ఇదే నెలలో మిగతా సెట్స్
త్వరలో సెట్ కన్వీనర్లతో భేటీ
షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్)ను 2026 మే 4 నుంచి నిర్వహిస్తారు. ఫార్మసీ, అగ్రికల్చర్ సెట్‌ను మే 4, 5 తేదీల్లో రెండు రోజులపాటు, ఇంజనీరింగ్ సెట్‌ను మే 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. మిగతా సెట్స్‌ను కూడా మే నెలలోనే చేపడతారు. ఇందుకు సంబంధించిన తేదీలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్‌తో కలిసి మంగళవారం విడుదల చేశారు. సెట్ కన్వీనర్లు, సెట్ నిర్వహించే యూనివర్సిటీలను సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రవేశ పరీక్షల సమగ్ర సమాచారాన్ని త్వరలోనే సెట్ కన్వీనర్లు విడుదల చేస్తారని మండలి తెలిపింది. 


