
సంస్థాన్ నారాయణపురం: ‘పదవుల్లో మీరే ఉంటరు.. పైసలు మీరే తీసుకుంటరు. నాకు పదవి ఇవ్వకపోయినా నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘పదవి వచ్చేటప్పుడు వస్తుంది. మనను ఎవరూ ఆపలేరు.
పదవులు మీకే.. పైసల్ మీకే అని కొన్ని రోజుల కిందట అన్నాను. సీఎం రేవంత్‌రెడ్డిని అన్నానని తెలుసు కదా. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదు. మంత్రి దగ్గరకి వెళ్లి అడిగినా రాలే. పనిచేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించమంటున్నారు. బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్ చేతిలో ఉంది. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి’ అని వ్యాఖ్యానించారు. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, తనకు పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.