breaking news
telangana mlc
-
వివాదంలో ‘గవర్నర్ కోటా’
రాష్ట్రాల్లో అసెంబ్లీలుండగా శాసన మండళ్ళు అవసరమా అన్న వాదనతోపాటే ఆ శాసన మండళ్ళకు కొందరు సభ్యుల్ని నామినేట్ చేయటానికి గవర్నర్లకుండే అధికారాలపై, ఆ కోటాలో ఎంపికైన అభ్యర్థుల అర్హతలపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంటుంది. తెలంగాణ శాసన మండలికి నిరుడు గవర్నర్ కోటాలో ఎంపికైన విద్యావేత్త ప్రొఫెసర్ కోదండరామ్, పాత్రికేయుడు అమేర్ అలీఖాన్‌ల సభ్యత్వాలు రద్దుచేస్తూ బుధవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలీయటంతో ఆ అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. రాష్ట్రాల్లో శాసన మండళ్ళ మాదిరే కేంద్ర స్థాయిలో ఉండే రాజ్యసభకు చేసే ఎంపికలు కూడా అందరిలో ఆసక్తి రేపుతాయి. అంతేకాదు... వివాదాలకూ, అభ్యంతరాలకూ దారితీస్తుంటాయి. పాలకులుగా ఎవరున్నా ఈ రివాజు మారదు. ఇప్పుడు ఎమ్మెల్సీ సభ్యత్వాలు రద్దయిన ప్రొఫెసర్ కోదండరామ్, అమేర్ అలీఖాన్‌ల నేపథ్యం చూస్తే గవర్నర్ కోటాలో ఎంపికకు వారికి అన్ని విధాలా అర్హతలున్నాయని అర్థమవుతుంది. తెలంగాణ సాధనలో జేఏసీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ కోదండరామ్ పాత్ర తెలియనివారు లేరు. ఉర్దూ పత్రిక ‘సియాసత్’లో సీనియర్ పాత్రికేయుడైన అమేర్ అలీఖాన్ విద్యా, సంక్షేమ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే స్థానాలకు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎంపిక చేసింది. వీరిద్దరికీ కూడా సామాజిక ఉద్యమాల్లో, సేవాకార్యకలాపాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ పాలిస్తున్నప్పుడు గవర్నర్ కోటా ఎంపికలపై రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సులకు గవర్నర్ నుంచి దాదాపు అభ్యంతరాలు వినబడవు. వేర్వేరు ప్రభుత్వాలున్నప్పుడే సమస్యంతా! విపక్షాలు ఎటూ అన్ని వేళలా విమర్శిస్తాయి. అయితే గవర్నర్ కోటాకు వీలు కల్పించే రాజ్యాంగంలోని 171(5) అధికరణం స్ఫూర్తిని చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు బేఖాతరు చేస్తున్నాయనీ, ‘రాజకీయ నిరుద్యోగుల’ పునరావాసానికి దాన్ని వినియోగిస్తున్నారనీ ఆరోపణలున్నాయి. ఆ అధికరణం ప్రకారం సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళ, సహకారోద్యమం, సామాజిక సేవ తదితర రంగాల్లో పాటుబడినవారిని, ఆ రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, వ్యావహారిక అనుభవం ఉన్నవారిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయొచ్చు. మేధావులూ, కళాకారులూ, సేవాతత్పరత కలిగినవారూ నేరుగా పోటీచేసి నెగ్గే అవకాశం తక్కువ కాబట్టి శాసనాల రూపకల్పనలో, పాలనలో అటువంటివారి సేవలు పొందాలన్న ఉద్దేశంతో ఈ కోటా ఏర్పాటు చేశారు. ఇలాంటివారితో ఏర్పడే సభ కనుకే పెద్దల సభ అనీ, ఎగువసభ అనీ శాసన మండళ్ళకూ, రాజ్యసభకూ పేరుంది. రాజ్యాంగంలోని 80వ అధికరణం రాజ్యసభకు రాష్ట్రపతి కోటా కింద ఎంపిక చేసే వీలు కల్పిస్తోంది. అయితే దేశ చరిత్రలో కేబినెట్ సిఫార్సు లేకుండా గవర్నర్ తనంత తానే నామినేట్ చేసిన ఏకైక ఉదంతం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 1952లో సీనియర్ నాయకుడు చక్రవర్తి రాజగోపాలాచారిని నాటి గవర్నర్ శ్రీ ప్రకాశ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అప్పటి ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని కూటమి అధిక స్థానాలు గెల్చుకోవటం, కాంగ్రెస్ మైనారిటీలో పడటంతో నాటి ప్రధాని నెహ్రూ మంత్రాంగం నడిపి అనారోగ్యంతో ఉన్న రాజగోపాలాచారిని సీఎంగా రప్పించారు. అటుపై ఉప ఎన్నిక ద్వారా ఎమ్మెల్యే కావాలని ఆదేశించినా రాజగోపాలాచారి తిరస్కరించటంతో నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారంటారు. బల నిరూపణ సమయానికి రాజగోపాలాచారి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి పదవి నిలబెట్టుకున్నారు. శ్రీ ప్రకాశ తీరును మాత్రం ఇప్పటికీ ‘రాజ్యాంగ అనౌచిత్యం’గా రాజ్యాంగ నిపుణులు అభివర్ణిస్తారు.దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులైన మేధావులూ, కళాకారులూ, సాహితీవేత్తలూ లేకపోలేదు. అయితే ఆ యా రంగాల్లో ఎన్నదగిన వైశిష్ట్యం ఉన్నా, రాజకీయ అనుకూలతలు తోడైనప్పుడే వారికి పదవులు దక్కుతున్నాయి. పదవులిస్తామన్నా వద్దని తిరస్కరించినవారూ లేకపోలేదు. కర్ణాటక సీఎంగా దేవరాజ్ అర్స్ ఉన్నప్పుడు సీనియర్ పాత్రికేయుడు టీఎస్ రామచంద్రరావుకూ, రామకృష్ణ హెగ్డే సీఎంగా ఉన్నప్పుడు సాహితీవేత్త దేవనూర్ మహదేవకూ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అవకాశమిస్తామని చెప్పినా వారు తిరస్కరించారు. నిరుడు అక్టోబర్‌లో మహారాష్ట్రలో గవర్నర్ కోటా కింద 12 మందిని ఎంపిక చేసినప్పుడు కూడా వివాదం రాజుకుంది. వారిలో కొందరు రాజ్యాంగం నిర్దేశిస్తున్న నిబంధనలకు తగినవారే అయినా, కొందరు పూర్తిగా రాజకీయ ప్రాపకంతోనే ఎంపికయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. ఎటూ వచ్చే నెల 17న సర్వోన్నత న్యాయస్థానం తాజా వివాదంలో తదుపరి విచారణ కొనసాగిస్తుంది. దీనిలో వెలువడే తుది తీర్పు ప్రభుత్వాలకు మార్గదర్శకం కాగలిగితే మంచిదే! -
వారి సభ్యత్వాలు రద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: గవర్నర్ కోటాలో తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన ఫ్రొఫెసర్ కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. గతేడాది ఆగస్టు 14న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును ధర్మాసనం తాజాగా సవరించింది. మధ్యంతర ఉత్తర్వు మేరకు తీసుకున్న చర్యలు ఏవైనా రద్దయినట్టేనని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులోని.. ‘తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం..’ అనే వాక్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. దీంతో 2024 ఆగస్టు 16న ప్రొఫెసర్ కోదండరాం, అమేర్ అలీఖాన్‌లు ఎమ్మెల్సీలుగా చేసిన ప్రమాణ స్వీకారాలు రద్దయినట్టయ్యింది. గవర్నర్ కోటాకు సంబంధించి భవిష్యత్తులో జరిగే నామినేషన్లు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల నామినేషన్‌ను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది. వారు ఎమ్మెల్సీలుగా మండలిలో తిరిగి ప్రవేశించాలంటే మళ్లీ సిఫారసు చేయబడాలని జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండకూడదనే వాదనను తిరస్కరిస్తూ, ‘అప్పట్లో పిటిషనర్ల పేర్లు తిరస్కరించినప్పుడు కూడా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి..’ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. సిఫారసులు.. తిరస్కరణ.. సిఫారసులు 2023 జూలైలో అప్పటి సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సిఫారసు చేసింది. అయితే సెప్టెంబర్‌లో అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. వారికి రాజకీయ నేపథ్యం ఉండటాన్ని ప్రస్తావించడంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)కు అనుగుణంగా వారి నియామకాలు లేవని పేర్కొంటూ వారి నామినేషన్లను తిరస్కరించారు. కాగా 2023 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమేర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఈ నామినేషన్లతో పాటు, గవర్నర్ తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని దాసోజు, కుర్ర హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో హైకోర్టు.. గవర్నర్ తిరస్కరణను రద్దు చేయడంతో పాటు కొత్త నామినేషన్లను కూడా కొట్టివేసింది. గవర్నర్ మంత్రివర్గ సలహా మేరకే వ్యవహరించాలని, సవరణలు కోరే హక్కు మాత్రమే ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లగా, 2024 ఆగస్టు 14న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. కోదండరాం, అమేర్ అలీ ఖాన్లు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసుకోవడానికి అనుమతించింది. అయితే వారి నామినేషన్లు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది. తాజాగా బుధవారం జరిగిన వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వును సవరించింది. మధ్యంతర ఉత్తర్వు ఆధారంగా తీసుకున్న అన్ని చర్యలు, అందులో ప్రమాణ స్వీకారాలు కూడా రద్దు అవుతాయని స్పష్టం చేసింది. ఇకపై ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగే ఏ కొత్త నామినేషన్లు అయినా, సెప్టెంబర్ 17న జరిగే విచారణ తర్వాత వచ్చే తుది తీర్పుపైనే ఆధారపడి ఉంటాయని తెలిపింది. కాగా గవర్నర్ తరఫున వాదించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సిఫారసు మేరకే గవర్నర్ ఆమోదం తెలిపారని వాదించారు. పిటిషనర్లు తమ నామినేషన్ల అమలును కాదు, గవర్నర్ తిరస్కరణను సవాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్ పూర్తిగా రాజ్యాంగపరమైన విధానాన్నే అనుసరించారని చెప్పారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదించారు. గవర్నర్.. ‘హైకోర్టుకు నేనుజవాబు చెప్పాల్సిన అవసరం లేదు..’ అని చెప్పారని తెలియజేయగా, ‘చాలా దురదృష్టకరం’ అని జస్టిస్ విక్రమ్‌నాథ్ వ్యాఖ్యానించారు. -
భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం?
-
'కేసీఆర్ రాజు.. తెలంగాణ ఆయన రాజ్యంలా ఉంది'
ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తాను ఒక రాజులా, తెలంగాణ తన రాజ్యంలా భావిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆయన రాత్రే కాకుండా పగలు కూడా మత్తులో ఉంటున్నారా.. ఆయన ఆ మత్తులోంచి బయటకు రాకుండా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డే చేస్తున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పోలీసులకు చెబుతున్నదొకటి.. చేస్తున్నది ఇంకోటని, ఇప్పుడు పోలీసులకు 500 కోట్లు ఇస్తానంటున్న ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. అసలీ ప్రభుత్వం పోలీసు అధికారులను స్వతంత్రంగా పనిచేయనిస్తుందా అని అడిగారు. పోలీసులను టీఆర్ఎస్ ఏజెంట్లుగా ఉపయోగించుకుంటూ.. కాంగ్రేస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్యాయంగా 37 మంది రైతులపై కేసులు పెట్టి జైలులో పెట్టారని, అధికారం ఉందని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. చిన్న గొడవలను కూడా పెద్దవి చేసి కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నారని, అధికార పార్టీ దౌర్జన్యాలు భరించే కాలం పోయింది.. ఇక ఎదురుతిరిగే సమయం వచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాము తిరగబడితే, ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా టీఆర్ఎస్ నేతలు ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు. నల్లగొండ ఘటనలో జనాదరణ చూసి ఓర్వలేకే గొడవ జరిగేలా చేసి కేసులు పెట్టారని చెప్పారు. పోలీసులు విధి నిర్వహణలో రాజీ పడకూడదని, అధికార పక్షానికి తలొగ్గాల్సి వస్తే ఉద్యోగం వదిలేసినా తప్పులేదని అన్నారు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగి 9నెలలు గడిచినా కేసులో పురోగతి లేదని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి చెప్పారు. నయీమ్ డైరీ ఎక్కడ పోయింది.. అతను సంపాదించిన డబ్బు 1000 కోట్లు ఏమయ్యాయి... అతని బినామీ ఆస్తుల సంగతి ఏంటని వరుస ప్రశ్నలు సంధించారు. నయీమ్‌తో సంబంధం ఉన్న రాజకీయ నేతలను అరెస్టు చేయకపోతే లక్షమందితో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని చెప్పారు. మాది కాంగ్రెస్ రక్తం తమ ఒంట్లో ప్రవహించేది కాంగ్రెస్ రక్తమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాము బీజేపీలో చేరుతామంటూ వస్తున్న వార్తలలో ఎక్కడా వాస్తవం లేదన్నారు. తాము ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, కొంతమంది గిట్టని వ్యక్తులు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. -
'టీఆర్ఎస్ పతనం స్పష్టంగా కనబడుతోంది'
వరంగల్ : ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాళ్లతో కొట్టమని ... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం వరంగల్‌లో ఉప ఎన్నిక ప్రచారంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... టీఆర్ఎస్ పతనం స్పష్టంగా కనడబడుతోందన్నారు. కేసీఆర్.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో ఫామ్‌హౌజ్‌లో కూర్చుని జరిపిన చర్చల్లో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటో ప్రజలకు వివరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. -
ఐదుగురూ గెలిచారు!
-
ఐదుగురూ గెలిచారు!
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన ఐదుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. శాసన మండలిలోని ఆరు ఖాళీ స్థానాలకు సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో.. టీఆర్ఎస్ ఐదు స్థానాలను, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఓడిపోయారు. టీడీపీ - బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లలో ఐదు 'నోటా'కు పడ్డాయి. అయితే ఇవి బీజేపీ ఎమ్మెల్యేలు వేసినవా, టీడీపీ వాళ్లు వేసినవా అనేది తెలియడంలేదు. కాంగ్రెస్ నుంచి మొత్తం 18 ఓట్లు ఆకుల లలితకే పడ్డాయి. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకునేందుకు తగినంత బలం ఉంది. కానీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఎలాగైనా ఐదుగురినీ గెలిపించాల్సిందేనని, లేకపోతే అసెంబ్లీని సైతం రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్తానని కూడా పార్టీ అంతర్గత సమావేశాల్లో హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈలోపు నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసేందుకు వెళ్లిన టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోవడం లాంటి సంచలన విశేషాలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానే జరిగాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు.. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్, కె.యాదవ్రెడ్డి (టీఆర్ఎస్) ఆకుల లలిత (కాంగ్రెస్) తెలంగాణ అసెంబ్లీలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది సభ్యులున్నారు. వీరిలో ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగుకు దూరంగా ఉన్నారు. మొత్తం 118 మంది (రేవంత్‌రెడ్డి సహా) తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తెలంగాణలో రంజుగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు!