అర్హతలో బాలికలు.. ర్యాంకుల్లో బాలురు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్)లో బాలికలే పైచేయి సాధించారు. అయితే, టాప్ ర్యాంకుల్లో మాత్రం బాలురే ముందు వరుసలో ఉన్నారు. ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా విభాగాల్లో టాప్ ర్యాంకులు అత్యధికంగా బాలురకే దక్కాయి. మొత్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 73.26 శాతం అర్హత సాధిస్తే, అగ్రి, ఫార్మసీ సెట్లో 87.82 శాతం మంది అర్హత సాధించారు. ఈఏపీసెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు తన నివాసంలో విడుదల చేశారు. అర్హత సాధించిన విద్యార్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్‌రెడ్డి, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దీన్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. టాపర్లంతా బాలురే ఈఏపీసెట్ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ సెట్‌కు 2,20,326 మంది దరఖాస్తు చేసుకుంటే, 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,51,779 మంది (73.26 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 86,762 మంది దరఖాస్తు చేసుకుంటే, 81,198 మంది పరీక్ష రాశారు. వీరిలో 71,309 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ సెట్లో బాలికలు 73.88 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 72.79 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. అగ్రి, ఫార్మసీ సెట్లో బాలికలు 88.32 శాతం, బాలురు 86.29 శాతం అర్హత సాధించారు. అయితే, టాప్ ర్యాంకుల్లో ఎక్కువగా బాలురే కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్‌లో మొదటి పది ర్యాంకులు బాలురకే దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురంకు చెందిన పల్లా భరత్‌చంద్ర మొదటి ర్యాంకు దక్కించుకుంటే, హైదరాబాద్‌కు చెందిన ఉడగండ్ల రమాచరణ్రెడ్డి రెండో ర్యాంకు దక్కించుకున్నారు. మూడో ర్యాంకు కూడా ఏపీకి చెందిన పమ్మిన హేమసాయి సూర్యకార్తీక్‌కు వచ్చింది. నాన్–లోకల్ కోటాను ఈ ఏడాది నుంచి ఎత్తివేయటంతో ఏపీకి చెందిన విద్యార్థులు సెట్ రాయడం వరకే అర్హులు. వారికి స్థానిక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయించరు. అగ్రి, ఫార్మసీ విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో 9 ర్యాంకులు బాలురకే దక్కాయి. హైదరాబాద్‌కు చెందిన సాకేత్‌రెడ్డి మొదటి స్థానం పొందారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన బ్రాహ్మిణి రెండ్ల ఐదవ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ ర్యాంకర్లు....డాక్టర్‌గా పేద ప్రజలకు సేవ చేయాలని ఉంది డాక్టర్‌గా పేద ప్రజలు సేవ చేయాలని ఉంది. నీట్లో కూడా మంచి ర్యాంక్ ఆశిస్తున్నా. తల్లిదండ్రుల, అధ్యాపకులు, స్నేహితుల ప్రోత్సాహంతోనే టాప్ ర్యాంక్ సాధించగలిగా. – సాకేత్‌రెడ్డి, 1వ ర్యాంకర్డాక్టర్ కావాలన్నదే లక్ష్యం కష్టపడి చదవటం వల్లే మూడో ర్యాంక్ సాధించగలిగాను. సంతోషంగా ఉంది. డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. ఇంటర్మీడియెట్ బైపీసీలో 992 మార్కులు వచ్చాయి. ఇటీవల ‘నీట్’పరీక్ష రాశాను. మంచి మార్కులు వస్తాయని భావిస్తున్నాను. నీట్ ఫలితాలు విడుదలయ్యాక ఎంబీబీఎస్‌లో చేరతాను. – చాడా అక్షిత్, 3వ ర్యాంకర్గొప్ప డాక్టర్‌గా పేరు తెచ్చుకుంటా ఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 4వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, లెక్చరర్ల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. నేను ప్రతి రోజూ 16 గంటలు చదివాను. ఇందులో మంచి ర్యాంక్ వచి్చనప్పటికీ నా దృష్టి మొత్తం నీట్‌పైనే ఉంది. గొప్ప డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది. – సాయినంద్, 4వ ర్యాంకర్మెడిసిన్ చదివి ప్రజలకు సేవ చేస్తా మెడిసిన్ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉంది. నీట్లో కూడా ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు సాధించాను. అధ్యాపకులు కూడా మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. –బ్రాహ్మిణి రెండ్ల, 5వ ర్యాంకర్,వైద్యవృత్తి పట్ల నాకు ఆసక్తి వైద్యవృత్తి పట్ల నాకు ఆసక్తి ఎక్కువ. ఈఏపీ సెట్లో మంచి ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల శిక్షణతో ర్యాంకు సాధించగలిగా. నీట్లో కూడా మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నా. – గుమ్మడిదల తేజస్, 6వ ర్యాంకర్డాక్టర్ కావడం నా కల డాక్టర్ కావడం నా కల. వైద్య వృత్తిలో చేరి పేద ప్రజలకు సేవ చేస్తా. నీట్లో సైతం మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నా. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రణాళికాబద్ధంగా చదవడంవల్లే మంచి ర్యాంక్ సాధించగలిగాను. – కొలను అఖీరానంద్రెడ్డి, 7వ ర్యాంకర్పేదలకు వైద్య సేవలు అందిస్తా డాక్టర్‌గా మారి పేదలకు సేవ చేయాలని ఉంది. నీట్లో కూడా టాప్ టెన్‌్త ర్యాంక్ ఆశిస్తున్నా. మెదటి నుంచి డాక్టర్ కావాలనేది నా లక్ష్యం. ఆ దిశలోనే పట్టుదలతో చదివా. ఆసక్తి లేకపోయినా కళాశాల అధ్యాపకుల సలహాతోనే టీజీ ఈఏపీసెట్ పరీక్ష రాశాను. నీట్ పరీక్ష అంతకంటే బాగా రాశాను. అధ్యాపకుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ర్యాంక్ సాధించగలిగాను. – భానుప్రకాష్‌రెడ్డి, 8వ ర్యాంకర్ ఇంజనీరింగ్ ర్యాంకర్లు...ఐఐటీ బాంబేలో చదవాలని ఉంది ఐఐటీ బాంబేలో చదవాలని ఉంది. ఎంసెట్‌లో 2వ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల గైడెన్స్‌తో ర్యాంకు సాధించగలిగా. – ఉడగండ్ల రామచరణ్‌రెడ్డి, 2వ ర్యాంకర్ సివిల్ సర్వీసెస్ టార్గెట్ సివిల్ సర్వీసెస్ సాధించటం నా లక్ష్యం. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చేయాలని ఉంది. ఇటీవల జేఈఈ మెయిన్‌లో జనరల్ కేటగిరీ 75వ ర్యాంక్, ఓబీసీలో 10వ ర్యాంక్ సాధించా. ఇంజనీరింగ్ పూర్తి కాగానే సివిల్స్‌కు సిద్ధమవుతా. – సూర్యకార్తీక్, 3వ ర్యాంకర్ ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతా ఐఐటీ బాంబేలో సీటు సాధించడం లక్ష్యం. జేఈఈ మెయిన్‌లో 70వ ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంక్ సాధించగలిగా. ఐఐటీ తర్వాత సివిల్ సర్వీసెస్‌కు సిద్ధం కావాలని ఉంది. – లక్ష్మీ భార్గవ్, 4వ ర్యాంకర్ ఐఐటీ బాంబేలో చేరటమే లక్ష్యం ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదవటమే నా లక్ష్యం. ప్రస్తుతం ఈఏపీ సెట్లో 5వ ర్యాంక్ రావటం సంతోషంగా ఉంది. ఈ పరీక్ష కోసం ప్రణాళికాబద్ధంగా చదివాను. – వెంకటగణేష్ రాయల్, 5వ ర్యాంకర్భవిష్యత్లో సివిల్స్‌కు ప్రిపేరవుతా ఈఏపీ సెట్లో మంచి ర్యాంక్ రావటం సంతోషంగా ఉంది. నా అసలు లక్ష్యం సివిల్స్ సాధించటం. భవిష్యత్‌లో సివిల్స్‌కు ప్రిపేరవుతా. నా సోదరి కూడా సివిల్స్ సాధించింది. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియా 31వ ర్యాంక్ సాధించా. ఓబీసీ కేటగిరీలో మూడో ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సీరియస్‌గా చదువుతున్నాను. –రుస్మిత్ బండారి, 7వ ర్యాంకర్తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది ఈఏపీ సెట్లో ర్యాంక్ సాధించడానికి దేవుడి దయ, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. మంచి ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉంది. కళాశాల ప్రిన్సిపాల్, డీన్ పూర్తి సహకారం అందించారు. – అర్జా శామ్యూల్ సాత్విక్, 9 ర్యాంకర్డాక్టర్ కావటమే లక్ష్యం డాక్టర్ కావటమే నా లక్ష్యం. అందుకోసం కష్టపడి చదివాను. దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివాను. నీట్ కోసం శిక్షణ తీసుకుంటూనే ఈఏపీ సెట్ రాశాను. – శశికిరణ్, 10వ ర్యాంకర్