
మైసూరు దసరా ఉత్సవాలకు బాను ముష్తాక్‌కు ఆహ్వానంపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఈ నెల 22న అట్టహాసంగా మొదలయ్యే మైసూరు దసరా ఉత్సవాలకు బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్‌ను కర్నాటక ప్రభుత్వం ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం. ప్రభుత్వం ప్రజలను ఏ, బీ, సీ అంటూ ఎలా విభజించి చూడగలదు? మన రాజ్యాంగ పీఠిక ఏం చెబుతోంది?’అంటూ శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది.
బాను ముష్తాక్ చేతుల మీదుగా దసరా ఉత్సవాలను ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఈ నెల 15వ తేదీన కర్ణాటక హైకోర్టు కొట్టివేయడం తెల్సిందే. ఈ సందర్భంగా హైకోర్టు.. 2017 దసరా ఉత్సవాల వేదికపై డాక్టర్ నిస్సార్ అహ్మద్‌తో పిటిషనర్లలో ఒకరు వేదికను పంచుకోవడాన్ని ప్రస్తావించింది. ఇదే విషయాన్ని సుప్రీం ధర్మాసనం గుర్తు చేస్తూ.. ఇది నిజమా? కాదా? అని ప్రశ్నించింది.
అయితే, ఉత్సవాలను ప్రారంభించడం, పూజల్లో పాల్గొనడమనే రెండు అంశాలున్నాయంటూ పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాజ్యాంగంలోని ఆరి్టకల్ 25 ప్రకారం మత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని తెలిపారు. అలాంటప్పుడు, 2017లో భంగం కలగలేదా అని ధర్మాసనం ప్రశ్నించగా కలగలేదని లాయర్ బదులిచ్చారు. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా రాజకీయపరమైందని ఆరోపించారు. గతంలో బాను ముష్తాక్ మత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. వాదనల అనంతరం ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
తీర్పును స్వాగతించిన సీఎం సిద్ధరామయ్య
మైసూరు దసరా ఉత్సవాలకు బాను ముష్తాక్‌ను ఆహ్వానించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు. మైసూరు దసరా ఉత్సవాలను మత కోణంలో చూడరాదన్నారు. అందరినీ కలుపుకుని పోయేందుకే ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోందని ఎక్స్‌లో తెలిపారు.