ఇది కూడా లారెన్స్ తరహా అంశమే. తనకు పనేమీ చెప్పకుండా బోర్ కొట్టించారని పేర్కొంటూ ఓ వ్యక్తి యజమానిపై కోర్టుకెళ్లాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఫెడ్రిక్ డెస్నార్డ్ ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ తయారీ కేంద్రంలో మేనేజర్‌గా పనిచేశాడు. అయితే, తనకు చిన్నచిన్న పనులు తప్ప కీలకమైన విధులేమీ అప్పగించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డానని యజమానిపై దావా వేశాడు. నాలుగేళ్లు తనది అదే పరిస్థితి అని పేర్కొన్నాడు. పని చెప్పకుండా ఇలా ఇబ్బందులకు గురి చేసినందుకు కంపెనీ 4 లక్షల డాలర్ల (రూ.3.6కోట్లు) పరిహారం ఇవ్వాలని కోరాడు. ఏమీ పనిచేయకుండా జీతం తీసుకున్నందుకు సిగ్గుగా ఉందని.. పైగా దానివల్ల మూర్ఛవ్యాధి కూడా వచి్చందని వివరించాడు. వాదనలు విన్న న్యాయస్థానం ఫెడ్రిక్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అధిక పనిఒత్తిడితో బాధపడే ఉద్యోగికి ఈ వ్యవహారం భిన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఫెడ్రిక్‌కు 45వేల(రూ.40 లక్షలు) డాలర్ల పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
20 ఏళ్లు ఉత్తినే జీతమిచ్చారని కంపెనీపై దావా
పని చేయకపోయినా జీతం ఇచ్చేస్తాం అంటే.. ఇలాంటి డీల్ ఉంటే ఎలా వదులుకుంటాం అనే కదా అంటారు. కానీ ఆమె అలా అనలేదు. తనకు ఎలాంటి పనీ అప్పజెప్పకుండా 20 ఏళ్ల పాటు వేతనం ఇచి్చన కంపెనీపై కోర్టుకెక్కారు. లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్ అనే మహిళ 1993లో ఫ్రాన్స్ టెలికాం కంపెనీలో ప్రభుత్వ ఉద్యోగిగా నియమితులయ్యారు. అయితే, పుట్టుకతోనే హెమిప్లెజియా (ముఖం, అవయవాలలో పాక్షిక పక్షవాతం) ఉండటంతో ఆమెకు అందుకు అనుగుణమైన పనులే అప్పగించారు. ఆ తర్వాత ఆ కంపెనీని ఆరెంజ్ సంస్థ స్వా«దీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్వీయ అభ్యర్థనపై ఆమెను ఫ్రాన్స్‌లోని మరో ప్రాంతానికి బదిలీ చేశారు. కానీ అక్కడ కొత్త కార్యాలయం ఆమె అవసరాలకు అనుగుణంగా లేదు. దీంతో కంపెనీ ఎలాంటి పనులూ అప్పజెప్పకుండా వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, వాసెన్ దీనిని వివక్షగా భావించి.. పోరు మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణ కొనసాగుతోంది.
16 ఏళ్లుగా సిక్ లీవ్.. తిరిగి యజమానిపైనే కేసు
జర్మనీకి చెందిన ఓ టీచరమ్మ కూడా ఇదే బాపతు. కాకుంటే కాస్త పద్ధతిగా సిక్ లీవ్ పెట్టింది. సిక్ లీవ్ అంటే వారాలు, నెలలు కాదు.. ఏకంగా 16 సంవత్సరాలు. అవాక్కయ్యారా? కాస్త ఆగండి. ఇంకా ఉంది. అనారోగ్యానికి సంబంధించిన రుజువులు చూపించండి అని అడిగినందుకు యాజమాన్యంపైనే కేసు పెట్టింది. జర్మనీలోని నార్త్ రైన్–వెస్ట్‌ఫాలియాకు చెందిన ఓ మహిళ వెసెల్‌లోని ఓ వృత్తి విద్య కాలేజీలో ఉపాధ్యాయురాలు. అనారోగ్యం సాకుతో 16 ఏళ్లు సిక్ లీవ్‌లోనే ఉండి 11.66 లక్షల డాలర్లు (దాదాపు రూ.10 కోట్లు) వేతనం తీసుకుంది. జర్మనీ చట్టాల ప్రకారం ఉపాధ్యాయులు అనారోగ్య సెలవులో ఉన్నప్పుడు పూర్తి జీతం తీసుకోవడంతో సహా కొన్ని ప్రత్యేక హక్కులు కలిగి ఉంటారు. దీనినే ఆమె క్యాష్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ కాలేజీకి కొత్త యాజమాన్యం వచ్చి.. ఆమె అనారోగ్యానికి రుజువు అడగడంతో వారిపై దావా వేసింది. అయితే, న్యాయస్థానం ఆమెనే చీవాట్టు పెట్టింది. అనారోగ్యానికి సంబంధించి రుజువును అడిగే హక్కు యాజమాన్యానికి ఉంటుందని తేల్చి చెప్పింది.
పని చేయకుండానే పదేళ్లుగా జీతం తీసుకుని..
ఇతడు ఎలాంటి విధులూ నిర్వర్తించలేదు.. ఇంకా చెప్పాలంటే అసలు ఆఫీసుకే రాలేదు.. కానీ నెలనెలా జీతం మాత్రం తీసుకున్నాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదేళ్ల పాటు దర్జాగా వేతనం పొందాడు. ఎట్టకేలకు అతడి బాగోతం బయట పడటంతో కటకటాలపాలయ్యాడు. కువైట్ లోని పౌర సేవల విభాగంలో ఉద్యోగిగా ఉన్న ఓ వ్యక్తి గత దశాబ్దకాలంగా ఆఫీసుకే రాలేదు.. కానీ నెలనెలా అతడి ఖాతాలో జీతం జమైంది. ఇటీవల ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు కేసు పెట్టారు. రెండు కోర్టుల్లో తీర్పు అతడి పక్షాన రాగా.. కోర్ట్ ఆఫ్ క్యాసేషన్‌లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. అతడికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే పదేళ్లుగా తీసుకున్న వేతనం మొత్తం 1,04,000 కువైట్ దీనార్లను (దాదాపు రూ.3 కోట్ల పైనే) రికవరీ చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ నిధుల నుంచి అక్రమంగా వేతనం పొందినందుకు 3,12,000 కువైట్ దీనార్ల (దాదాపు రూ.9 కోట్ల పైనే) జరిమానా విధించింది.


