తెలుగు వారి మనస్సాక్షి… సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ…కెనడాలో మొట్టమొదటిసారిగా ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా ప్రారంభమైంది. టొరంటో, మిస్సిసాగాలోని హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
భారత జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక AVను ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ కెనడాకు తమ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

నార్త్ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తూ, అమెరికాలో నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా ఎదిగిన సాక్షి టీవీ, ఇప్పుడు కెనడాలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని కె.కె. రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సాక్షి టీవీ కెనడా ద్వారా అందించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిశ్చల్ వివరించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా జూమ్ ద్వారా పాల్గొని... టొరంటోలో సాక్షి టీవీ కెనడా లాంఛ్ అవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కెనడాలోని తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించబోయే గొప్ప అడుగు ఇదని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ సూచనలు, సలహాలు అందించారు.

సాక్షి టీవీ కెనడా లాంచ్ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కేకే రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ కెనడాను ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు.


