సాధారణ వ్యక్తి జీవనాన్ని హృద్యంగా వ ర్ణించిన ‘ఫ్లెష్’ నవలకు దక్కిన గౌరవం
ట్రోఫీతోపాటు 50,000 పౌండ్ల నగదు బహుమతి అందజేత
లండన్: హంగేరీ నుంచి బ్రిటన్‌కు వలసవచ్చిన ఓ సాధారణ వ్యక్తి జీవితంలోని సుఖదుఃఖాలు, విషాధాల కలబోతగా రూపుదిద్దుకున్న ఊహాత్మక ‘ఫ్లెష్’ నవల రచించిన హంగేరీ–బ్రిటన్ రచయిత డేవిడ్ సలాయ్‌కు 2025 బుకర్ ప్రైజ్ వరించింది. 51 ఏళ్ల సలాయ్‌కు సోమవారం లండన్‌లోని ప్రఖ్యాత ఓల్డ్ బిల్డింగ్స్‌గేట్ వేదికపై బుకర్ అవార్డ్‌ను గత ఏడాది విజేత సమంతా హార్వే ప్రదానం చేశారు. అవార్డ్‌తో పాటు 50,000 పౌండ్ల నగదు పురస్కారం సలాయ్‌కు అందజేశారు. ఫేవరెట్‌లుగా నిలిచిన తొలి ఐదుగురు పోటీదారులను వెనక్కినెట్టి సలాయ్ ఈ అవార్డ్‌ను గెల్చుకోవడం విశేషం. భారతీయ రచయిత కిరణ్ దేశాయ్ సైతం గట్టిపోటీనిచ్చినా ఆద్యంతం అద్భుతంగా సాగే ఫ్లెష్ రచనకు ప్రాణంపోసిన సలాయ్‌కు అవార్డ్ దక్కింది.
ఒకవేళ కిరణ్ దేశాయ్ ఈ అవార్డ్‌ను గెల్చుకుని ఉంటే 56 ఏళ్ల అవార్డ్ చరిత్రలో దీనిని రెండుసార్లు గెల్చుకున్న తొలి రచయితగా ఈమె రికార్డ్ నెలకొల్పేది. ది ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్ రచనకు దేశాయ్‌కు 2006లో బుకర్ ప్రైజ్ దక్కింది. ‘ఫ్లెష్’ నవల మొత్తం హంగేరీకి చెందిన ఇస్ట్‌వాన్ అనే వలసదారుని చుట్టూ తిరుగుతుంది. ఇస్ట్‌వాన్ టీనేజీలో పక్కింటి వివాహితతో సాన్నిహిత్యం మొదలు సైన్యంలో చేరి ఇరాక్ యుద్దంలో పాల్గొనడం, తర్వాత దిక్కులేక లండన్‌కు శరణారి్థగా వెళ్లడం దాకా ఎన్నెన్నో అంశాలను ఎంతో వాస్తవిక కోణంలో రచయిత సలాయ్ రాసుకొచ్చారు.
బ్రిటన్‌లో ప్రైవేట్ సెక్యూరిటీ నిపుణుడికి బౌన్సర్‌గా, డ్రైవర్‌గా పనిచేయడం ఈ క్రమంలో సంపన్న క్లయింట్‌తో వివాహం తర్వాత లండన్ ధనిక సమాజంలో పరపతి, పలుకుబడితో విలాసవంత జీవనం గడపడం దాకా ఇస్ట్‌వాన్ జీవిత ఘట్టాలను రచయిత ఏకబిగిన చదివేలా చేశారు. మానసిక సంఘర్షణలతో ఇస్ట్‌వాన్ చివరకు ఏకాకిగా మారి సాధారణ జీవితం గడుపుతాడు. ఈ నవల పేజీల పేరాల మధ్య రచయిత కొంత ఖాళీ స్థలాన్ని వదిలేశారు.
పాఠకుడు సైతం నవలలో పూర్తిగా లీనమై ఇస్ట్‌వాన్ వ్యక్తిత్వాన్ని తనదైన శైలిలో రాసుకునేందుకు ఈ స్థలాన్ని వదిలేశారు. ఈ ఏడాది 153 నవలలు పోటీపడగా సలాయ్ రచన అవార్డ్‌ను ఎగరేసుకుపోయింది. రచయిత సలాయ్ కెనడాలో పుట్టారు. తర్వాత బ్రిటన్‌లో పెరిగారు. తాజాగా వియన్నాలో స్థిరపడ్డారు. ఈయన గతంలో రచించిన ‘ఆల్ దట్ మ్యాన్ ఈజ్’ నవల 2016లో తుదిజాబితాకు ఎంపికైనా అవార్డ్‌ను గెలవలేకపోయింది.


