"కాపురం కాపాడడానికి పోతే కాలు తెగింది" అన్న నానుడి ఈ బాధితుడి వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. పాపం రోడ్డుపై ఒంటరిగా ఉన్నాడనే ఒక వ్యక్తికి లిప్ట్ ఇచ్చాడు. తీరా చూస్తే అక్కడి అధికారులు చేసిన తనిఖీల్లో లిప్ట్ ఇచ్చిన వ్యక్తి అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని తేలింది. దీంతో నేరస్థునితో పాటు లిప్ట్ ఇచ్చిన వ్యక్తిని జైలులో తోశారు.
సౌదీ అరేబీయాలోని జిజాన్‌లో ప్రసాద్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని విధి నిర్వహణలో భాగంగా వాహనంలో వెళుతున్నాడు. అయితే అప్పుడు రోడ్డుపై ఓ వ్యక్తి లిప్ట్ అడిగాడు. దీంతో అతనికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో అతనిని వాహనంలోకి ఎక్కించాడు. తీరా కొద్దిదూరం వెళ్లేసరికి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. వీరిద్దరిని ఆపి పత్రాలు చూపించమని అడగగా ఆవ్యక్తి వద్ద సరైన పత్రాలు లేవు. దీంతో అతను యెమన్‌కు చెందిన వ్యక్తి అని అతను అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు.
దీంతో యెమన్‌కు చెందిన వ్యక్తితో పాటు అతనికి లిప్ట్ ఇచ్చినందుకు ఆ డ్రైవర్‌ను అరెస్టు చేసి నెలరోజుల పాటు జైలులో ఉంచారు. అనంతరం ఆ సదరు ఉద్యోగి తను పనిచేసే సంస్థకు వెళ్లగా కంపెనీ వెహికిల్‌ను ప్రజలను ఎక్కించుకున్నారనే అభియోగంతో వారు ఉద్యోగంలో నుంచి తొలగించారు. అనంతరం అతనికి జీతంతో పాటు అతనికి రావాల్సిన కంపెనీ బెనిఫిట్స్‌ను కూడా ఇవ్వలేదు. దీంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.
విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి నుండి కేలి సాంస్కృతిక కేంద్రాన్ని సంప్రదించాడు. దీంతో వారు అతనిని తిరిగి భారత్‌కు పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అయితే ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని సరైన పత్రాలు లేని వారిని వాహనాల్లో ఎక్కించుకున్నందుకు ఇదివరకూ ఎంతో మంది జైలుపాలయ్యారన్నారు. కనుక సౌదీలో ఉండేవారు ఎవరినైనా వాహనంలో ఎక్కించుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు.


