'కేసీఆర్ రాజు.. తెలంగాణ ఆయన రాజ్యంలా ఉంది'

'కేసీఆర్ రాజు.. తెలంగాణ ఆయన రాజ్యంలా ఉంది' - Sakshi


ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తాను ఒక రాజులా, తెలంగాణ తన రాజ్యంలా భావిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆయన రాత్రే కాకుండా పగలు కూడా మత్తులో ఉంటున్నారా.. ఆయన ఆ మత్తులోంచి బయటకు రాకుండా జిల్లా మంత్రి జగదీష్‌ రెడ్డే చేస్తున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పోలీసులకు చెబుతున్నదొకటి.. చేస్తున్నది ఇంకోటని, ఇప్పుడు పోలీసులకు 500 కోట్లు ఇస్తానంటున్న ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. అసలీ ప్రభుత్వం పోలీసు అధికారులను స్వతంత్రంగా పనిచేయనిస్తుందా అని అడిగారు. పోలీసులను టీఆర్ఎస్ ఏజెంట్లుగా ఉపయోగించుకుంటూ.. కాంగ్రేస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్యాయంగా 37 మంది రైతులపై కేసులు పెట్టి జైలులో పెట్టారని, అధికారం ఉందని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు.



చిన్న గొడవలను కూడా పెద్దవి చేసి కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నారని, అధికార పార్టీ దౌర్జన్యాలు భరించే కాలం పోయింది.. ఇక ఎదురుతిరిగే సమయం వచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాము తిరగబడితే, ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా టీఆర్ఎస్ నేతలు ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు. నల్లగొండ ఘటనలో జనాదరణ చూసి ఓర్వలేకే గొడవ జరిగేలా చేసి కేసులు పెట్టారని చెప్పారు. పోలీసులు విధి నిర్వహణలో రాజీ పడకూడదని, అధికార పక్షానికి తలొగ్గాల్సి వస్తే ఉద్యోగం వదిలేసినా తప్పులేదని అన్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి 9నెలలు గడిచినా కేసులో పురోగతి లేదని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి చెప్పారు. నయీమ్ డైరీ ఎక్కడ పోయింది.. అతను సంపాదించిన డబ్బు 1000 కోట్లు ఏమయ్యాయి... అతని బినామీ ఆస్తుల సంగతి ఏంటని వరుస ప్రశ్నలు సంధించారు. నయీమ్‌తో సంబంధం ఉన్న రాజకీయ నేతలను అరెస్టు చేయకపోతే  లక్షమందితో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని చెప్పారు.



మాది కాంగ్రెస్ రక్తం

తమ ఒంట్లో ప్రవహించేది కాంగ్రెస్ రక్తమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాము బీజేపీలో చేరుతామంటూ వస్తున్న వార్తలలో ఎక్కడా వాస్తవం లేదన్నారు. తాము ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, కొంతమంది గిట్టని వ్యక్తులు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top