల వేడుకలలో పాల్గొనడానికి తాను బెంగళూరులో ఉంటానని తెలిపారు. ఓ కార్యక్రమం కోసం ముంబైకి వెళ్లి వెంటనే తిరిగి వస్తానని చెప్పారు. కాగా ఆయన శనివారం ఢిల్లీకి వెళ్తారని ప్రచారం సాగుతోంది.
నేడు ఢిల్లీకి సీఎం వర్గం మంత్రులు
రాష్ట్రంలో సీఎం మార్పు వార్తల నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య శిబిరం నుంచి 6 మంది మంత్రులు ఢిల్లీ యాత్ర కు సిద్ధమయ్యారు. హోంమంత్రి పరమేశ్వర్ నేతృత్వంలో హెచ్‌కే పాటిల్, హెచ్‌సీ మహదేవప్ప, సతీశ్ జార్కిహొళి, మరో ఇద్దరు మంత్రులు శుక్రవారం హస్తినకు పయనమవుతారని తెలిసింది. హైకమాండ్ నాయకులను కలిసి పరిణామాలను వివరిస్తారు. సీఎంను మార్చవద్దని కోరనున్నారు. సిద్దరామయ్య సూచనతోనే యాత్రకు వెళ్తున్నారు.
వ్యూహాల్లో సిద్దు వర్గం
శివాజీనగర: రభస పరిష్కారానికి హైమాండ్ సిద్ధం కాగా, రాష్ట్రంలో సీఎం సిద్దరామయ్య, అనుచర వర్గం నాయకులు బల ప్రదర్శనకు పావులు కదుపుతున్నారు. సీఎం ప్రభుత్వ నివాసం కృష్ణాలో అహింద నాయకులు భేటీ జరిపారు. సిద్దుకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. గురువారం ఉదయం మంత్రి సతీశ్ జార్కిహొళి నివాసంలో సీనియర్లు బీకే హరిప్రసాద్, మంత్రి హెచ్.సీ.మహదేవప్ప వెళ్లి మాట్లాడారు. తరువాత వీరు సీఎం నివాసానికి వెళ్లారు.
ఎమ్మెల్యేల ఆకర్షణకు సీఎం,
డీసీఎం వర్గాల పాట్లు
చర్చలతో డీకే శివకుమార్ మంత్రాంగం
మిగతావారికీ సీఎం చాన్సు
దక్కాలని సూచన
నేడు ఢిల్లీకి సీఎం వర్గం మంత్రులు
ముఖ్యమంత్రి పదవీ మార్పిడి అనేది చిక్కుముడిగా మారింది. ఈ తగాదాకు ఖర్గే పసరు వైద్యం పనిచేయకపోవడంతో ఢిల్లీ పెద్దల పంచాయితీకి చేరింది. మేజర్ సర్జరీ చేస్తారా.., రాజీ ఫార్ములాతో సద్దుమణిగేలా చేస్తారా? అనేది రాహుల్, సోనియాగాంధీ చేతుల్లో
ఉంది. మెట్టు దిగడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. ఏం మాట ఇచ్చారో తెలుసా.. దానిని నిలబెట్టుకోండి అని డీసీఎం ప్రశ్నించడం తీవ్రతకు అద్దం పడుతోంది.
వేచి చూడండి: ముఖ్యమంత్రి
మల్లికార్జున ఖర్గే సీఎం, డీసీఎంలను పిలిపిస్తామని చెప్పారు. దీనిపై సీఎం సిద్దరామయ్య మీడియాతో స్పందిస్తూ.. ఏం జరుగుతుందో వేచిచూడండి, హైకమాండ్ చెప్పిన ప్రకారం నడుచుకొంటాం అని తెలిపారు.
ఇచ్చిన మాటను కాపాడుకోవటమే ప్రపంచంలో ఉన్న పెద్ద శక్తి. అది ఎంతటివారైనా కావచ్చు.. అని డీసీఎం శివకుమార్ ఎక్స్ ఖాతాలో మెసేజ్ ప్రత్యక్షమైంది. ఇది సీఎం సిద్దరామయ్యను ఉద్దేశించారా.. లేక కాంగ్రెస్ హైకమాండ్‌నా? అనేది అందరికీ తీవ్ర సందిగ్ధాన్ని కలిగించింది. ఎన్నికల్లో గెలిచి ఢిల్లీకి వెళ్లాక సిద్దు, డీకే మధ్య రెండున్నరేళ్ల ఒప్పందానికి సిద్దు అంగీకరించారు, ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకోవాలని గుర్తుచేశారని ఎక్కువమంది భావిస్తున్నారు. అయితే కొన్నిగంటలకే శివకుమార్... అబ్బే ఆ పోస్టు నాది కాదు, నకిలీ పోస్టు వైరల్ అవుతోందని చెప్పడం గమనార్హం. తమ లక్ష్యం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో 28 సీట్లు గెలవడం, రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమని చెప్పారు.
రాహుల్‌తో ఖర్గే ఫోన్ ఇన్
రాహుల్ గాంధీతో సుమారు 25 నిమిషాలపాటు మల్లికార్జున ఖర్గే ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఆ తరువాత మాట్లాడిన ఖర్గే ఇక్కడి సమస్యలకు ఔషధం ఇస్తాం. హైకమాండ్‌లో నేను, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఉన్నారు. తామందరం కూర్చొని యోచించి ఏమి పరిష్కారం చేయాలో దానిని చేస్తామన్నారు.
మాట నిలబెట్టుకోండి..
మాట నిలబెట్టుకోండి..
మాట నిలబెట్టుకోండి..


