
రాష్ట్రాల్లో అసెంబ్లీలుండగా శాసన మండళ్ళు అవసరమా అన్న వాదనతోపాటే ఆ శాసన మండళ్ళకు కొందరు సభ్యుల్ని నామినేట్ చేయటానికి గవర్నర్‌లకుండే అధికారాలపై, ఆ కోటాలో ఎంపికైన అభ్యర్థుల అర్హతలపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంటుంది. తెలంగాణ శాసన మండలికి నిరుడు గవర్నర్ కోటాలో ఎంపికైన విద్యావేత్త ప్రొఫెసర్ కోదండరామ్, పాత్రికేయుడు అమేర్ అలీఖాన్‌ల సభ్యత్వాలు రద్దుచేస్తూ బుధవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలీయటంతో ఆ అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది.
రాష్ట్రాల్లో శాసన మండళ్ళ మాదిరే కేంద్ర స్థాయిలో ఉండే రాజ్యసభకు చేసే ఎంపికలు కూడా అందరిలో ఆసక్తి రేపుతాయి. అంతేకాదు... వివాదాలకూ, అభ్యంతరాలకూ దారితీస్తుంటాయి. పాలకులుగా ఎవరున్నా ఈ రివాజు మారదు. ఇప్పుడు ఎమ్మెల్సీ సభ్యత్వాలు రద్దయిన ప్రొఫెసర్ కోదండరామ్, అమేర్ అలీఖాన్‌ల నేపథ్యం చూస్తే గవర్నర్ కోటాలో ఎంపికకు వారికి అన్ని విధాలా అర్హతలున్నాయని అర్థమవుతుంది.
తెలంగాణ సాధనలో జేఏసీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ కోదండరామ్ పాత్ర తెలియనివారు లేరు. ఉర్దూ పత్రిక ‘సియాసత్’లో సీనియర్ పాత్రికేయుడైన అమేర్ అలీఖాన్ విద్యా, సంక్షేమ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. 2023లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదే స్థానాలకు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎంపిక చేసింది. వీరిద్దరికీ కూడా సామాజిక ఉద్యమాల్లో, సేవాకార్యకలాపాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ పాలిస్తున్నప్పుడు గవర్నర్ కోటా ఎంపికలపై రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సులకు గవర్నర్ నుంచి దాదాపు అభ్యంతరాలు వినబడవు. వేర్వేరు ప్రభుత్వాలున్నప్పుడే సమస్యంతా! విపక్షాలు ఎటూ అన్ని వేళలా విమర్శిస్తాయి. అయితే గవర్నర్ కోటాకు వీలు కల్పించే రాజ్యాంగంలోని 171(5) అధికరణం స్ఫూర్తిని చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు బేఖాతరు చేస్తున్నాయనీ, ‘రాజకీయ నిరుద్యోగుల’ పునరావాసానికి దాన్ని వినియోగిస్తున్నారనీ ఆరోపణలున్నాయి.
ఆ అధికరణం ప్రకారం సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళ, సహకారోద్యమం, సామాజిక సేవ తదితర రంగాల్లో పాటుబడినవారిని, ఆ రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, వ్యావహారిక అనుభవం ఉన్నవారిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయొచ్చు. మేధావులూ, కళాకారులూ, సేవాతత్పరత కలిగినవారూ నేరుగా పోటీచేసి నెగ్గే అవకాశం తక్కువ కాబట్టి శాసనాల రూపకల్పనలో, పాలనలో అటువంటివారి సేవలు పొందాలన్న ఉద్దేశంతో ఈ కోటా ఏర్పాటు చేశారు.
ఇలాంటివారితో ఏర్పడే సభ కనుకే పెద్దల సభ అనీ, ఎగువసభ అనీ శాసన మండళ్ళకూ, రాజ్యసభకూ పేరుంది. రాజ్యాంగంలోని 80వ అధికరణం రాజ్యసభకు రాష్ట్రపతి కోటా కింద ఎంపిక చేసే వీలు కల్పిస్తోంది. అయితే దేశ చరిత్రలో కేబినెట్ సిఫార్సు లేకుండా గవర్నర్ తనంత తానే నామినేట్ చేసిన ఏకైక ఉదంతం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
1952లో సీనియర్ నాయకుడు చక్రవర్తి రాజగోపాలాచారిని నాటి గవర్నర్ శ్రీ ప్రకాశ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అప్పటి ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని కూటమి అధిక స్థానాలు గెల్చుకోవటం, కాంగ్రెస్ మైనారిటీలో పడటంతో నాటి ప్రధాని నెహ్రూ మంత్రాంగం నడిపి అనారోగ్యంతో ఉన్న రాజగోపాలాచారిని సీఎంగా రప్పించారు.
అటుపై ఉప ఎన్నిక ద్వారా ఎమ్మెల్యే కావాలని ఆదేశించినా రాజగోపాలాచారి తిరస్కరించటంతో నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారంటారు. బల నిరూపణ సమయానికి రాజగోపాలాచారి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి పదవి నిలబెట్టుకున్నారు. శ్రీ ప్రకాశ తీరును మాత్రం ఇప్పటికీ ‘రాజ్యాంగ అనౌచిత్యం’గా రాజ్యాంగ నిపుణులు అభివర్ణిస్తారు.
దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులైన మేధావులూ, కళాకారులూ, సాహితీవేత్తలూ లేకపోలేదు. అయితే ఆ యా రంగాల్లో ఎన్నదగిన వైశిష్ట్యం ఉన్నా, రాజకీయ అనుకూలతలు తోడైనప్పుడే వారికి పదవులు దక్కుతున్నాయి. పదవులిస్తామన్నా వద్దని తిరస్కరించినవారూ లేకపోలేదు.
కర్ణాటక సీఎంగా దేవరాజ్ అర్స్ ఉన్నప్పుడు సీనియర్ పాత్రికేయుడు టీఎస్ రామచంద్రరావుకూ, రామకృష్ణ హెగ్డే సీఎంగా ఉన్నప్పుడు సాహితీవేత్త దేవనూర్ మహదేవకూ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అవకాశమిస్తామని చెప్పినా వారు తిరస్కరించారు. నిరుడు అక్టోబర్‌లో మహారాష్ట్రలో గవర్నర్ కోటా కింద 12 మందిని ఎంపిక చేసినప్పుడు కూడా వివాదం రాజుకుంది.
వారిలో కొందరు రాజ్యాంగం నిర్దేశిస్తున్న నిబంధనలకు తగినవారే అయినా, కొందరు పూర్తిగా రాజకీయ ప్రాపకంతోనే ఎంపికయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. ఎటూ వచ్చే నెల 17న సర్వోన్నత న్యాయస్థానం తాజా వివాదంలో తదుపరి విచారణ కొనసాగిస్తుంది. దీనిలో వెలువడే తుది తీర్పు ప్రభుత్వాలకు మార్గదర్శకం కాగలిగితే మంచిదే!