
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల నియామకంపై సుప్రీం సంచలనాత్మక తీర్పు
గవర్నర్ కోటా నామినేషన్లపై మధ్యంతర ఉత్తర్వు సవరణ
మధ్యంతర ఉత్తర్వు మేరకు తీసుకున్న చర్యలన్నీ రద్దయినట్టేనన్న ధర్మాసనం
భవిష్యత్ నామినేషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టీకరణ
తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: గవర్నర్ కోటాలో తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన ఫ్రొఫెసర్ కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. గతేడాది ఆగస్టు 14న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును ధర్మాసనం తాజాగా సవరించింది.
మధ్యంతర ఉత్తర్వు మేరకు తీసుకున్న చర్యలు ఏవైనా రద్దయినట్టేనని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులోని.. ‘తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం..’ అనే వాక్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. దీంతో 2024 ఆగస్టు 16న ప్రొఫెసర్ కోదండరాం, అమేర్ అలీఖాన్‌లు ఎమ్మెల్సీలుగా చేసిన ప్రమాణ స్వీకారాలు రద్దయినట్టయ్యింది.
గవర్నర్ కోటాకు సంబంధించి భవిష్యత్తులో జరిగే నామినేషన్లు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల నామినేషన్‌ను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది.
వారు ఎమ్మెల్సీలుగా మండలిలో తిరిగి ప్రవేశించాలంటే మళ్లీ సిఫారసు చేయబడాలని జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండకూడదనే వాదనను తిరస్కరిస్తూ, ‘అప్పట్లో పిటిషనర్ల పేర్లు తిరస్కరించినప్పుడు కూడా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి..’ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.
సిఫారసులు.. తిరస్కరణ.. సిఫారసులు
2023 జూలైలో అప్పటి సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం, దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సిఫారసు చేసింది. అయితే సెప్టెంబర్‌లో అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. వారికి రాజకీయ నేపథ్యం ఉండటాన్ని ప్రస్తావించడంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)కు అనుగుణంగా వారి నియామకాలు లేవని పేర్కొంటూ వారి నామినేషన్లను తిరస్కరించారు.
కాగా 2023 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమేర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఈ నామినేషన్లతో పాటు, గవర్నర్ తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని దాసోజు, కుర్ర హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో హైకోర్టు.. గవర్నర్ తిరస్కరణను రద్దు చేయడంతో పాటు కొత్త నామినేషన్లను కూడా కొట్టివేసింది.
గవర్నర్ మంత్రివర్గ సలహా మేరకే వ్యవహరించాలని, సవరణలు కోరే హక్కు మాత్రమే ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లగా, 2024 ఆగస్టు 14న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. కోదండరాం, అమేర్ అలీ ఖాన్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసుకోవడానికి అనుమతించింది. అయితే వారి నామినేషన్లు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది.
తాజాగా బుధవారం జరిగిన వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వును సవరించింది. మధ్యంతర ఉత్తర్వు ఆధారంగా తీసుకున్న అన్ని చర్యలు, అందులో ప్రమాణ స్వీకారాలు కూడా రద్దు అవుతాయని స్పష్టం చేసింది. ఇకపై ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగే ఏ కొత్త నామినేషన్లు అయినా, సెప్టెంబర్ 17న జరిగే విచారణ తర్వాత వచ్చే తుది తీర్పుపైనే ఆధారపడి ఉంటాయని తెలిపింది.
కాగా గవర్నర్ తరఫున వాదించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సిఫారసు మేరకే గవర్నర్ ఆమోదం తెలిపారని వాదించారు. పిటిషనర్లు తమ నామినేషన్ల అమలును కాదు, గవర్నర్ తిరస్కరణను సవాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్ పూర్తిగా రాజ్యాంగపరమైన విధానాన్నే అనుసరించారని చెప్పారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదించారు. గవర్నర్.. ‘హైకోర్టుకు నేనుజవాబు చెప్పాల్సిన అవసరం లేదు..’ అని చెప్పారని తెలియజేయగా, ‘చాలా దురదృష్టకరం’ అని జస్టిస్ విక్రమ్‌నాథ్ వ్యాఖ్యానించారు.