
ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ పాశమైలారంలో ఊహకందని ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం అక్కడి సిగాచి ఫార్మాస్యూటికల్ పరిశ్రమలోని రియాక్టర్ పేలి, క్షణాల్లో మంటలు వ్యాపించి పెద్ద సంఖ్యలో కార్మికులూ, ఉద్యోగులూ మరణించటం అందరినీ కలచివేసింది. పేలుడు సమయంలో వంద మందికి పైగా పనిచేస్తుండటం, కొద్దిమంది మాత్రమే సురక్షితంగా తప్పించుకోగలగటం, పలువురి ఆచూకీ లేకపోవటం గమనిస్తే కీడు శంకించాల్సి వస్తోంది.
మొదట్లో 13 మంది మరణించినట్టు వెల్లడైనా గంటలు గడుస్తున్నకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. పేలుడు ధాటికి సెకన్ల వ్యవధిలో కుప్పకూలిన రెండు మూడంతస్తుల భవనాలకు సంబంధించిన శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇంతవరకూ 45 మంది మరణించారని ప్రకటించినా ఈ సంఖ్య మరింత పెరగవచ్చన్నది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారి అంచనా.
శిథిలాల కింద కొందరైనా సజీవంగా ఉండొచ్చని చెబుతున్నారు. శరీరాలు ఛిద్రమై చాలా మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా మారటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. డీఎన్‌ఏ పరీక్షలు జరిగితే తప్ప మరణించినవారిని నిర్ధారించటం సాధ్యం కాదంటున్నారు. ఈ ఫ్యాక్టరీలో రెండు తెలుగు రాష్ట్రాల వారితో పాటు బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలవారు కూడా పనిచేస్తున్నారు.
భారీ యెత్తున పరిశ్రమలు రావాలని, యువతకు ముమ్మరంగా ఉద్యోగావకాశాలు లభించాలని పాలకులు ఉవ్విళ్లూరుతున్నారు. మాకు ఏ రాష్ట్రమూ పోటీకాదు... ప్రపంచ దేశాలతోనే మా పోటీ అంటూ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. మంచిదే. పరిశ్రమలు వస్తే, ఉత్పాదకత పెరిగితే, వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. వృద్ధి రేటు పైపైకి ఎగబాకుతుంది.
రాష్ట్రం సంపద్వంతం అవుతుంది. కానీ ఇదే స్థాయిలో భద్రతా ప్రమాణాలపై దృష్టి పెడుతున్నారా? ఆ అంశంలో దృష్టి కేంద్రీకరించే విభాగాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయా? వాటిపై సరైన పర్యవేక్షణ ఉంటున్నదా? అసలు ఆ విభాగాల్లో తగినంత మంది సిబ్బంది ఉంటున్నారా? వీటన్నిటికీ లేదన్న సమాధానమే వస్తోంది.
ఒక్క హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న పరిశ్రమల్లోనే గత అయిదేళ్లలో వేయికి పైగా ప్రమాదాలు సంభవించాయని గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఏటా సగటున 200 ప్రమాదాలు! ఈ ప్రమాదాల్లో 1,500 మంది ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. గత 30 నెలల్లోనే 10 భారీ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
వీటిల్లో అధిక భాగం పాశమైలారం, పటాన్‌చెరు ప్రాంతాల్లో జరగటం గమనించదగ్గ అంశం. ఈ ప్రమాదాల్లో ఆస్తి నష్టం గురించి చెప్పనవసరం లేదు. అధునాతన సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్నాయి. వంద మంది చేసే పనిని అంతకన్నా చాలా తక్కువ వ్యవధిలో పది మంది సునాయాసంగా చేయగలిగేంతగా యాంత్రీకరణ జరిగింది.
యాజమాన్యాలకు లాభాలు కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి. కానీ సగటు కార్మికుడి భద్రత మాత్రం గాల్లో దీపంగా మారుతోంది. అయినా ఈ ఫ్యాక్టరీల్లో భద్రత భేషుగ్గా ఉందంటూ ధ్రువీకరణ పత్రాలు వస్తున్నాయి. సిగాచికి భద్రతా ప్రమాణాల్లో, వృత్తిగత ఆరోగ్య అంశాల్లో ఐఎస్‌ఓ సర్టిఫికెట్ కూడా వచ్చింది. అలాంటి చోట ప్రమాదం జరిగిందంటే ఎవర్ని నిందించాలి?
విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మనిషి తన పట్లా, తన భద్రత పట్లా పట్టింపుతో ఉండటమే సకల సాంకేతికతల పరమార్థం కావాలని ఆకాంక్షించారు. కానీ లాభాల వేటలో ఇవేమీ పట్టడం లేదని ప్రమాదాల పరంపర చెబుతోంది. తరచుగా చోటు చేసుకుంటున్న చాలా పేలుళ్లు డ్రయ్యర్లు, రియాక్టర్లకు సంబంధించినవే కావటం గమనించదగ్గది.
ఇప్పుడు ప్రమాదం జరిగిన సిగాచిలో గత డిసెంబర్‌లో తనిఖీలు నిర్వహించి, భద్రతా ప్రమాణాలు బాగున్నాయని అధికార గణం తేల్చింది. అదే చోట ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం చోటుచేసుకున్నదంటే ఆ తనిఖీలు ప్రామాణికంగా లేవన్న సందేహం కలుగుతుంది. జరిగే ప్రమాదాలపై వెంటవెంటనే దర్యాప్తు, నిపుణుల ద్వారా అందుకు దారితీసిన లోటుపాట్ల నిర్ధారణ, బాధ్యుల్ని త్వరగా శిక్షించటం వంటివి జరిగితే తప్ప ఈ ప్రమాదాలు ఆగేలా కనబడటం లేదు.
ఫ్యాక్టరీ యాజమాన్యాలతో మాట్లాడతారు సరే... అక్కడి కార్మికులనడిగి ప్రాణాంతక సమస్యలేమిటో తెలుసుకోవద్దా? తనిఖీలకెళ్లే అధికారుల జవాబుదారీతనాన్ని తేల్చి, ప్రమాదం జరిగిన పక్షంలో యాజమాన్యాలతోపాటు వారిని కూడా బాధ్యుల్ని చేసేలా చట్ట సవరణ జరిగితేనే, భారీ జరిమానాలు విధిస్తేనే పరిస్థితులు మెరుగుపడతాయి.
తెలంగాణలో దాదాపు 22,000 ఫ్యాక్టరీలుండగా వీటిల్లో 8 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీల్లో అత్యంత ప్రమాదకరమైనవి చాలానే ఉన్నాయి. వీటన్నిటిలో సగటు కార్మికుడి శ్రేయస్సుపై యాజమాన్యాలు దృష్టి పెట్టడం లేదని తరచు ఆరోపణలొస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 163 ప్రమాదాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రమాదకరమైన ప్రక్రియల్లో పాలుపంచుకుంటున్న వారికి ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో, ఏం చేస్తే వాటి నివారణ సాధ్యమయ్యేదో చెప్పే నిరంతర శిక్షణ జరుగుతోందా? ఆ రంగంలో జరిగే మార్పులపై కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారా? భద్రత ఆడిట్ మాటేమిటి? లాభార్జన తప్ప దేనిపైనా శ్రద్ధలేని యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలతో, ఆ ప్రాంత ప్రజల ప్రాణాలతో, పర్యావరణంతో చెలగాటం ఆడుతున్నట్టే. కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఇలాంటివారు దారికి రారు.