
నల్లగొండ జిల్లా: ఎక్సైజ్ పాలసీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో ఆయన మరోసారి ప్రభుత్వ ఎక్సైజ్ విధానాలను ఎత్తి చూపారు. ఎక్సైజ్ పాలసీని మార్చాల్సిందేనని.. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే బదులు.. మెరుగు పరిచేలా ప్రభుత్వం పనిచేయాలి. వైన్ షాపుల విషయంలో మునుగోడులో తన సూచనలు పాటించాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. పదవి ఉన్నా లేకున్నా ఒకటే.. అన్ని ప్రాంతాల్లో నడిచినట్లు మునుగోడులో నడవనీయనంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మునుగోడులో ఎమ్మెల్యే నూతన నిబంధనలు
మద్యం దుకాణాలకు ఈ నెలతో గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్తగా టెండర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అందుకు ఈ నెల 18 వరకు గడువు ఉంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని మద్యం దుకాణాల టెండర్లు వేయాలనుకునే వ్యాపారులు తాను సూచిస్తున్న నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని టెండర్లు వేయకముందే చెబుతున్నానని పేర్కొంటున్నారు.
అంతే కాకుండా నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలను నల్లగొండ ఎక్సైజ్ కార్యాలయానికి పంపి ఎమ్మెల్యే సూచనలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌కు పంపారు. కార్యాలయం బయట ఆ సూచనల పోస్టర్‌ను ఏర్పాటు చేయించారు. తాను చేస్తున్నది ఎవ్వరి మీదనో కోపంతో కాదని.. అలా అని తాను మద్యానికి పూర్తిగా వ్యతిరేకం కూడా కాదని అంటున్నారు. కొందరు యువకులు, నడి వయస్సు వాళ్లు కుటుంబ పోషణ మరచి ఉదయం నుంచే మద్యం తాగి అనారోగ్యం బారిన పడుతున్నారని.. అలాంటి వారిని కాపాడేందుకే తాను ఈ నిర్ణయాలు తీసుకున్నాని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు.
ఎమ్మెల్యే చేస్తున్న సూచనలు ఇవీ..
మద్యం దుకాణాలు గ్రామ శివారులో ఏర్పాటు చేయాలి.
మద్యం దుకాణంలో సిట్టింగ్ ఏర్పాటు చేయకూడదు
బెల్ట్‌షాపులకు మద్యం విక్రయించవద్దు
మద్యం వ్యాపారులు సిండికేట్ కావొద్దు
రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలి
కొత్తగా టెండర్లు వేసేవారు ఈ షరతులు పాటిస్తామంటేనే టెండర్లు వేయాలని, లేదంటే టెండర్లు వేసి నష్టపోవద్దని తమ నాయకులతో సోషల్ మీడియాతో వైరల్ చేయడంతోపాటు గొడలపై పోస్టర్లు ఏర్పాటు చేయించారు.
