
అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్నకొద్దీ ఇజ్రాయెల్‌లో ఉన్మాదం ప్రకోపిస్తోంది. గాజాలో దాని దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచానికి చాటుతున్న పాత్రికేయులను గురిచూసి కాటేస్తూ, మరోపక్క గాజా వాసులను ఆకలితో మాడ్చి చంపుతున్న వైనం అమెరికాకు తప్ప అందరికీ ఆందోళన కలిగిస్తోంది. మనుషులు సృష్టించిన దుర్భిక్షంతో గాజా అల్లాడుతున్నదని ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను అంచనా వేసే ఐరాస అనుబంధ సంస్థ ఐపీసీ ప్రకటించిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. మర్యాదలు అడ్డువచ్చాయో, నిబంధనలు అనుమతించలేదో గానీ... గాజా దుర్భిక్షాన్ని మానవ మృగాల సృష్టిగా ప్రకటిస్తే వర్తమాన స్థితికి సరిగ్గా సరిపోయేది.
ఇజ్రాయెల్‌ఇంతగా ఎందుకు దిగజారుతున్నదో తెలిసిందే. ఇన్ని దశాబ్దాలుగా ఆ దేశానికి గట్టి మద్దతు దార్లుగా నిలిచి, దాని దురాగతాలను సమర్థిస్తూ వచ్చిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియాలు వచ్చే నెలలో జరిగే ఐరాస సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను అధికారికంగా గుర్తించనున్నట్టు ప్రకటించాయి. దాంతో భారత్‌తో సహా 1988లోనే పాలస్తీనా ఆవిర్భావాన్ని గుర్తించిన 147 దేశాల సరసన అవి చేరనున్నాయి.
భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్యదేశాల్లో రష్యా, చైనాలు ఇప్పటికే పాలస్తీ నాను గుర్తించగా బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఆ జాబితాలో చేరనున్నాయి. అంటే ఇజ్రాయెల్ నరమేధానికి మౌనంగా అంగీకారం తెలుపు తున్న అమెరికా ఇకపై మండలిలో ఏకాకి కానుంది. అందుకే ఇజ్రాయెల్ ఉన్మాదం ముమ్మరించింది. సమితిలోనూ, మండలిలోనూ పాలస్తీనాపై చర్చ వచ్చేనాటికల్లా పాలస్తీనా ఉనికినే తుడిచేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తాపత్రయపడుతు న్నారు. అది సాధ్యంకాదని గాజాను వదలబోమంటున్న ప్రజానీకం చాటుతోంది.
రెండేళ్ల క్రితం పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్ గడ్డపై ఉగ్రవాద చర్యకు పాల్పడి 1,200 మంది పౌరులను హతమార్చటంతోపాటు 250 మందిని అపహ రించాక నెతన్యాహూ హమాస్‌పై చర్య నెపంతో ఈ నెత్తుటి హోమాన్ని మొదలుపెట్టారు. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ, వియత్నాం, అఫ్గాన్‌లలో అమెరికా సాగించిన దురాక్ర మణ యుద్ధాల్లోనూ మరణించిన మీడియా సిబ్బంది కన్నా అధికంగా గాజాలో 245 మంది పాత్రికేయులు ఇజ్రాయెల్ క్రౌర్యానికి బలయ్యారు.
ఈ దురాగతాలు అమెరికా అధ్యక్షుడికి తెలియనే తెలియవట. ఈ పరిణామాలకు ఆయనేమీ సంతోషంగా లేరట! నటనలో ట్రంప్‌ను నెతన్యాహూ మించిపోతున్నారు. పాత్రికేయుల మరణం విషాదకర మనీ, వైద్యసిబ్బందికీ, పౌరులకూ తామెంతో విలువిస్తామనీ చెబుతున్నారు. సోమవారం ప్రాణాలు తీసిన పాత్రికేయులపై ఆయనగారు ఎందుకనో ఉగ్రవాద ముద్ర వేయలేదు.
ఐపీసీ ఇరవయ్యేళ్ల చరిత్రలో కరవు కాటకాలను ప్రకటించింది నాలుగే సందర్భాల్లో. సోమాలియాలో 2011లో, దక్షిణ సూడాన్‌లో 2017, 2020లలో, సూడాన్‌లో నిరుడు ఆ సంస్థ దుర్భిక్షం నెలకొన్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఆ జాబితాలో గాజా చేరింది. గాజా దుర్భిక్షం ఫేజ్–5లో ఉన్నదని ఐపీసీ చెబుతోంది. పిల్లల్లో 30 శాతంమంది తీవ్రమైన పౌష్టికాహార లోపంతో ఉన్నారని, ప్రతి పదివేల మందిలో ముగ్గురు మరణిస్తున్నారని దానర్థం.
ఇదే కొనసాగితే గాజా జనాభాలో మూడోవంతు మంది... అంటే 6,41,000 మంది ప్రమాదకర స్థితిలో పడతారని, అయిదేళ్లలోపు చిన్నారులు 1,32,000 మంది మృత్యువాత పడతారని అంచనా వేస్తోంది. ఇప్పటికే ఆకలితో 112 మంది పసివాళ్లతో సహా 271 మంది చనిపోయారు. ఇవిగాక పంపిణీ ట్రక్కుల వద్ద గుమిగూడుతున్నవారిని కాల్చి చంపటం నిత్యకృత్యమైంది. దిగ్బంధాలతో ఆహారం, సరుకులు, ఔషధాలు ప్రజానీకానికి చేరట్లేదు. గాజా వెలుపల 6,000 ట్రక్కులు అనుమతులకై ఎదురుచూస్తున్నాయి.
నిత్యం క్షిపణులు, బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నా, ఈ మారణ హోమాన్ని మౌనంగా తిలకిస్తున్న ప్రపంచంలో అనాథలమయ్యామని తెలుస్తూనే ఉన్నా అత్యధిక జనాభా పాలస్తీనాను విడిచిపెట్టడానికి ససేమిరా అంటున్నది. ఆకలితో,హంతక దాడులతో మృత్యువాత పడతామని తెలిసినా వెరవట్లేదు. రెండో ప్రపంచ యుద్ధా నంతరం ఎక్కడా దిక్కులేక అగ్రరాజ్యాల అండతో ఒక దేశాన్ని ఆక్రమించుకున్న దురాక్ర మణదారుకేం తెలుసు... మాతృభూమిపై మమకారమంటే ఏమిటో?! ఇవాళ హంతకు లది పైచేయి కావొచ్చు, ప్రపంచ ప్రజానీకం మౌనంగా మిగిలిపోవచ్చు. కానీ ఈ నేరాలు సమసిపోవు... వాటికి శిక్షపడకా తప్పదు. అప్పుడు నటనలు చెల్లవు, ముసుగులు కుద రవు. ఆ రోజు ఆగమించేవరకూ పాలస్తీనా పంటి బిగువన ఈ కష్టాలు భరించక తప్పదు.