
ఆ సాయంత్రం ఎవరో అపరిచితుడు ఇంటి తలుపు ముందుకు వచ్చాడు. ‘నాన్నగారు ఉన్నారా?’ అని అడిగాడు. ‘లేరండీ... బయటకు వెళ్లారు’ అని చెప్పాడు ఇంటి బాలుడు. ఆ బాలుడి నాన్న ఆ చిన్న ఊరికి పంచాయితీ బోర్డు ప్రెసిడెంట్‌గా ఎన్నికై ఉన్నాడు. ‘ఈ కానుక ఇక్కడ పెట్టి వెళ్లనా?’ అని అడిగాడా అపరిచితుడు. అందుకు కనీసం తల్లి అనుమతి కావాలని బాలుడు తల్లిని అడిగాడు. ఆమె ఆ సమయానికి ప్రార్థనలో ఉండి బదులు ఇవ్వలేదు. ‘సరే... పెట్టి వెళ్లండి’ అన్నాడా బాలుడు.
కాసేపటికి తండ్రి వచ్చాడు. కానుకను చూశాడు. ‘ఎవరిచ్చారు ఇది’ అని బాలుడిని అడుగుతూ కానుక తెరిచి చూశాడు. అందులో ఖరీదైన ధోతి, మిఠాయిలు, పండ్లు ఉన్నాయి. చిన్నచీటీ కూడా ఉంది ఆయన పేరున, కానుకిచ్చిన వ్యక్తి సంతకంతో. అందాక ఆ బాలుడు ఎన్నడూ చూడనంత కోపం వచ్చింది తండ్రికి. ‘ఎవరు తీసుకోమన్నారు నిన్ను’ గద్దించి అడిగేసరికి బాలుడు భయంతో ఏడుపు అందుకున్నాడు. ‘నిన్నూ’... ఒక దెబ్బ వేశాడు. తల్లి కొడుకును పొదువుకుంది. తండ్రి కళ్లల్లో సిగ్గుతో, అవమానంతో కన్నీరు ఉబికింది.
‘చూడు... ఇది కానుక. నా నుంచి ప్రయోజనం పొందడానికి ఇచ్చి వెళ్లింది. నేను పదవిలో ఉండగా తరతమ భేదం లేకుండా చేయవలసిన సాయం అందరికీ చేస్తాను. ఇలా కానుక తీసుకుంటే చేయకూడని సాయం కూడా చేయాల్సి రావచ్చు. మన ధర్మంలో కానుకలు నిషిద్ధం. మనుస్మృతిలో కూడా కానుకలు మనిషిలోని దైవిక కాంతిని హరిస్తాయి అని ఉంది. కాబట్టి ఇలాంటి తప్పు జీవితంలో చేయకు’ అని కొట్టిన చేత్తోనే దగ్గరికి తీసుకున్నాడు. అబ్దుల్ కలామ్ అనే ఆ బాలుడు తర్వాత పెరిగి పెద్దవాడై భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు.
తండ్రి నేర్పిన పాఠాన్ని పొల్లుపోకుండా పాటించినందువల్ల రాష్ట్రపతి భవన్‌ను వీడి వచ్చే సమయానికి ఆయన వద్ద ఉన్నవి కేవలం రెండు చిన్న సూట్‌కేసులలో పట్టే దుస్తులు. తన సొంత బంధువులు రాష్ట్రపతి భవన్‌కు వస్తే వారి ఆతిథ్యానికి ఎంతయ్యిందో లెక్కవేసి అక్షరాలా 3,52,000 రూపాయలు చెల్లించిన ఆ ఉన్నతుడు నేడు జాతి గౌరవం అందుకుంటున్నాడు. తండ్రి పాఠాలు సరిగా చేరితే పిల్లలు ఇలా ఉంటారు.
ఐ.ఐ.టి.లో టాపర్‌గా వచ్చిన విదార్థిని ‘నీకు ర్యాంక్ రావడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత?’ అనడిగితే ‘చాలా ఉంది. నాన్న నన్ను విద్యార్థిలా పెంచాడు... అమ్మ కొడుకులా పెంచింది.. రెండూ మేలు చేశాయి’ అన్నాడు. ఇల్లు అనే పాఠశాలలో తొలి ఉపాధ్యా యుడు తండ్రి. లాలనతో నిండిన తల్లి పాఠాలతో పాటు చూపులతోనే దండించగల తండ్రి పాఠాలు ఉంటేనే బాల్య, కౌమార సమయాల్లో లోకరీతులకు కొట్టుకుపోని విలువలను పాదుకొల్పవచ్చు.
తండ్రి పిల్లల క్షేమం కోరతాడు, భవిష్యత్తుకై ఆరాటపడతాడు, అందుకై ఆర్థిక వనరుల కోసం రేయింబవళ్లు కష్టపడతాడు. నిజమే. కాని ఈ క్రమంలో అతడు తన ‘టీచరు పోస్టు’ను, బోధనా బాధ్యతను విస్మరించజాలడు. ‘నా పిల్లలకు ఏమి ఇస్తున్నాను’ అనే తపనలో ‘ఏమి’ అనే ప్రశ్నకు జవాబు ఆర్థికమే కానక్కర లేదు. వాత్సల్యమే కానక్కర్లేదు. వారసత్వమే కానక్కర్లేదు. నేర్పవలసిన పాఠాలు ఉంటాయి, ఇంట్లోని ఈ కొడుకు/కూతురు సమాజంలో పౌరులవుతారు. ఎలాంటి పౌరులవుతారనే స్పృహ ప్రతి తండ్రికీ ముఖ్యం. ‘ఇలా పెంచి వదిలారా’ అనే మాట ఎందుకు రావాలి?
చైనాలో ‘యెన్ చువాన్ షెన్ జియొవ్’ అనే సంప్రదాయం ఉంది. తండ్రి తన చర్యలు, ప్రవర్తన, పాటించే విలువల ద్వారా పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలని దాని అర్థం. ‘నువ్వు ఏమిటో అదే నీ పిల్లలు’ అని తాత్పర్యం. ప్రతి ఆఫ్రికా తండ్రి పిల్లలకు బోధించే తొలిమాట ‘నీ పై నువ్వు ఆధారపడు’ అని. ప్రాదేశిక, సామాజిక, రాజకీయ కారణాల రీత్యా తండ్రులు చెప్పాల్సిన పాఠాలు స్వల్ప తేడాతో ఉంటాయిగానీ అన్నింటి అంతిమ లక్ష్యం విలువలతో కూడిన వ్యక్తిత్వమే.
ఈ సిలబస్‌ను తండ్రులు పక్కనో గట్టునో పెట్టడం, సిలబస్ పూర్తి చేయడానికి సమయం లేదని వంక చెప్పడం ఒక సంగతి. అసలు సిలబసే లేదనుకోవడం మరో సంగతి.
సెప్టెంబర్ 5–‘టీచర్స్ డే’ అంటే అందరూ బడిలో ఉండే టీచర్స్ వైపు చూస్తారు. ఈ టీచర్స్ డే నాడు ఇంట్లోని తొలి ఉపాధ్యాయుడికి మొదటి శుభాకాంక్షలు చెప్పాలి. పిల్లలు ఆశీస్సులు తీసుకోవాలి. వారి సమగ్ర వ్యక్తిత్వాన్ని బేరీజు వేస్తూ ప్రతి తండ్రి తనకు తాను మార్కులు వేసుకోవాలి. ర్యాంకులు అక్కర్లేదు. పాసైతే చాలు. హ్యాపీ టీచర్స్ డే.