
ఉగ్రవాదాన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పాలకులకూ, సైన్యానికీ ఆత్మాహుతి భాష నిండా ఒంటబట్టినట్టుంది. మున్ముందు భారత్ దాడికి దిగితే అణ్వస్త్రాలు ప్రయోగించి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని పాకిస్తాన్ సైనిక చీఫ్ మునీర్ బెదిరించటాన్ని గమనిస్తే ఆ దేశంలో మూర్ఖత్వం ఎంతగా ముదిరిందో అర్థమవుతుంది. పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడిన నాటినుంచీ సక్రమంగా మాట్లాడటం, సవ్యంగా మసులుకోవటం దానికి చేతకావటం లేదు.
అమెరికా, పాశ్చాత్య దేశాలు దాన్ని తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తూనే వచ్చాయి. అమెరికా ఈ విషయంలో ఒకడుగు ముందుంది. ఎదురుతిరిగిన పాలకుల్ని సైనిక కుట్రలో కూలదోయటం, కీలుబొమ్మను ప్రతిష్ఠించటం దానికి అలవాటైన విద్య. అమెరికా సాగు, పాడి రంగ ఉత్పత్తుల్ని భారత్‌లో అనుమతించాలన్న డిమాండ్‌ను మన ప్రభుత్వం అంగీకరించనందుకు ఆగ్రహంతో రగిలిపోతున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మన సరుకులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.
ఆసిఫ్ మునీర్ అధిక ప్రసంగం కూడా ఆయనగారి పథక రచనే కావొచ్చన్న సంశయాలు తలెత్తుతున్నాయి. మొన్న జూన్‌లో మునీర్‌ను పిలిపించుకుని అయిదు రోజులపాటు ఇంటల్లుడి మర్యాదలు చేసిన వైనం మరవకముందే మరోసారి ఆయన అక్కడికి వెళ్లి వాలాడంటే దాన్ని సాధారణ విషయంగా తీసుకోకూడదు. తొలి పర్యటనలో ప్రోటోకాల్స్ పక్కనబెట్టి మునీర్‌కు దేశాధినేతలకిచ్చే స్థాయి ఘనమైన విందునిచ్చి, ముడి చమురు సహా పాకిస్తాన్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించిన తీరు చూసి ప్రపంచం విస్మయపడింది.
పాకిస్తాన్‌లో చచ్చో పుచ్చో... ఎన్నికైన ప్రభుత్వం అంటూ ఒకటుంది. అమెరికాతో సహా ఏ దేశంలోనైనా సైన్యం పని ప్రభుత్వాదేశాలు పాటించటం మాత్రమే. కానీ తోకే కుక్కను ఆడిస్తున్న చందంగా పాక్ పోకడ ఉంది. సైన్యం ఏం చేసినా అక్కడి పాలకులు కిక్కురుమనరు. అందువల్లే మునీర్ ట్రంప్‌తో సహకార ఒప్పందాలు కుదుర్చుకోగలిగాడు. ఈ విషయంలో ట్రంప్‌ను తప్పుబట్టాలి.
తమ సైనిక దళాల చీఫ్ జనరల్ రాండీ ఏ. జార్జి ఏ దేశమైనా పోయి ఒప్పందాలు కుదుర్చుకొని వస్తే ఆయన శిరసావహిస్తారా? ఈసారి మునీర్ నాలుగు రోజులు అక్కడ తిష్ఠ వేశారు. నెల రోజుల్లోనే ఎందుకెళ్లాడో, ఆయన చేస్తున్న రాచకార్యమేమిటో తెలియదు. అటు అమెరికా ప్రభుత్వమూ బయటపెట్టదు. కానీ అమెరికాకు సంబంధించిన రాజకీయ నాయకులతోనూ, సైనిక నాయకత్వంతోనూ ఆయన భేటీలు జరిపాడు.
అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైకేల్ ఈ.కురిలా రిటైర్మెంట్ సభలో పాల్గొనడానికి అక్కడికెళ్లినట్టు మీడియా కథనం. పాకిస్తాన్ సంతతి ప్రజలతోనూ సమావేశమయ్యారు. మునీర్ బెదిరింపులుగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నవన్నీ ఆ సమావేశంలో మాట్లాడినవేనని చెబుతున్నారు. అధికారికంగా అయితే మునీర్ లేదా పాకిస్తాన్ సైన్యం ఈ మాటల్ని ధ్రువీకరించటానికి సిద్ధపడటం లేదు.
అణ్వస్త్ర దేశమని మిడిసిపడితే ఎవరు వూరకున్నా ఇరుగు పొరుగు దేశాలు మౌనంగా ఉండవు. మన విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పినట్టు ఈమాదిరి బాధ్యతా రాహిత్యాన్నీ, బ్లాక్‌మెయిలింగ్‌నూ మన దేశమైతే సహించదు. మునీర్ మాటల్ని భారత్ వక్రీకరిస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనేమీ కోడ్ భాషలో మాట్లాడలేదు. ఆ ప్రసంగానికి సంబంధించిన కథనాన్ని బయటపెట్టింది కూడా అమెరికా మీడియానే.
పైగా పాకిస్తాన్ ఏలికలు ఇలా మాట్లాడటం మొదటిసారేమీ కాదు. ఇక వక్రీకరణకు చోటెక్కడ?! ఏదో ఉన్మాదంలో నోరు జారివుంటే ఆ మాట చెప్పి తప్పయిందని ఒప్పుకోవాలి. విషయం బయటికొచ్చాక వణుకుడు దేనికి? ఉగ్రవాద మూకల్ని పంపి కల్లోలం సృష్టిస్తే, అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తామని బెదిరిస్తే భారత్ హడలెత్తుతుందని పెహల్గాం అనంతర పరిణామాల తర్వాత కూడా పాకిస్తాన్ భ్రమల్లో ఉందంటే దాన్ని ఎవరూ రక్షించలేరు.
అమెరికా సంపన్న రాజ్యమే కావొచ్చుగానీ మంచీ మర్యాదా పాటించటం నేర్చుకోవాలి. కొత్తగా వచ్చిన భుజకీర్తుల మత్తుతో అమెరికాలో వాలిన మరో దేశ సైనిక దళాల చీఫ్ మిత్రదేశంతోపాటు ప్రపంచాన్నే బెదిరిస్తున్న వైనం కనబడుతున్నా గుడ్లప్పగించి చూడటం సబబేనా? చీవాట్లు పెట్టి పంపాల్సిన బాధ్యత లేదా? ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఈ మాదిరి వైఖరే ప్రదర్శించి అమెరికా భారత్‌కు దూరమైంది.
ఆర్థిక సంస్కరణల అనంతరం క్రమేపీ చక్కబడుతూ వచ్చిన ద్వైపాక్షిక సంబంధాలు ఇలాంటి వింత చేష్టలతో ఛిద్రం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్రంప్‌దే! మునీర్ లాంటివాళ్లు ఇష్టానుసారం చెలరేగటాన్ని నిలువరించకపోతే తమకూ నష్టమేనని ఆయన గ్రహించాలి.