మళ్లీ రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం
హొసపేటె: నగరంలో మళ్లీ రోడ్డు వెడల్పు పనులను నగరసభ యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టారు. నగరంలోని హంపీ రహదారిలో అనంతశయనగుడి ఫ్‌లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా అర్ధ కిలో మీటరు వరకు రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. నగరసభ కమిషనర్ శివకుమార్ సంబంధిత ల్యాండ్ సర్వే అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పనులు సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. రెండు జేసీబీ యంత్రాలను తీసుకు రావడంతో జనం పెద్ద సంఖ్యలో చేరారు. అర్ధ కిలోమీటరు పొడవునా రోడ్డుకు ఇరు వైపుల కలిపి 80 అడుగుల మేర రోడ్డు విస్తరించేలా భవనాలను కూల్చివేసే ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే రోడ్డు మధ్యన ఉన్న పచ్చని చెట్లను కూడా తొలగించారు. నగరసభ అనుమతి లేకుండా, రోడ్డును అక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన భవనాలను కూల్చి వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అక్రమ ఇళ్లను ఖాళీ చేయాలని నివాసులకు నవంబర్ ఒకటి వరకు గడువు ఇచ్చామన్నారు. గడువు లోపల ఇళ్లను ఖాళీ చేయక పోవడంతో తామే స్వయంగా ఇళ్లను తొలగిస్తున్నామని కమిషనర్ తెలిపారు.


